Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలను నివారిద్దాం..

* సమిష్టి కృషితో ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం…
* రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి…
* జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు.

ఎన్‌టీఆర్ జిల్లా : ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సమిష్టి కృషితో ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు తెలిపారు.

రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేది నుండి నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రత మాసోత్సవాల ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాలు, బుక్ లెట్స్ బ్యానెర్లను గురువారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు, డీటీసీ ఎ. మోహన్ లు విడుదల చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల పట్ల ప్రజలలో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేది నుండి ఫిబ్రవరి 15వ తేది వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ (ఐఏఆర్‌డీ) యాప్‌ ద్వారా ర‌వాణా, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రులు త‌దిత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని స‌రైన విధంగా న‌మోదు చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్ర‌మాద బాధితుల‌ను కాపాడేందుకు కృషిచేసిన వారికి గుడ్ స‌మారిట‌న్ ప్రోత్సాహ‌కాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధలను పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటున్నామన్నారు, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వారిపై కేసులను నమోదు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదలలో కీలకమైన మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా రవాణా శాఖ అధికారి ఎ. మోహన్ మాట్లాడుతూ 16వ తేది నుండి ఫిబ్రవరి 15వ తేది వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని రోడ్డుభద్రతాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్, వైద్య ఆరోగ్య , ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, తదితరశాఖల సమన్వయంతో స్వచ్చంధ సంస్థలు ప్రజలను భాగస్వాములను చేసి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రచార సామగ్రి విడుదల కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు ఆర్. ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, కె. శివరాం గౌడ్, ఉదయ్ శివప్రసాద్, డీవీ. రమణ, ఎన్ఎఎస్ వర్మ, కేడీవి రవికుమార్, బి. శ్రావణి, సత్యన్నారాయణ, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు, డిప్యూటీ డియంహెచ్ ఓ జె. ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE