బోయ, వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్పించండి

– సీఎంకు లోకేష్ లేఖ

గతంలో తమ ప్రభుత్వం బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆ మేరకు సీఎం జగన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

గౌర‌వ‌నీయులైన
శ్రీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు
ముఖ్య‌మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
అమ‌రావ‌తి

విష‌యం: టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో వాల్మీకి/బోయ‌ల‌ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం వ‌ద్ద చేసిన కృషిని కొన‌సాగించి సాధించాల్సిన అవ‌స‌రం గురించి

అయ్యా!
పురాత‌న కాలం నుంచీ వేట, అట‌వీ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ వృత్తిగా జీవ‌నం సాగిస్తున్న నిరుపేద వాల్మీకి/బోయ‌ల‌ని ఎస్టీల్లో చేర్చి వారి జీవ‌న‌స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న 2014-19లో విశేష‌కృషి చేసింది. శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులు/బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు 2016లో ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక అధ్య‌య‌న బృందాన్ని కూడా వేశారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టించిన బృందం..ఏడాదిపాటు అధ్య‌య‌నం చేసి మైదాన‌ప్రాంతాల‌లో నివసిస్తూ ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయంగా తీవ్ర‌మైన వెన‌క‌బాటుకి గురైన నిరుపేద‌లైన వాల్మీకి/బోయ సామాజిక‌వ‌ర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా 1 డిసెంబర్ 2017న, వాల్మీకులు/బోయలను ST జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

దీని తర్వాత శాసనసభ, శాసన మండలిలో వివరణాత్మక చర్చలు జ‌రిగాక వాల్మీకులు/బోయలను ST జాబితాలో చేర్చాలని ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. స‌త్య‌పాల్ నివేదిక‌, మంత్రివ‌ర్గం, అసెంబ్లీ-శాస‌న‌మండ‌లి తీర్మానాల‌ను 15 డిసెంబర్ 2017న కేంద్ర‌ ప్రభుత్వానికి పంప‌గా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరిన్ని వివరాలు కోరింది. వార‌డిగిన స‌మాచారమంతా 5 సెప్టెంబర్ 2018న పంపించ‌గా అప్ప‌టి నుంచీ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్దే ఇది పెండింగులో ఉంది.

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వున్న‌ప్పుడు మీరు రాష్ట్ర‌వ్యాప్తంగా వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాన‌ని, టిడిపి ప్ర‌భుత్వం పంపిన తీర్మానాలు కాకుండా ..తాను సీఎం అయ్యాక మొద‌టి అసెంబ్లీ సమావేశాల‌కే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తాన‌ని చేసిన వాగ్దానాలు ఏమ‌య్యాయి ముఖ్య‌మంత్రి గారూ! మీరు ముఖ్య‌మంత్రి అయి మూడేళ్ల‌యినా, చాలాసార్లు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగినా వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు క‌నీసం చ‌ర్చ కూడా చేయ‌లేదు.

వాల్మీకి జ‌యంతి సంద‌ర్భంగా తేదీ 20-10-2021న ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు గారు..త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చేసిన తీర్మానాల‌ను గుర్తు చేస్తూ, ఎస్టీలుగా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. అయినా మీ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. ఏదైనా ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన అభివృద్ధి ప‌నుల‌ని, సాధించాల్సిన ప్రాజెక్టుల‌ని, నిధుల‌ని, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌రిగే కృషిని త‌రువాత వ‌చ్చే ప్ర‌భుత్వాలు కొన‌సాగించాలి. దీనిని మీరు విస్మ‌రించ‌డం వ‌ల్ల రాష్ట్రంతోపాటు వాల్మీకులు/బోయ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు.

టిడిపి ప్ర‌భుత్వం పంపిన తీర్మానాల‌పైనే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మీ ఎంపీలు ప్ర‌ధానిని క‌లిసి విన‌తిప‌త్రాలు మూడేళ్ల‌కి ఇచ్చారు. చాలా సంతోషం. టిడిపి ప్ర‌భుత్వం పంపిన స‌త్య‌పాల్ క‌మిటీ నివేదిక‌, క్యాబినెట్ తీర్మానం, ఉభ‌య‌స‌భ‌ల తీర్మానం మాత్ర‌మే కేంద్రం వ‌ద్ద వున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం ప్రచారం కోసం ఇచ్చిన విన‌తిప‌త్రాలు కాకుండా వాల్మీకులు/బోయ‌లని ఎస్టీల్లో చేర్చేందుకు తీసుకున్న చ‌ర్య‌లేంటో క‌నీసం ఒక్క‌టైనా చెప్ప‌గ‌ల‌రా?

ఇప్ప‌టికైనా కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో వున్న వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాల‌కి ఆమోద‌ముద్ర వేయించాల‌ని కోరుతున్నాను. వైసీపీ ప్ర‌భుత్వానికి వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చాల‌నే చిత్త‌శుద్ధి వుంటే, కేంద్రం వ‌ద్ద‌కు మీతోపాటు మేమూ వ‌స్తాం. ద‌య‌చేసి టిడిపిపై క‌క్ష వాల్మీకులు/బోయ‌లపై చూపొద్దు.

…నారా లోకేష్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Leave a Reply