– వైసీపీ నేతలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫైర్
వైసీపీ అధినేత రాష్ట్రంపైపడి ప్రజాధనం దోచుకుంటుంటే, వైసీపీ నేతలు ఊర్లమీద పడుతున్నారు. ఏమీ దొరకపోతే గుడీ, గుడిలో లింగమూ దోచుకుంటున్నారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన నుంచీ వైసీపీ ముఠాలే హిందూ ఆలయాలపై దాడులు చేసి టిడిపిపై ఆరోపణలు చేశారు. వైసీపీ కొల్లగొట్టిన విగ్రహాలలో ఒకటి ఇదిగో వైసీపీ నేత ఇంట్లో ఇలా మరకత వినాయకుడి రూపంలో బయటపడింది.
ప్రకాశం జిల్లాకి చెందిన ఛోటా వైసీపీ నేత వెంకటేశ్వర్‌రెడ్డి ఇంట్లో 25 కోట్ల విలువచేసే మరకత విగ్రహం బయటపడిందంటే వైసీపీ పెద్ద నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలున్నాయో? ఇదే కాదు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు నగలు, విగ్రహాలు ఎత్తుకుపోతున్నారని భక్తులలో అనుమానాలున్నాయి. అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ వెండిసింహాల మాయం, రామతీర్థం రాముడి తల నరికివేత ఘటనలో ఈ రోజుకీ నిందితులు దొరకలేదు సరికదా, ఇదిగో వెంకటేశ్వర్‌రెడ్డిలాంటి వైసీపీ నేతల దగ్గర విగ్రహాలు దొరుకుతున్నాయి.
ఈ దొంగ ప్రభుత్వం, దోపిడీ పాలకుల హయాంలో ప్రజలకే కాదు, దేవాలయాల ఆస్తులకు, దేవతావిగ్రహాలకు రక్షణలేకుండా పోయింది. రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింట్లో అర్జంటుగా కేంద్రబృందంతోగానీ, న్యాయ బృందం పర్యవేక్షణలో ఆడిట్ జరపాలి. లేదంటే దేవుళ్ల నగలు, విగ్రహాలు వైసీపీ నేతలు పిల్లల మెడలో ఆభరణాలుగా మారే ప్రమాదం ఉంది.