బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?

రాజ్యసభలో మంత్రికి విజయసాయి రెడ్డి ప్రశ్న

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌ శాండ్‌ మైనింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అనుబంధ ప్రశ్న వేశారు.

దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిస్తూ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న సరైనదేనని అన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్‌ తవ్వకాల కోసం లైసెన్స్‌లు పొందిన ప్రైవేట్‌ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్‌ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్‌ చేశారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. మైనింగ్‌ చేస్తున్న ఖనిజ నిక్షేపాలలో వాటి వివిధ ఆకృతులను నిర్ధారించేందుకు శాటిలైట్‌ ఇమేజింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో పాల్గొంటున్నది ప్రైవేట్‌ సంస్థా లేక ప్రభుత్వ రంగ సంస్థా అన్న దానితో నిమిత్తం లేకుండా స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలలో తోడ్పడవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పదేపదే కోరుతున్నామని అన్నారు.

Leave a Reply