Suryaa.co.in

Editorial

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాధవ్‌, విష్ణువర్దన్‌రెడ్డి

– పురందీశ్వరి పోటీ చేయాలంటున్న మూడు జిల్లాల నేతలు
– బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అందులో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్‌, రెండు టీచర్‌ ఎమ్పెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఫిబ్రవరి 16 నోటిఫికేషన్‌, మార్చి 13న పోలింగ్‌, మార్చి 16న కౌంటింగ్‌ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ గ్రాడ్యుయేట్‌ స్థానాలకు అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ అభ్యర్ధిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ పేరు ఖరారయింది. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో విజయం సాథించారు.

ఇక కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ అభ్యర్ధిగా.. మరో ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి పేరు ఖరారయింది. కేంద్రమాజీ మంత్రి-పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి పోటీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. చివరకు ఆమె పేరే ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నేపథ్యంలో.. అభ్యర్ధుల ఎంపికపై నాయకత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. మూడు గ్రాడ్యుయేట్‌ స్థానాలను కైవసం చేసుకోవాలంటే,. మూడు చోట్ల బలమైన నేతలను బరిలోకి దింపడమే సరైన వ్యూహమని నిర్ణయించింది. అందులో ఇద్దరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మరొక నియోజకవర్గంలో, అందరికీ సుపరిచితురాలయిన పురందీశ్వరిని బరిలోకి దింపడం ద్వారా, ప్రత్యర్ధులకు గట్టి సవాల్‌ విసరాలని భావిస్తోంది.

సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయిన తర్వాత.. ఇప్పటివరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవలేదన్న అపప్రద పార్టీ వర్గాల్లో నెలకొంది. ఎంపీపీ, జడ్పీటీ సీ ఎన్నికల్లో .. చివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న, కడియం మండలంలో ఒక్క సర్పంచ్‌ సీటు కూడా బీజేపీకి దక్కలేదు. పైగా అక్కడ టీడీపీ-జనసేన పొత్తుతో, రెండు పార్టీలు కలసి అధిక స్థానాలు గెలుచుకున్న వైనాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లు గెలిచి, తనపై పడ్డ నిందను తొలగించుకుని, నాయకత్వంవద్ద సత్తా చాటాలని వీర్రాజు పట్టుదలగా ఉన్నారు. ఆ క్రమంలో మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా, ప్రత్యర్ధులకు గట్టి సవాలు విసరాలని నిర్ణయించారు. దానితో రాఘవేంద్ర, దయాకర్‌రెడ్డికి పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్‌ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు, బీజేపీ నేత రాఘవేంద్ర ఆసక్తిచూపుతున్నారు. ఆ మేరకు ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారం కోసం చాలా ఖర్చు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే రాఘవేంద్ర కంటే విష్థువర్దన్‌రెడ్డి బలమైన అభ్యర్ధి అవుతారన్న భావన పార్టీ నాయకత్వంలో ఉంది.

రాయలసీమ సమస్యలపై గళం విప్పడంతోపాటు, గతంలో బీజేపీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్‌లో, విష్ణువర్దన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆయనకు సొంత అనంతపురంలో పట్టు ఉండటంతోపాటు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా కడప,కర్నూలు జిల్లా ప్రజలతో అనుబంధం ఉంది.

నెహ్రు యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడిగా , విష్ణు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇవన్నీ పార్టీ విజయానికి దోహదపడతాయన్నది నాయత్వం అంచనా. నిజానికి ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసే అవకాశం దక్కింది. కానీ తాను పోటీ చేయలేనని, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అభ్యర్ధించడంతో, పోటీ చేసే అవకాశం దక్కలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవాలని, సోము వీర్రాజు పట్టుదలతో ఉన్న క్రమంలో, విష్ణువర్దన్‌రెడ్డి పేరు ఖరారయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో.. ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఏదో ఒక సాకుతో తప్పించుకుంటారంటూ విష్ణుపై వస్తున్న విమర్శలకు తెరపడనుంది. ఒక దశలో రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో, విష్ణువర్దన్‌రెడ్డి పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

ఇక ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి ఆమెకు ఎమ్మెల్సీ బరిలో దిగడం ఇష్టం లేకున్నా, ఆ మూడు జిల్లాల బీజేపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పురందీశ్వరి పోటీలో ఉండాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పోటీలో ఉంటే గెలుపు ఖాయమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఓడిపోతానని తెలిసినా, గత 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట, 2019లో విశాఖ నుంచి పోటీ చేసిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

అయితే, అక్కడి నుంచి దయాకర్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అప్పుడే ఆయన పేరుతో కరపత్రాలు కూడా, పంపిణీ అవుత్నునట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు రాయలసీమకు చెందిన ఓ నేత ఆయనకు సాయం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నందున, దయాకర్‌రెడ్డి కంటే పురందీశ్వరి పోటీ ఎక్కువ ప్రభావం చూపిస్తుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

ఆయన స్థాయి సరిపోదని వాదిస్తున్నారు. పార్టీ పదాధికారులు, ఏ స్థాయి ఎన్నికల్లోనయినా సరే పోటీ చేయాలని, గతంలో ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయకత్వం కోరితే ఆమె పోటీ చేయకతప్పదంటున్నారు. మొత్తానికి ముగ్గురు బలమైన నేతల ఎంపికతో.. సోము వీర్రాజును పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం సహా, అన్ని వర్గాలు అభినందిస్తున్నాయి.

LEAVE A RESPONSE