– దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం
-రోజుకి సగటున ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
-వైసీపీ సర్కారు తీరుతో రెండున్నరేళ్లలో 34 శాతం పెరిగిన ఆత్మహత్యలు
– ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
– పత్రికాప్రకటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన వల్లే అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉండటం విచారకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నారా లోకేష్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం, ఏపి రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో ఏపీ వుండటం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మర ణాలకు పాల్పడ్డారని, రాష్ట్రంలో సగటున రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న 2018 సంవత్సరంలో పోల్చుకుంటే, జగన్‌రెడ్డి పాలనలో 34 శాతం రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయని తేలిందన్నారు.
కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, దేశంలోనే 22 శాతం కౌలు రైతుల మరణాలు మన రాష్ట్రంలోనే అంటే, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోందన్నారు. సున్నా వడ్డీ రుణాలని కోట్లలో సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చుకుని, ఇవ్వాల్సిన రుణాలకి సున్నా చుట్టేశారని, ఎరువులు-విత్తనాలు దొరక్క రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసి అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో వున్నప్పుడు తన మేనిఫెస్టోయే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి..అందులో ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొని, మూడు రూపాయలు కూడా కేటాయించని ద్రోహి జగన్‌రెడ్డి అని ఆరోపించారు. విపత్తుల పరిహారం ఎగనామం పెట్టేశారని, రైతుల్నించి ధాన్యం కొనుగోలు చేసి వేలకోట్లు బకాయిలు చెల్లించలేదని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం కాదు కదా పరామర్శ కూడా లేని జగన్‌రెడ్డి పాలన రైతుల్లేని రాష్ట్రంగా ఏపీని చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి చాలవన్నట్టు వ్యవసాయ ఉచిత విద్యుత్‌కి మంగళం పాడి..మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తోన్న వైసీపీ పాలనలో రైతులకు ఆత్మహత్యలే గతి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి 25 వేలు ఇవ్వాలని ప్రతిపక్షనేతగా డిమాండ్ చేసిన జగన్‌రెడ్డి, ప్రభుత్వంలోకొచ్చాక ఎకరాకి రూ.500 కూడా ఇవ్వకపోవడం చూస్తే ఆయన అన్నదాతల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో తేలిపోయిందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలపై ఇప్పటికైనా వైసీపీ సర్కారు కళ్లు తెరిచి, రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోకపోతే ఏపీ రైతుల్లేని రాష్ట్రంగా మారిపోనుందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.