October 3, 2026

ఉప ఎన్నికలకు వెళదాం

  • కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిద్దాం
  • మనకెందుకు ఈ అనవసర అప్రతిష్ఠ?
  • జనం మనతో ఉన్నందున గెలుపు సులభం
  • అన్ని ఎన్నికల్లోనూ మనమే గెలిచాం కదా?
  • రేవంత్ హయాంలో పార్టీకి ఓటమిలేదని తేలిపోయింది
  • సర్వేలు కూడా మనకే అనుకూలం
  • బీఆర్‌ఎస్-బీజేపీ పోరుతో మళ్లీ మనకే లాభం
  • మహిళలు మనవె ంటే ఉన్నారు
  • అధికారంలో ఉన్నాం.. మనకు భయమెందుకు?
  • అందుకే ఆ 9 స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళదాం
  • ఉప ఎన్నికల్లో అన్ని సీట్లు సాధించిన ఏకైక సీఎం అన్న రికార్డు సృష్టిద్దాం
  • ఫిరాయింపు ముద్రను జనం మెచ్చరు
  • వచ్చే ఎన్నికల్లో అది వారికే నష్టం
  • అందువల్ల ఇప్పుడే మళ్లీ జనం తీర్పు కోరదాం
  • పార్టీ భవిష్యత్తుకు ఇవి రిహార్సల్‌గా పెట్టుకుందాం
  • ఓడితే పార్టీ వ్యూహం మార్చుకునే అవకాశం
  • పార్టీ మారిన 9 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళదామంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
  • ఉప ఎన్నికలకు వెళ్లకపోతే భయపడుతున్నామన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం
  • బీఆర్‌ఎస్, బీజేపీ నోళ్లు మూయిద్దామంటున్న మంత్రులు, సీనియర్లు
  • మరి రేవంత్‌రెడ్డి నిర్ణయం ఏమిటో?

( మార్తి సుబ్రహ్మణ్యం)

రేవంత్‌రెడ్డి సీఎంగా పట్టాభిషేకం జరిగిన ఈ మూడేళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోలేదు. అన్నీ శుభశకునాలే. అన్నీ విజయాలే. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పంచాయితీ, కో ఆపరేటివ్ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో మీసం మెలేసిన మనకు.. కేవలం ఆ 9 నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకు? జనం మనవెంట ఉన్నందుకే కదా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచాం? అన్ని సర్వేలూ మనకే అనుకూలంగా ఉన్నాయి.

మరి పార్టీ మారిన ఆ 9 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయపడి, బీఆర్‌ఎస్-బీజేపీ సవాళ్లను నిజం చేయడమెందుకు? జనాలకు మేలు చేసే పథకాలు అమలుచేస్తున్న మనకు ఉప ఎన్నికలంటే భయమెందుకు? పైగా.. ఆ 9 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళితే జనంపల్సు తెలుస్తుంది. అదే మనకు రానున్న ఎన్నికలకు దిశానిర్దేశం చేసే వ్యూహానికి అక్కరకొస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆ 9 నియోజవర్గాల ఉప ఎన్నిక ఫలితాలు ఒక రిహార్సల్ వంటివి.

ఇదీ.. పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. అక్కడ ఉప ఎన్నికలు జరిపించాలన్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సీనియర్ల వాదన. మరి వారి వాదనకు సీఎం రేవంత్ ఓటేస్తారా? వీటో చేస్తారా?.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమైనందున.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలకు వెళదామన్న చర్చ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్లలో మొదలయింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు- సీఎం రేవంత్‌రెడ్డి ప్రభంజనం వీస్తున్నందున, పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి, తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని మంత్రులు వాదిస్తున్నారు. ఆలస్యం చేసేకొద్దీ.. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందన్న అపప్రదను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ బి ఫారంపై గెలిచిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ‘నియోజకవర్గ అభివృద్ధి’ పేరుతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. వీరిలో పటన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా, మళ్లీ వెనక్కివెళ్లారు. దీనితో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లయింది.

కాగా వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ, బీఆర్‌ఎస్ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది. స్పీకర్‌కూ ఫిర్యాదు చేసింది. అందులో భాగంగా గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పొటీచేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను, సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికతోపాటు, పార్టీ మారిన మిగిలిన 9 మంది ఎమ్లెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా, పార్టీపై పడిన ‘ఫిరాయింపు మచ్చ’ను తొలగించుకోవాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. ‘మళ్లీ అక్కడ గెలవడం ద్వారా అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారన్న వాదనను నిజం చేయవచ్చు’ అని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, ఈలోగా పార్టీ మారిన 9 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా మళ్లీ అక్కడ గెలిచే అవకాశాలున్నాయని పలువురు మంత్రులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు జరగవచ్చంటున్నారు.

‘ మేం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచాం. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ మల్లేష్‌ను గెలిపించుకున్నాం. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. కో ఆపరేటివ్ ఎన్నికల్లోనూ మాదే విజయం. ఇవ న్నీ కేవలం రేవంత్‌రెడ్డి ఇమేజ్‌తోనే సాధ్యమయింది. పైగా మహిళలకు ఉచితబస్సు అస్త్రం అదనం. ఇన్ని సానుకూలత అంశాలుండగా ఉప ఎన్నికలకు భయపడటం అనవసరం. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభంజనం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోవడమే తెలివైన పని’’ అని ఓ సీనియర్ మంత్రి విశ్లేషించారు.

తమకు సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం, ఎత్తుగడపై సంపూర్ణ విశ్వాసం ఉందని, అన్ని స్ధానాలూ గెలిపించే సత్తా ఆయనకు ఉందంటున్నారు. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమంటున్నారు. ‘మేం అధికారంలో ఉన్నాం.సహజంగా యంత్రాగం మాకు అనుకూలంగానే ఉంటుంది.ప్రత్యర్ధులకంటే మేమే ఎక్కువ ఖర్చు చేయగలుతాం. అలాంటప్పుడు ఉప ఎన్నికలకు భయపడటం అవివేకం’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

పైగా ఈ ఎమ్మెల్యేలే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. వారిపై ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల’ ముద్ర పడి, పార్టీ నష్టపోతుందని మంత్రులు, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘ హామీ ప్రకారం మేం మళ్లీ వచ్చే ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ఇస్తాం. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు మళ్లీ ఓటేస్తారా అని ప్రత్యర్థి పార్టీలు జనంలో ప్రచారం పెడితే ఆ 9 సీట్లూ పోతాయ’ని విశ్లేషిస్తున్నారు.

9 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ-బీఆర్‌ఎస్ ఓట్లు చీలిపోయి, గతంలో మాదిరిగా మళ్లీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్లేషిస్తున్నారు. గత సాధారణ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు.
‘ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హవా నడుస్తోంది. కాంగ్రెస్‌ను ఏ ఎన్నికల్లో అయినా ఆయనొక్కడే గెలిపించగలరన్న నమ్మకం హైకమాండ్‌లోనూ ఏర్పడింది. రేపు కూడా రేవంత్‌ను చూసే కాంగ్రెస్‌కు ఓటేయాలి. మరి అలాంటప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లడానికి భయమెందుకు? ఈ ఎన్నికల్లో మాదే విజయం. ఒకరకంగా ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్‌గా భావించాలి. వచ్చిన ఫలితాలను బట్టి వ్యూహం మార్చుకునే అవకాశం ఉంటుంది. అయినా రేపటి ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటమితో ప్రభుత్వమేమీ పడిపోదు కదా’ అని ఓ సీనియర్ మంత్రి విశ్లేషించారు.

Total Visitors: 2,854,733