– పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం
– లంబసింగి లో కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం
– సభాపతి అయ్యన్నపాత్రుడు
విశాఖపట్టణం: రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమని సభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమన్నారు. పర్యాటకులు కేవలం టీ, కాఫీలు తాగేందుకు రారు కదా అని పేర్కొన్నారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని, వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు . పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులన్నీ వాడుకునేలా చూడాలి అని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఏపీ టూరిజంకు అజయ్ జైన్ రూపంలో మంచి సెక్రటరీ వచ్చారని భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో విశాఖపట్టణం చాలా కీలకమైన ప్రదేశం అన్నారు. ఇక్కడ అనేక సైట్ సీయింట్ స్పాట్లున్నాయన్నారు. గోవాకన్నా విశాఖనే బెటర్ అని తాము భావిస్తున్నామన్నారు. నర్సీపట్నం సమీపంలో లంబసింగికి వేలాదిగా పర్యాటకులు వస్తున్నారని, కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గెస్ట్ హౌస్ 6 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. బాత్ రూమ్స్, టాయిలెట్స్, కనీసం వసతి సౌకర్యాలు, రెస్టారెంట్లు లేవన్నారు.
లంబసింగి లాంటి ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించాలని మంత్రి దుర్గేష్ ను కోరారు. పాడేరు అమ్మవారి దేవాలయాన్ని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పార్కును, పురాతన బొజ్జన్నకొండను మరింత వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్మనీ మాదిరిగా విశాఖలోని ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు చిన్న చిన్న హట్స్ వేయాలని కోరారు.
1(17) చట్ట ప్రకారం ట్రైబల్ ఏరియాలో ఇన్వెస్ట్ మెంట్స్ ట్రైబల్సే చేయాలి… కానీ అంత ఇన్వెస్ట్ మెంట్ ట్రైబల్స్ చేయగలరా అని ప్రశ్నించారు. సడలింపులు ఇస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారన్నారు. యాక్ట్ లో మార్పులు తీసుకురావాల్సి వస్తే, అధికారులు సంబంధిత చట్టంపై అధ్యయనం చేయాలన్నారు. యారాడ సమీపంలో అద్భుతమైన బీచ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ రిసార్ట్స్ లు కట్టాలని తెలిపారు.
ఇన్వెస్టర్లకు సకాలంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్లు, ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. విశాఖ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని తపనపడుతున్నారని స్పీకర్ అయన్నపాత్రుడు తెలిపారు.
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి: ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ
ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం సీఎం తపన పడుతున్నారన్నారు. నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోనే పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శ్రీకాకుళం నుండి తడ వరకు అద్భుతమైన సముద్రతీరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా సీఎం విజన్, ఆలోచనతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్నారు.
ఏపీలో వనరులు పెంచి పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. టూరిజం కార్పొరేషన్, శాఖ విషయంలో మంత్రి కందుల దుర్గేష్ సహకారం మరవలేనిదన్నారు. టూరిజం ఎండీగా ఆమ్రపాలి రావడం, ఆమె పనితీరు అద్భుతం అని కొనియాడారు. సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ రావడం శుభపరిణామమన్నారు. ఏపీటీడీసీపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ దాన్ని సవాల్ గా తీసుకొని, తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్లాలని ఉద్యోగులకు సూచించారు. ఏపీటీడీసీకి కేటాయించే టీటీడీ దర్శనాల టికెట్లు రద్దు చేయడం వల్ల ఆదాయం కోల్పోయిందన్నారు.
ఏపీటీడీసీకి సంబంధించి విమర్శ కథనాలు రాసే ముందు శాఖను స్పష్టమైన వివరణ అడిగితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీడియాను కోరారు. టూరిజం శాఖ లోపాలను ఎత్తి చూపుతూనే ప్రమోట్ చేయాల్సిన అవకాశం మీడియాపై ఉందని తెలిపారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎటువంటి ఇబ్బందులు ప్రభుత్వం తరపున తప్పనిసరి సహకారం ఉంటుందన్నారు.
ఉద్యోగావకాశాలను కల్పించే ఏకైక రంగం పర్యాటక రంగం: అజయ్ జైన్
రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ లు పర్యాటక శాఖ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్నారన్నారు. వారి ఆలోచనలతో ఇప్పటికే విజయవాడలో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించామని, ప్రస్తుతం రెండో సమ్మిట్ నేడు విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు.
భవిష్యత్ లో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అన్నారు. అత్యధిక దేశాలు ఆదాయార్జన కోసం టూరిజం రంగం పైనే ఆధారపడి ఉన్నాయని వివరించారు. వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా దేశాలు అత్యధిక జీడీపీతో పాటు ఉపాధి అవకాశాలను టూరిజం రంగం ద్వారా అందిస్తున్నాయన్నారు. పర్యాటక రంగం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు.
పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ చురుకుగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఇన్వెస్టర్లకు తాము 24/7 అందుబాటులో ఉంటామని, ఏ సందేహాన్నైనా తాము నివృత్తి చేస్తామన్నారు. మాల్దీవుల్లో ప్రతి 20 మీటర్లకు ఒక ఫైవ్ స్టార్ హోటళ్లున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఆ తరహా మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో హోటళ్లు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావాలని కోరారు.
విశాఖపట్టణంలో విస్తృత అవకాశాలు: విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్
విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జీడీపీలో రాష్ట్రంలోనే విశాఖపట్టణం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. విశాఖ సిటీలో 50 కి పైగా మెగా, 1200కి పైగా మధ్యతరహా, చిన్న పరిశ్రమలున్నాయన్నారు. విశాఖపట్టణంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఆకాశమే హద్దుగా వనరులు, అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖలో అవసరమైన మానవనరులు, జాతీయ, రాష్ట్రీయ విద్యా సంస్థలున్నాయన్నారు.
యారాడ, భీమిలీ, సాగర్ నగర్ బీచ్ లను వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు అవసరమైన కనెక్టివిటీ ఉన్న నగరం విశాఖ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని తద్వారా విదేశాలకు కనెక్టివీటి పెరిగి అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
పర్యాటకంగా అభివృద్ధికి విస్తృత అవకాశాలు: జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అల్లూరి జిల్లా రెండవ అతిపెద్దదని, 73 శాతం అటవీ, పచ్చని ప్రకృతిలో అలారారే ఈ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అరకు మొదలుకొని లమ్మసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలున్నాయన్నారు. వాటన్నింటిని సర్క్యూట్ గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.
బీచ్ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ టూరిజంలో ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నాం: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ వైజాగ్, అరకు పర్యాటకుల గమ్యస్థానాలన్నారు. అనకాపల్లి ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ అన్నారు. బీచ్ తో పాటు పలు గిరిజన ప్రాంతాలు ఉన్న అనకాపల్లిలో పర్యటకాన్ని వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి తంతడి, సీతాపాలెంలో బీచ్ ఫ్రంట్ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.. స్థానికంగా 80 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పర్యాటకులకు అవసరమైన రిసార్ట్స్ లు, మౌలిక వసతులు లేవన్నారు. ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఇన్వెస్టర్లకు నిత్యం అందుబాటులో ఉండి అనుమతుల జారీలో సాయపడతామన్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు.
టూరిజం పాలసీ -2025-29 పై ఇన్వెస్టర్లకు ప్రజెంటేషన్ ఇచ్చిన టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట
టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ ఇటీవలే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా టూరిజం పాలసీ -2025-29 పై ఇన్వెస్టర్లకు ప్రజెంటేషన్ ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. టెంపుల్ టూరిజమే కాకుండా విభిన్న టూరిజం ప్రక్రియలను ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న టూరిజం సర్క్యూట్ లపై వివరించారు.