– తాడేపల్లి లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర మాజీ తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం, ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి.
తాడేపల్లి: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఆయన ఆలోచనలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. అందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్దమని వైయస్ఆర్సీపీ నేతలు ప్రతినపూనారు.
తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ…. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ప్రకాశం పంతులు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు బీజం పడిందని అన్నారు. ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఆనాటి నేతలు ముందుచూపుతో ఆలోచనలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, వారు కష్టంతో సాధించిన ప్రగతిని కూడా మసకబారుస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే…
కేంద్రం మెడలు వంచి సాధించిన స్టీల్ ప్లాంట్
: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ఆ మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా వైయస్సార్సీపీ ప్రభుత్వంలో పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని రూపుమాపేందుకు నాటి సీఎం వైయస్ జగన్ విశేషంగా కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది.
32 మంది యువకుల ప్రాణత్యాగాలతో, కేంద్రంను దిగివచ్చేలా చేసి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్‌ని కేంద్రం ప్రైవేటుపరం చేస్తుంటే రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం వంతపాడుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకున్నప్పుడే ఆంధ్రకేసరికి నిజమైన నివాళి అని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు.
బానిస విధానంపై గర్జించిన కేసరి
: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటీష్ దొరల బాసిన విధానంపై గర్జించారు. తుపాకి గుళ్ళకు తన రొమ్మును చూపిన ధీశాలి. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయి. సామాజిక న్యాయం కోసం ఆయన పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆలోచనా విధానాలతో మహిళాభ్యుదయం, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేశారని మల్లావి విష్ణు అన్నారు.
ఆంధ్రుల ఆత్మగౌరవ పతాక టంగుటూరి
: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
స్వయం పరిపాలన నినాదంతో మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని బ్రిటీష్ వారికి గుండె చూపించిన సింహం టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్రుల ఆత్మగౌరవ పతాక. ఆయన ప్రకాశం జిల్లా వాసి కావడం మా అందరికీ గర్వకారణం. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం టంగుటూరి ప్రకాశం పంతులు కృషి చేస్తే మాజీ సీఎం వైయస్ జగన్ గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు.
కానీ ఇప్పుడు ఆయన ఆశయాలకు భిన్నంగా నేడు కూటమి పాలన సాగిస్తోంది. గ్రామ సచివాలయాలను చిన్నాభిన్నం చేశారు. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేశారు. గడిచిన ఐదేళ్ల వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తే, నేడు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు.
చంద్రబాబు నిరంకుశ విధానాలపై పోరాడదాం
: మాజీ మంత్రి సాకె శైలజానాథ్
ప్రభుత్వ ఆస్తులను తన వారికి పప్పు బెల్లాల్లా కట్టబెడుతున్న చంద్రబాబు నిరంకుశ పాలనపై ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త ఒక టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో తిరగబడాలి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. భావప్రకటన స్వేచ్ఛను హరించారు. పోలీసులను ప్రయోగించి మాట్లాడినా కేసు, బయటకొచ్చినా కేసు, ప్రశ్నించినా కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పాలనకు ముగింపు పలకడానికి అందరూ ఐక్యం కావాలని సాకె శైలజానాథ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, వైయస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రతో పాటు, ఇతర వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.