Suryaa.co.in

Features

ఈ పుస్తకాలగది…అక్షరాల ఆలయం

గ్రంథం మన మేధస్సు ను గుబాళింప జేసే
సుగంధ సుమనోహర చందనపు చెక్క
అందుకే ఈ గ్రంథాల వాటిక సుజ్ఞాన
విజ్ఞానాల సౌరభాల పేటిక
అక్షరాల తుషార బిందువులు
మేఘమై, జల్లై, జడివానై
ఝరి స్రవంతియై పుస్తక తరంగిణై
మానవ మష్కిస్త పృథ్వీ మండల మంతటా
గలగలా, జలజలా, ప్రవహించి
ప్రజ్ఞా ప్రాభవ వచో సంపన్నులను గావించి
గ్రంథాలయాంబుధిని నిక్షిప్తమైన
అనంత,అద్భుత, జ్ఞాన రత్నరాశులు
మన దోసిటపోసే చదువుల సాగరం
ఉండాలి మనకి పుస్తకాలంటే మహా పిచ్చి
కాని పలకాలి పిచ్చి పుస్తకాలకు స్వస్తి
నాడు పుస్తకం హస్తభూషణం.
సభ్యతా గౌరవాలకు సంస్కార ఆభరణం.
అక్షరం ఈ విశాల విశ్వానంతటినీ
ఈ పుస్తకాల గదిలోనే సృజిస్తుంది సృష్టిస్తుంది
ఈ పుస్తకాల గది
ఓగని,
ఓధ్వని,
ఓఘృణి.
ఒకొక్క పుస్తకం చదువుతూ…… ఉంటే…….
మల్లెలు పూచినట్లు,
మలయమారుతము వీచినట్లు
లతామ తల్లులు తలలూచినట్లు
పసిపాపలు చేతులు చాచినట్లు
కర్మసాక్షి బోధనలు చేసినట్లు
అమ్మ లాలనగా పిలిచినట్లు
నాన్న భవిష్యత్ వాణి వినిపించినట్లు
గురువు ఉపదేశము చేసినట్లు
చెలికాడు చెంతకు చేరినట్లు
ప్రియురాలు పిలిచినట్లు
ఎద చెమ్మగిల్లినట్లు
పేదగుండెలు చెమర్చినట్లు
కన్నీళ్లను తుడిచినట్లు
దేశమాత గుండెలవిసినట్లు
త్యాగధనుల స్ఫూర్తి పొందినట్లు…
అందుకే
ఈ పుస్తకాలగది….
నామదిలో….. అనుభూతుల పెన్నిధి.
ఈ పుస్తకాల గది….
భాషా భావనా సౌందర్యమనోజ్ఞ సూచిక
మధుర మంజుల మలయమారుత వీచిక
ఈ పుస్తకాలగది…
అక్షరాల ఆలయం
వికసిత దీపికా విద్యాలయం
ధీ నిధి నిక్షిప్త దేవాలయం
మా హృదయాలయం
ఈ గ్రంథాలయం.

శిష్ట్లా తమ్మిరాజు

LEAVE A RESPONSE