పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య దూరం చేయొద్దు

-పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ‌…

గౌర‌వ‌నీయులు శ్రీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు
ముఖ్య‌మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
విష‌యం: జాతీయ విద్యావిధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య దూరం చేయొద్ద‌ని విన‌తి

ముఖ్య‌మంత్రి గారూ,
పాఠ‌శాల‌ల ప్రారంభం రోజునే ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు మీ నిర్ణ‌యం శ‌రాఘాతంగా త‌గిలింది. ఆగ‌మేఘాల‌పై జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనంతో మీరు తీసుకున్న నిర్ణ‌యం పేద విద్యార్థుల్ని ప్ర‌భుత్వ విద్య‌కి దూరం చేస్తోంది. ఇప్ప‌టికే ఉపాధ్యాయులు కొర‌త‌, అర‌కొర సౌక‌ర్యాల‌తో ప్ర‌భుత్వ విద్యాల‌యాలు కునారిల్లుతుంటే, పాఠశాల‌ల విలీన నిర్ణ‌యం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైంది. జాతీయ విద్యా విధానం అమ‌లుని ఇంకా ఏ రాష్ట్రం ఆరంభించ‌కుండానే స‌మ‌స్య‌ల‌పై ఎటువంటి అధ్య‌య‌నం లేకుండా మ‌న‌రాష్ట్రంలో ఆరంభించ‌డం వలన బ‌డికి దూర‌మైన విద్యార్థులు రోడ్డున ప‌డ‌టం చూశాం. NEP సూచ‌న‌ల మేర‌కు క‌రికుల‌మ్‌, బోధ‌నా విధానాలు అమ‌లు కోస‌మే పాఠ‌శాల విద్యను నాలుగు స్థాయిలుగా విభ‌జించారు. అయితే పాఠ‌శాల‌ల‌ను విభ‌జించాల్సిన అవ‌స‌రంలేద‌ని కేంద్రం స్ప‌ష్టంచేసినా ప‌ట్టించుకోని మీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌ను విభ‌జించ‌డంతో స‌మ‌స్య తీవ్ర‌మైంది. జాతీయ విద్యావిధానం అమ‌లు చేసే తొంద‌ర కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ని త‌గ్గించే ఆతృత మీలో క‌నిపిస్తోంది.

మ‌రోవైపు మీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ 117 GO అమ‌లు వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్దీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయి. చ‌దివేందుకు ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉన్న బ‌డినే తీసేయ‌డం వారిని చ‌దువుకి దూరం చేయ‌డ‌మే అవుతుంది. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల‌లోను, హైస్కూల్స్ లోను కలపటంవల్ల ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్ప‌త్తి పూర్తిగా పెరిగిపోయింది. హెడ్మాస్ట‌ర్‌, వ్యాయామ ఉపాధ్యాయుల్ని కేటాయించ‌క‌పోవ‌డం విద్యార్థుల శారీరక మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూప‌నుంది. పిల్ల‌ల‌కి పాఠ‌శాల‌లు ఒక కిలోమీట‌రు దూరంలోపే ఉండాల‌ని విద్యావిధానాలు చెబుతుంటే మీరు ఏకంగా 3 కిలోమీట‌ర్ల దూరానికి పాఠ‌శాల‌లు త‌ర‌లించ‌డం ప్ర‌భుత్వ విద్యని పేద‌ల‌కి దూరం చేయ‌డ‌మే. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేష‌న‌లైజేష‌న్ పేరుతో మీరు నియంతృత్వ పోక‌డ‌ల‌తో అమ‌లు చేస్తోన్న ఈ విద్యావిధానం వ‌ల్ల ప్ర‌స్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్య‌త్తులో 11 వేల‌కి త‌గ్గిపోనున్నాయి. రేష‌న‌లైజేష‌న్ విధానంవల్ల మొత్తం 55 వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావ‌డం విద్యావ్య‌వ‌స్థ‌కే మ‌ర‌ణ‌శాస‌నం రాయ‌డమే. మ‌రో ప‌దేళ్ల‌పాటు డిఎస్సీ కూడా వేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో టీచ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటున్న ల‌క్ష‌లాది మంది ఆశ‌లు ఆవిరి చేయ‌డం దారుణం. త‌ల్లిదండ్రులు కూలినాలికి వెళితే, మీరు దూరం చేసిన పాఠ‌శాల‌ల‌కు వాగులు, వంక‌లు దాటి పిల్ల‌లు ఎలా వెళ్ల‌గ‌ల‌రు?పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే రాష్ట్ర‌వ్యాప్తంగా త‌మ బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్క‌డం మీ దృష్టికి వ‌చ్చే వుంటుంది. జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్య‌య‌నం లేకుండానే అమ‌లు చేయ‌డంతో 10 వేల స్కూళ్లు మూత‌ప‌డ్డాయి. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను. పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య‌ని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణ‌యాల‌ని వెన‌క్కి తీసుకోవాలని కోరుతున్నాను.

…నారా లోకేష్‌
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Leave a Reply