మాస్టారి జీవితపాఠం!

ఇది ప్రశ్నకు ప్రశ్న కాదు..
నీకు నువ్వే
వేసుకోవాల్సిన ప్రశ్న..
చెప్పుకోవాల్సిన జవాబు..

ఒక మాస్టారికి జర్నలిస్టుకు
మధ్య జరిగిన ఆసక్తికరచర్చ..
జీవితానుభవాన్ని కాచి వడపోసిన ఆ గురుబ్రహ్మను
ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టి
ఆ గురువు ముందు.. అక్కడున్న జనం ముందు తన ప్రతిభను ప్రదర్శిద్దామని తాపత్రయ పడిన జర్నలిస్టు శిష్యునికి జీవితం అంటే ఏమిటో కళ్ళ ముందు చూపించిన మాస్టారి
అనుభవసారం..
ఈ కథానుసారం..!!

ప్రతి మనిషికి గుణపాఠంగా ఉండే ఈ కథనం సాగిందిలా..చూడండి..
ఆ శిష్యుడు గురువు గారిని అడుగుతున్నాడిలా..
మాస్టారూ.. గత ప్రసంగంలో మీరు *contact..connection..*
అనే రెండు పదాలు పదేపడే
వాడారు..ఆ రెంటికీ తేడా ఏంటో..నాకైతే ఆ రెండు పదాలూ ఒకేలా
ధ్వనించాయి.. అర్థమయ్యాయి..
మీకైనా వాటిలో తేడా తెలుస్తుందా..
ఇలా సారుని తికమికపెట్టి
తన తెలివితేటలు జనం మెచ్చేలా చేసుకోవాలని కుర్ర జర్నలిస్టు తాపత్రయం..
అయితే ఎదురుగా ఉన్న ఆచార్యుని అనుభవం
కుర్రాడిని ప్రశ్నించడం మొదలుపెట్టింది..
ఓయ్..పిల్లగాడా..
నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు..!?
మాస్టారు తన ప్రశ్నకు బదులు చెప్పలేక సంభాషణ పక్కదారి పట్టిస్తున్నారని భావించినా సరే..పెద్దాయన అడుగుతున్నారు కదాని
సమాధానం చెప్పాడు..
మా అమ్మ ఈ మధ్యనే కన్ను మూసింది..నాన్న ఒక్కరే ఇంట్లో ఉన్నారు.ఇంకా ఇద్దరు అక్కలు..ఒక అన్న పెళ్ళిళ్ళు అయి ఎవరి కాపురాలు… వ్యాపకాల్లో వారున్నారు..

మాస్టారు మళ్లీ ఇలా అడిగారు..
మరి నువ్వు నాన్నతో కలిసి ఉండడం లేదాని..

జర్నలిస్టు మోముపై విజయగర్వంతో కూడిన చిరు మందహాసం..
ఈసారి మాస్టార్ని గురించి కాదు..తన తండ్రిని తాను చూసుకుంటున్న వైనం గూర్చి..
లేదు మాస్టారూ..నేను మా నాన్న ఒకే ఊళ్ళో ఉంటున్నాం..అయితే నేను.. నా భార్య ఇద్దరం ఉద్యోగాల్లో ఉన్నాం గనక నాన్నని దగ్గరుండి చూసుకునే అవకాశం లేదు.అయినా మేం నలుగురు సంతానం నాన్నకి తగినంత డబ్బులిచ్చి
పని వాళ్ళని పెట్టి ఆయన సంరక్షణ చేస్తున్నాం..నాన్న హ్యాపీగానే ఉన్నారు..

అయితే నువ్వు మీ నాన్నతో రోజూ మాటాడుతున్నావా..మాస్టారి ప్రశ్న ఈసారి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపించింది.
రోజూ కాదు అప్పుడప్పుడు.. కుర్రాడి స్వరం తగ్గింది..
మీరంతా నాన్నని ఎప్పుడు కలుస్తున్నారు..
మాస్టారి మరో క్వశ్చన్..
ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరిగింది..ఆ గదిలో చీమ పడితే చిటుక్కుమని వినిపించేంత నిశ్శబ్దం..
ఇప్పుడు మాస్టారే జర్నలిస్టును ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించింది.
పెద్దాయన అడుగుతుంటే కుర్రాడి మొహంలో రంగులు మారుతున్నాయి.చల్లటి ఎసి గదిలో కూడా నుదుటిన చెమట బిందువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
నెమ్మదిగా చెప్పాడు కుర్రాడు…ఏ పండక్కో .. పబ్బానికో..అందరం కాకపోయినా వీలున్న వాళ్ళు
నాన్నతో కాసేపు గడిపి వస్తాము…
ఆ వెంటనే మాస్టారు మరో ప్రశ్న సంధించారు..మొత్తం
మీరంతా కలిసి నాన్నతో గడిపిన చివరి తేదీ గుర్తుందా!?
ఉత్కంఠ పెరిగింది..జనాల్లో..
ఉద్వేగం హెచ్చింది మాస్టారిలో..
ఉల్లాసం పోయింది.. కుర్రాడిలో..
గుర్తు లేదు.. నూతిలోంచి
వస్తున్నట్టుగా ఉంది స్వరం…
మళ్లీ మాస్టారు మంద్రస్వరంతో ఇలా అడిగారు..
పోనీ నాన్నని కలిసినప్పుడు ఆయన పక్కన కూర్చుని అమ్మ పోయిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో వాకబు
చేసావా..ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నావా..ఆ ఒంటరితనం ఆయన్ని ఎంత బాధిస్తోందో ఆరా తీసే ప్రయత్నమైనా చేసావా…
ఆ కుర్రాడి కళ్ళలో నీళ్ళు తిరగడం మొదలైంది.
పశ్చాత్తాప భావన స్పష్టంగా కనిపిస్తోంది.
అప్పుడు పెద్దాయన తన కుర్చీ నుంచి లేచి కుర్రాడి వద్దకు వచ్చి అతగాడి చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ ఇలా అన్నాడు..
ఇప్పుడు అర్థం అయిందా..మీరంతా ఒకరికి ఒకరు కాంటాక్ట్ లో ఉన్నారు.కానీ కనెక్ట్ అయి లేరు.అందరూ కలిసి ఉండాలి..అది కుదరనప్పుడు కనీసం రోజూ మాట్లాడుకోవాలి.సమయం ఉన్నప్పుడు.. సందర్భం వచ్చినప్పుడు కాకుండా సమయం చేసుకుని కలుస్తూ ఉండాలి.కలిసినప్పుడు కూడా మొక్కుబడిగా కాకుండా కలిసి భోంచెయ్యాలి..నీకు మేమంతా ఉన్నామనే భరోసా నాన్నకి ఇవ్వాలి.మీ అన్నదమ్ములు..అక్కాచెల్లెళ్ల కుటుంబాలు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ..కలుస్తూ మీరంతా ఒక్కటిగా ఉన్నారని నాన్నకి తెలిసేలా చెయ్యాలి.. ఒకరినొకరు కలుసుకోవడం..కలిసి తినడం..కబుర్లు చెప్పుకోవడం..అమ్మని గురించిన అనుభూతులను నాన్న దగ్గర నెమరువేసుకోవడం..ఇవన్నీ connection అంటే..తీరిక దొరికినప్పుడు ఓ హలో చెప్పేస్తే అది contact మాత్రమే..అది ఎప్పటికీ ఎవరికీ తృప్తి ఇవ్వదు.
ఆ హాలు చప్పట్లతో
మారుమ్రోగింది..అందరి మొహాల్లో అదోలాంటి దీప్తి..
ఇక ఆ కుర్రాడిలో అనూహ్యమైన నిశ్శబ్దం..
కాని.. ఏదో తెలుసుకున్న..
అర్ధమైన భావన..
అప్పటికే తన చేతుల్లో ఉన్న మాస్టారి చేతులను నెమ్మదిగా కళ్ళకు అద్దుకుని
లేచి నిలబడి వంగి ఋషిలాంటి ఆ గురుప్రపూర్ణుడి పాదాలను తాకి కళ్ళు తుడుచుకుంటూ
బయటికి వెళ్ళిపోయాడు.
మాస్టారికి తెలుసు..
అతడి పయనం తండ్రి వద్దకేనని.. contact కి..connection కి మధ్య వ్యత్యాసం అతడికి స్పష్టంగా అవగతమైందని..అక్కడి ఆహుతుల
కరతాళధ్వనులు..
అభినందనల మధ్య ఆయన నిష్క్రమించి సైకిల్ తీసుకుని
తన ఒంటరి గదికి ప్రయాణం అయ్యారు..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply