– రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత
విజయవాడ : చెట్లు పెంచుతూ, సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తూ ప్రకృతితో మమేకమవుదామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. చెట్ల పెంపకంతోనే ఆరోగ్యంతో కూడిన ఆయువు లభిస్తుందని వెల్లడించారు. నగరంలోని మొగల్రాజపురంలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన ఏపీ ఫ్లవర్ షో ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు.
ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన 70 స్టాళ్లను మంత్రి తిలకించారు. ప్రతి స్టాల్ దగ్గరకెళ్లి మొక్కలు, వాటి రకాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను కూడా మంత్రి సందర్శించి, కొనుగోలు చేశారు. ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు…అమ్మకాలు ఏ మేర జరుగుతున్నాయా? అని స్టాళ్ల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు మొక్కలు, సేంద్రీయ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. మొక్కలు కంటికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయన్నారు. విజయవాడలో వరుసగా అయిదు పర్యాయాలు ఫ్లవర్ షోలు ఏర్పాటు చేసిన నిర్వాహాకుడు గరిమెళ్ల జానకీరామ్ ను అభినందించారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో మొక్కలు పెంపకం ఎంతో అవసరమన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు భూమి వేడెక్కుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
గత వేసవిలో నమోదైన ఉష్ణోగ్రతలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్లతోనే పచ్చని జీవితాలు సాధ్యమవుతాయన్నారు. పురుగుల మందులు, ఎరువుల స్థానంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. సేంద్రీయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందన్నారు.
వివిధ రకాల మొక్కల స్టాళ్లను గుంటూరు, భీమవరం, కాకినాడ, బాపట్ల, కడియంతో పాటు తమిళనాడు, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఏర్పాటు చేశారన్నారు. నగర వాసులు ఫ్లవర్ షోను సందర్శించి మొక్కలు, సేంద్రీయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. అంతకుముందు ఫ్లవర్ షో సందర్శనకు వచ్చిన మంత్రి సవితకు నిర్వాహాకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు