-రాజోలులో యువగళం రెండేళ్ళ సంబరాలు
రాజోలు: వైసీపీ అరాచక పాలనపై గళమెత్తుతూ యువనేత నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ గతినే మార్చివేసిందని టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పెద్దాపురం నియోజకవర్గ టిడిపి పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు రాజోలులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వేడుక నిర్వహించారు.
స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యువగళం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ, శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు లోకేష్ పాదయాత్ర ఎంతగానో దోహదపడిందని చెప్పారు. కుప్పం నుండి విశాఖపట్నం వరకు 3132 కిలోమీటర్ల మేర సాగిన లోకేష్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతుందని అన్నారు.
జగన్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు కల్పించినా, అక్రమ కేసులు పెట్టి వేధించినా మొక్కవోని దీక్షతో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారని వారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని వారు చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో దావోస్ పర్యటన విజయవంతమైందని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు దిగ్గజ సంస్థలు ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వెంకటరమణ, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాండ్రేగుల సత్యనారాయణ, చెల్లింగి సత్యనారాయణ, రాజోలు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, సఖినేటిపల్లి మండల టిడిపి అధ్యక్షులు ముప్పర్తి నాని, నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు కాండ్రేగుల భవాని, రాజోలు పట్టణ టిడిపి అధ్యక్షులు అడబాల విజయ్, ప్రధాన కార్యదర్శి కడలి వెంకటరమణ, టిడిపి నాయకులు పెచ్చెట్టి జగదీశ్, కాండ్రేగుల పూర్ణ సురేష్, మానుకొండ దుర్గాప్రసాద్, శివాజీ, పెసింగి ఏసుబాబు, కాండ్రేగుల కుసులుడు, తెలుగు మహిళ నాయకురాలు మట్టపర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.