-మీరా పర్యావరణం గురించి మాట్లాడేది?
-సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ
వేలాదిమంది ఆధారపడ్డ ఫ్లెక్సీ పరిశ్రమను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ లేఖ
విషయం: ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడి నిర్ణయం తీసుకోవడంతో సంక్షోభంలో పడిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ గురించి… కరోనా సంక్షోభంతో తీవ్రనష్టాన్ని చవిచూసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై మీ హడావిడి నిర్ణయం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంది.ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో కనీసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చెయ్యకుండా విశాఖ వేదికగా జరిగిన సభలో మీరు ప్లాస్టిక్ ఫ్లెక్స్ బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించడంతో, ఈ రంగం పై ఆధారపడిన సుమారు 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి… ఎంత మంది ఈ రంగం పై ఆధారపడి ఉన్నారు… నిషేధం విధిస్తే తలెత్తే పరిణామాలు ఏంటి… పరిశ్రమ పై ఆధారపడిన వారికి కలిగే నష్టం ఎంత మేర ఉంటుంది… ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చెయ్యలేదు.మీరు నిర్ణయం ప్రకటించిన నెల లోపే… సంబంధిత పరిశ్రమ పై ఆధారపడిన వారితో ఎటువంటి చర్చలు జరపకుండా… జి.ఓ. నెం: 65 తీసుకొచ్చారు.
కఠిన ఆంక్షలు, ఫైన్లు విధిస్తూ నవంబర్ 1 నుండే నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నాం అంటూ ఆవేదనతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను కలిసి సమస్యను వివరించినా ఎటువంటి ఫలితం లేదు.ముఖ్యమంత్రి గారిని కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందంటూ వారి ఆవేదనను నన్ను కలిసిన సందర్భంలో వ్యక్తం చేసారు.
పర్యావరణం పై మీరు ఉన్నట్టుండి ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పక్క మీరు ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నారు.విశాఖలో పచ్చని రుషి కొండని బోడి కొండగా మార్చారు వైసిపి నేతలు.ఫ్లెక్సీ పరిశ్రమ పై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. వీరంతా సుమారుగా 10 నుండి 30 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారు. బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని కొంతమంది… అప్పులు చేసి కొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారు.నెలవారీ ఈఎంఐ కట్టడమే కష్టం అవుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసింది.
ప్రస్తుతం ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ ఎదుర్కుంటున్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం వారి సమస్యలు అధ్యయనం చేసేందుకు… ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి.ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు కోరుతున్న విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ఉన్న యూనిట్లను కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి సుమారుగా 15 లక్షల రూపాయిల ఖర్చు అవుతుంది. ఈ మార్పు కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి.
నవంబర్ 1 నుండి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న నిషేధాన్ని కనీసం ఏడాది పాటు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. హడావిడి నిర్ణయం, చర్యలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలను అంధకారం చెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నాను.