– ప్రపంచ రికార్డ్ సాధించేలా 5 లక్షల మందితో యోగాసనాలు
– ఆర్కే బీచ్ వేదికగా యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష
– క్షేత్ర స్థాయిలో యోగా డే నిర్వహణ సన్నద్ధతను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖ: ఈ నెల 21వ తేదీన విశాఖలో తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ మైదానంలో చేసిన ఏర్పాట్లనూ సీఎం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారనే అంశంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు. యోగా డే ను ప్రపంచ రికార్డు సాధించేలా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
యోగా డే డిక్లరేషన్ చేద్దాం
యోగా డే నిర్వహణపై నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇంటర్నేషనల్ యోగా డే డిక్లరేషన్ చేద్దాం. యోగా అనేది నిత్య జీవితంలో భాగంగా మారేలా కృషి చేద్దాం. విశాఖలో చారిత్రక వేడుకకు నాంది పలుకుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది వరకు యోగా డేలో పాల్గొంటారని అంచనా వేస్తున్నాం.
5 లక్షల మందితో యోగా చేయడానికి విశాఖ వేదికైంది. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా డే నిర్వహణకు అనువైన ప్రాంతం ఉంది. దేశంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదు. విశాఖలో జరిగే కార్యక్రమంతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
యోగా అందరి జీవితాల్లో భాగం చేసేలా ప్రణాళిక
యోగా డే నిర్వహణకు సంబంధించి భారతీయ నౌకాదళం కూడా 11 నౌకల్ని ఆర్కే బీచ్ సమీపంలో ప్రదర్శించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ “ప్రాక్టీస్ చేసిన వాళ్లే యోగాడేలో పాల్గొంటారు. ప్రజా ఉద్యమంగా యోగాను ముందుకు తీసుకెళ్లాలి. ప్రధానికి ఇచ్చిన మాట ప్రకారం యోగా నిర్వహణకు ప్రణాళికను రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 607 వార్డ్ సచివాలయాల సిబ్బంది సమన్వయం చేసుకోవాలి.
326 కంపార్టమెంట్లల్లో యోగాసనాలు వేసేలా ప్రణాళిక చేశాం. పార్కింగ్, టాయిలెట్ల ఏర్పాట్లల్లో ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారికి ముందుగానే అన్ని వివరాలను అందించాలి. కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
1987 మహానాడును గుర్తు చేసుకున్న సీఎం
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో 1987 మహానాడుపై ఆసక్తికర ప్రస్తావన వచ్చింది. అప్పుడు కళా వెంకట్రావు ఉన్నారంటూ నాటి సంగతులను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సరైన వసతులు లేని సమయంలో కూడా అద్భుతంగా మహానాడును నిర్వహించామన్నారు. నాటి మహానాడుకు ఎంత మంది వస్తారు.. ఎంత దూరం నడుస్తారనేది కూడా ముందుగానే అంచనా వేసుకున్నామన్నారు. హాజరయ్యే వారంతా పసుపు చొక్కాలు వేసుకురావాలని చెప్పామన్నారు. అలా వేసుకు రాని వారి చొక్కాలను పసుపు నీళ్ల డ్రమ్ముల్లో ముంచి తడిపి ఇచ్చామంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఈ తరహా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించవచ్చని సీఎం అన్నారు.
యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పరిశీలన
సోమవారం విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు అంతర్జాతీయ యోగా డే నిర్వహించే వేదిక ఆర్కే బీచ్ లో చేసిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. వేదిక వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేశారు. ఆ తర్వాత ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకూ బీచ్ రోడ్డులో ప్రయాణించి పరిశీలన చేశారు. అటు ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో చేసిన ఏర్పాట్లను కూడా సీఎం సమీక్షించారు. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగా డేలో హాజరయ్యేలా చేస్తున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించారు.
యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను, ప్రధాని పర్యటనకు సంబంధించిన అంశాలను యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు సీఎంకు వివరించారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్ వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంథిర ప్రసాద్ వివరించారు. అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.
అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు హాజరవుతున్నందున ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు.