– మళ్లీ ప్రజలు మ్యాండెట్ ఇస్తే చట్ట సవరణ చేయమని పార్లమెంటును కోరుదాం
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలమంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి, మూడు రాజధానుల ఎజెండాతో ఎన్నికలకు వెళ్దామని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు సూచించారు.లోక్ సభ ఎంపీలతో పాటు, రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయడమే కాకుండా, 151 మంది ఎమ్మెల్యేలు కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే, మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తారన్నారు.
ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి, ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మూడు రాజధానుల ఎజెండాతో తాజాగా ఎన్నికలకు వెళ్లి, మళ్లీ నెగ్గితే… రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని మార్చాలని పార్లమెంటును అడుగుదామని అన్నారు. అయినా చట్ట సవరణ జరిగే అవకాశమే లేదన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి కి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అమరావతిని బ్రహ్మాండంగా నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇవ్వగా, కబ్జాదారులు మాత్రమే రాజధాని మార్పును కోరుకుంటారని సత్తిబాబు గతంలోనే జ్యోతిష్యం చెప్పారన్నారు.
విశాఖలో జరిగిన భూకబ్జాలు, రాజధాని మార్పును కోరుకోవడం మ్యాచ్ అయ్యింది కదా అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి, సత్తిబాబు ఇద్దరు ప్రజలను మోసం చేశారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతి యేనన్న ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలిచామని, ఇప్పుడు వికేంద్రీకరణ ఎజెండాతో ఎన్నికలకు వెళితే ప్రజలు 175కు 175 స్థానాలలో గెలిపిస్తారేమో చూద్దామంటూ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
సాక్షి దినపత్రిక పైనున్న అక్కసును రామోజీపై తీసినట్లుగా ఉన్నది
అత్త మీది కోపం దుత్త మీద తీసినట్లుగా సాక్షి దినపత్రిక పైనున్న అక్కసును తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పై తీసినట్లుగా ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. దస పల్లా భూకుంభకోణం, భోగాపురం ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ అనంతరం నామినల్ ధరకే కొనుగోలు చేసిన లక్ష గజాల స్థలం పై వెల్లువెత్తుతున్న విమర్శలకు సాక్షి దినపత్రికలో ఎక్కడ కూడా ఖండన కనిపించకపోవడంతో, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీరావు ను ఏక వచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
గత కొంతకాలం నుంచి వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించాలనుకుంటున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు రామోజీరావు పై ఆగ్రహంతోనే వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించనున్నట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ నగరంలో తనకు, తన బంధువులకు గజం భూమి కూడా లేదని గతంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ఆధారంగానే, ఈనాడు దినపత్రిక వార్త కథనాన్ని రాసిందని గుర్తు చేశారు. తనకు మాత్రమే గజం స్థలం కూడా లేదని చెప్పి ఉంటే, వార్తా కథనాన్ని రాసి ఉండక పోయి ఉండేవారేమోనని అన్నారు. పెళ్లి అయ్యింది కాబట్టి, కూతురు, కూతురు కాకుండా పోతుందా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. విశాఖ నగరం నాదేనని, నేనే ఎంపీ అని చెప్పుకున్నప్పుడు, ఒకనాటి మీ పుత్రిక, ఈనాటి పినాక రోహిత్ రెడ్డి భార్య, మీ సహకారం లేకుండానే భూములను కొనుగోలు చేశారా? అన్న అనుమానం ప్రజల్లో సర్వసాధారణమని వ్యాఖ్యానించారు.
దస పల్లా భూములను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీలే కొనుగోలు చేశారని గతంలో ఆరోపణలు గుప్పించిన మంత్రి గుడివాడ అమర్నాథ్, సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ఇక దసపల్లా భూములలో కమ్మవారికి ఎక్కువ శాతం భూములు ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందన్నారు. అయితే, కమ్మవారి అందరితో విజయసాయిరెడ్డి ట్రస్ట్ సభ్యుడైన ఒక వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
దసపల్లా భూముల వ్యవహారంలో విజయసాయి రెడ్డికి, తమ పార్టీ నాయకులు కానీ, ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మద్దతుగా నిలవడం లేదన్నారు. దీనితో చేసేది లేక తెలుగు కూడా సరిగ్గా రాని రాణి తో ప్రకటన ఇప్పించారని, అలాగే 54 మంది వ్యక్తులతో ప్రకటన ఇప్పించి తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారన్నారు.
సాక్షికి ఇచ్చిన ప్రాధాన్యత విజయసాయి పత్రిక, ఛానల్ కు ఇస్తారనుకోవడం లేదు
విజయసాయిరెడ్డి ప్రారంభించనున్న పత్రిక, చానెల్ కు సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తుందని అనుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రిక, చానెల్ లో విజయసాయి రెడ్డికి ఇతర పత్రికలు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని చెప్పారు. విశాఖ భూముల వ్యవహారంలో ఏ 1 కు తెలియకుండా, ఎ2 కొట్టేశారా? అన్న అనుమానం ఏ 1 కు వచ్చినట్లుందని ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
మీ మధ్య ఏదైనా తేడాలు ఉంటే , మీరు మీరు చూసుకోవాలన్న ఆయన, ఎన్నో దశాబ్దాలుగా నిజాయితీగా నడుస్తున్న పత్రికలను తూలనాడడం భావ్యం కాదన్నారు. మనస్సాక్షి లేని వారు సాక్షి దినపత్రిక అని పేరు పెట్టుకున్నట్లుగా, నీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తులు నీతి టీవీ ఛానల్, నిజాయితీ అంటే నిరసించే వ్యక్తులు కాబట్టే నిజాయితీ వార్తా దినపత్రికను తీసుకు వస్తున్నట్లుగా తెలిసిందన్నారు. వార్తాపత్రిక, టీవీ ఛానల్ ప్రారంభించడానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందన్న రఘురామకృష్ణంరాజు , విజయసాయి రెడ్డికి అది పెద్ద సమస్య కానే కాదని అన్నారు.
సాక్షి దినపత్రికకు కన్సల్టెంట్ గా ఉండి పది రూపాయల షేర్ ను 300 రూపాయలకు విక్రయించిన ఘనుడని, ఇక ప్రస్తుతం ఆయన ఒక ఎంపీ, పార్లమెంట్ లో పెద్ద కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి అని అన్నారు. పత్రిక, టీవీ ఛానల్ 10 రూపాయల షేర్లను 300 నుంచి 400 రూపాయలకు విక్రయించి, ఆ సొమ్మును రాబట్టగలరని ఎద్దేవా చేశారు. పత్రిక, టీవీ ఛానల్ రంగంలోకి అడుగుతున్న విజయసాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలియజేస్తూ, మిగతా పత్రికలు ఛానల్ విలేకరుల మాదిరిగానే రచ్చబండ కార్యక్రమానికి నీతి టీవీ, నిజాయితీ దినపత్రిక విలేకరులు హాజరు కావచ్చు నని ఆహ్వానం పలికారు. ఏదైనా విజయ సాయి రెడ్డి గురించి విమర్శలు చేసేది ఉంటే ముందే చెబుతానని ఆరోజు మాత్రం, నీతి టీవీ, నిజాయితీ దినపత్రిక విలేకరులు హాజరు కాకుండా ఉంటే సరిపోతుందన్నారు.
కమ్మ వారంతా చంద్రబాబు నాయుడు బినామీలైతే…
అమరావతి, విశాఖపట్నం నగరాలలో భూములు కొనుగోలు చేసిన కమ్మవారంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీలే అయితే, నీ సొంత కూతురు కొనుగోలు చేసిన భూములకు, నీకు సంబంధం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ ను ఎలా మిస్సయ్యావని, అంత చిన్న అవగాహన, ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కమ్మవారు భూములు కొనుగోలు చేస్తే ఇకనైనా చంద్రబాబు నాయుడు బినామీలని అనకు అన్న ఆయన, పినాకా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బినామీ అంటే బాగుంటుందా?అని నిలదీశారు.
సారా వ్యాపారంలో ఫార్మా వ్యాపారవేత్తలను చూడలేదు
ఫార్మా వ్యాపారంలో దిగ్గజాలుగా వెలుగొందిన వారు, సారా వ్యాపారం చేసిన దాఖలాలు లేవని, తానింత వరకూ, చూడలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. అదాన్ డిస్టలరీ కార్యాలయాన్ని, అరబిందో ఫార్మా ఆఫీసులోనే పెట్టారన్న ఆయన, ఇందులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు ఎవరో కూడా ప్రపంచానికి తెలియదన్నారు..
లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించిన అదాన్ డిస్టలరీ కంపెనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారి సహకారం లేకుండానే రెండు మూడు వేల కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో ప్రముఖ కంపెనీలకు లేని టర్నోవర్ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎందుకు చేరుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మద్యం కంపెనీలను కాదని, విజయ సాయి అల్లుడు కంపెనీకి అంత వ్యాపారం వచ్చేసిందంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. తల్లి కూతురు, 104, 108 అంబులెన్స్ లతో పాటు, పోర్టు, సారా వ్యాపారం, నామినల్ ధరకే స్థలాల కొనుగోలు, అన్నీ వారికేనని అన్నారు..
ప్రజా ఆస్తి హక్కుపై ఫోటో ముద్రణ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం
ప్రజా ఆస్తి హక్కు పై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ కు దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఒక లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారితోపాటు, భూ రెవెన్యూ చీఫ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం పై వారం రోజులు వేచి చూస్తానని, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.. భూ యజమానుల ఇండ్లలో శాశ్వతంగా ఉండే ఆస్తిపత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రజా ఆస్తి హక్కు పత్రాలను పొందడానికి, భూ యజమానులు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నంబర్ ను ఇవ్వాలని కోరడం కూడా నిబంధనలకు విరుద్ధమే నని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజా ఆస్తి హక్కు పత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం, ఈ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.