Suryaa.co.in

Andhra Pradesh

సమన్వయంతో ‘యోగాంధ్ర’ను విజయవంతం చేద్దాం

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

భీమిలి/ విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దిశానిర్దేశం చేశారు.

శుక్రవారం టీడీపీ భీమిలి కార్యాలయంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, అబ్జర్వర్లు, కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. శనివారం నిర్వహించే యోగాంధ్ధ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ నుంచి నిర్దేశించిన లక్ష్యం మేర 50 వేల మందిని పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.

ఆరోగ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి అయిదు లక్షల మంది హాజరవుతున్నారని, వారందరికీ మ్యాట్, తాగునీరు, అల్పాహారం అందిస్తున్నామన్నారు. భీమిలికి కేటాయించిన కంపార్ట్ మెంట్లకు యోగా చేసే వారిని ఉదయం అయిదు గంటలకే చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, అధికారులు, కూటమి నాయకులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఏర్పాట్లలో లోటు రానివ్వొద్దన్నారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమకు అప్పగించిన లక్ష్యం మేర యోగాసనాలకు జన సమీకరణ చేస్తున్నామన్నారు. కూటమి నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ యశస్విని, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున, టీడీపీ గుంటూరు అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, లేబర్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, టీడీపీ నాయకులు ఆలం నర్సానాయుడు, రాయల మురళీ, మర్రెడ్డి శ్రీనివాసరారెడ్డి, రామలింగారెడ్డి, దేవళ్ల మురళీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE