Suryaa.co.in

Editorial

‘మాధవ మహాత్మ్యం’పై.. భలే తీర్పు బాసూ..!

  • నివేదిక రాకముందే తీర్పు ఇచ్చిన ఎస్పీ ఫకీరప్ప
  • ఎంపీ మాధవ్‌ వీడియో మార్ఫింగు కావచ్చట
  • ఆ వెంటనే తాను నిర్దోషినయినట్లు మాధవ్‌ ప్రెస్‌మీట్‌
  • ఎస్ఫీ వ్యాఖ్యలు నివేదిక ఫలితంపై ప్రభావం చూపదా?
  • ఇంతకూ ఫిర్యాదు చేసిందెవరు స్వామీ?
  • తానే ఫిర్యాదు చేశానని ప్రెస్‌మీట్‌లో చెప్పిన ఎంపీ మాధవ్‌
  • ఇప్పుడేమో ఎవరో అభిమాని చేశారని చెప్పిన ఎస్పీ
  • మాధవ్‌ ఫోన్‌ను సీజ్‌ చేయరా సారూ?
  • ఇంతకూ వీడియోను ఫొరెన్సిక్‌కు పంపారా? లేదా?
  • ఫిర్యాదు చేయకపోతే సుమోటోగా తీసుకోరా?
  • సీఐడీ పనితనం ఏమయినట్లు?
  • మాధవ మహాత్మ్యంలో లెక్కలేనన్ని మలుపులు
    ( మార్తి సుబ్రహ్మణ్యం)

హిందూపురం వైసీపీ ఎంపీ మాధవ్‌ వీడియో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఎస్పీ ఫకీరప్ప.. ఆ వీడియో మార్ఫింగ్‌ కావచ్చని వ్యాఖ్యానించడం, దానిపై ఎంపీ మాధవ్‌ తాను నిర్దోషినన్నట్లుగా ప్రెస్‌మీట్‌ పెట్టడం, ఎస్పీ-ఎంపీ చర్యలపై విపక్షాలు విరుచుకుపడటంతో వీడియో వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయింది. అయితే ఎంపీ మాధవ్‌ తన తొలి ప్రెస్‌మీట్‌లో తానే ఎస్పీకి ఫిర్యాదు చేశానని స్పష్టం చేసిన క్రమంలో, కొత్తగా మరో ఫిర్యాదుదారు పేరును ఎస్పీ తెరపైకి తీసుకురావడం విమర్శలకు దారితీసింది. అసలు వీడియో నిజమా? అబద్ధమా అని ఫొరెన్సిక్‌ నివేదిక రాకముందే, అది మార్ఫింగ్‌ కావచ్చంటూ ఎస్పీ వ్యాఖ్యానించటం నివేదికపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి.

‘‘ఆ వీడియో ఫేక్‌. ఒరిజినల్‌ కాదని కనుగొన్నాం. మార్ఫింగ్‌, ఎడిట్‌ జరిగి ఉండవచ్చు. వీడియో ఒరిజినల్‌ అని నిర్థారించలేకపోతున్నాం. అసలు వీడియో దొరికేవరకూ ఏమీ చెప్పలేం. పైగా ఎంపీమీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియో ఒక వ్యక్తి చూస్తుండగా మూడూ వ్యక్తి రికార్డు చేశారు’’- ఈ ప్రకటన చేసింది ఒక సాధారణ డీఎస్పీ లేదా సీఐ అనుకుంటే త(ప)ప్పులో కాలేసినట్లే. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఐపిఎస్‌.. ఎంపీ మాధవ్‌ నగ్న వీడియోకు సంబంధించి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు. అంటే సదరు వీడియో ఒరిజినల్‌ కాదన్న తీర్పు ఇచ్చేశారన్నమాట. దానితో ఇక ఫొరెన్సిక్‌ నివేదికతో పెద్దగా పనిలేనట్టే లెక్క. ఒక వేళ ఆ నివేదిక వచ్చినా అది ఎలా ఉంటుందో ఎస్పీ గారి ప్రకటన తర్వాత ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది బుద్ధిజీవుల ఉవాచ.

అయితే.. అది మీడియా ప్రతినిధులతో ఎస్పీ నిర్వహించిన ప్రెస్‌మీటా? లేక మీడియా ప్రతినిధులే ఆయన వద్దకు వెళితే ఎస్పీ గారు జవాబులిచ్చిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమమా? అన్నదానిపైనే స్పష్టత వస్తే బాగుండేది. ‘ఫోరెన్సిక్‌ రిపోర్టుతో ప్రెస్‌మీట్‌ పెడతానని నేను చెప్పలేదు. ఏమైంది? ఏమైంది అని మీరు నన్ను అడుగుతుంటే ప్రెస్‌మీట్‌ పెట్టా’నని ఎస్పీ గారు సెలవిచ్చారు కాబట్టి అది ఒకరకంగా ప్రెస్‌మీట్‌ కిందే లెక్క.

ఎస్పీ ప్రెస్‌మీట్‌ తర్వాత ఎంపీ మాధవ్‌ ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి, ఎస్పీ ఇచ్చిన క్లీన్‌చిట్‌ లేదా ‘తత్కాల్‌ తీర్పు’ ఆధారంగా తాను నిర్దోషినే అన్నట్లు మాట్లాడటమే వింత. ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెట్టడం, ఆ వెంటనే ఎంపీ మీడియా ముందుకు రావడం, సహజంగా అనుమానాలు తెరపైకి తీసుకువచ్చేవే. దీనితో ఎంపీ-ఎస్పీపై విపక్షాలు జమిలిగా దాడి ప్రారంభించాయి. ఫలితంగా మరోసారి ఎంపీ న్యూడ్‌ వీడియో మళ్లీ తెరపైకి వచ్చేందుకు దారితీసింది. వీడియో వ్యవహారంపై అన్ని యాంగిల్స్‌లో విచారణ జరిపిస్తామని హోంమంత్రి ప్రకటించిన తర్వాత.. విచారణలో దోషి అని తేలితే చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన తర్వాత .. ఎస్పీ ఫకీరప్ప ప్రెస్‌మీట్‌ పెట్టి, అది ఒరిజినల్‌ వీడియో కాకపోవచ్చని చెప్పడం బట్టి, కేసును పక్కదారి పట్టించడటమే కాకుండా, సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరింత పెంచాయన్నది విశ్లేషకుల వ్యాఖ్య.

ఈ రచ్చలాంటి చర్చను కాసేపు పక్కన పెడితే.. అసలు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎవరన్నది ప్రశ్న. తానే ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేశానని ఎంపీ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ తాజాగా ఎస్పీ మాత్రం, ఎంపీ గారి అభిమాని ఫిర్యాదు చేశారని సెలవిచ్చారు. అంటే పోలీసులు ఎంపీ ఫిర్యాదును తీసుకోలేదా? అసలు బాధితుడే ఎంపీ అయినప్పుడు, ఆయన తనపై కుట్ర జరిగిందని ఫిర్యాదు చేస్తే ఆయన ఫిర్యాదును తీసుకోకుండా, అసలు కేసుకు సంబంధం లేని అభిమాని ఫిర్యాదును ఎలా పరిగణనలోకి తీసుకుంటారన్నది పామరుల ప్రశ్న. ఆ ప్రకారంగా.. ఎంపీ చెప్పినట్లు ప్రెస్‌కౌన్సిల్‌, సుప్రీంకోర్టులో పిల్‌, అన్ని వ్యవస్థలకూ కొంపతీసి అదే అభిమాని ఫిర్యాదు చేసినట్లు భావించాలా? మరి కోర్టులో బాధితుల తరఫున అభిమానులు వేసే పిల్‌ను అంగీకరిస్తారో లేదో తెలియదు.

ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో చెరపట్టి, అమరావతికి తెచ్చినప్పుడు ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సీఐడీ, దానిని ఫొరెన్సిక్‌ పరీక్షకు పంపింది. మరి ఇప్పుడు ఎంపీ మాధవ్‌ సెల్‌ఫోన్‌ నుంచి బ్లూ వీడియో వచ్చిందన్న ఆరోపణలున్నందున.. రఘరామరాజు విషయంలో అనుసరించినట్లుగానే, మాధవ్‌ ఫోన్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది మెడ మీద తల ఉన్న వారి సందేహం. మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానినే ఫొరెన్సిక్‌కు పంపిస్తే నిజానిజాలు బయటకొస్తాయి కదా? అప్పుడు అందులో ఏమీ లేకపోతే, సార్‌వాడు పులుకడిగిన ముత్యంలా బయటకొచ్చి, పార్టీ పడ్డ మచ్చను గంగా-యమున (నదులు లెండి)తో శుద్ధి చేసే మహదవకాశం ఉంటుంది కదా? అలాంటి అవకాశాన్ని పోలీసులు ఎంపీ మాధవ్‌కు ఎందుకు ఇవ్వడం లేదన్నది ప్రశ్న.

ఇక ఎంపీపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నది ఎస్పీ గారి తాజా ఉవాచ. నిజమే ఎవరూ చేయకపోవచ్చు. కానీ.. ఒక బాధ్యత గల ఎంపీపై, అందునా అధికారపార్టీ ఎంపీపై దుర్మార్గులు కుట్ర చేసి న్యూడ్‌ వీడియో ప్రపంచం మీదకు వదిలినప్పుడు.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రతిష్ఠ కాపాడేందుకు సీఐడీ ఆగమేఘాలపై రంగంలోకి దిగి, కేసును సుమోటోగా తీసుకుని బాధ్యులను చెరపట్టాలి కదా? గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కూడా ఇలాగే సుమోటోగా కేసు పెట్టి సీఐడీ ఆఫీసులో తడాఖా చూపారు కదా? అందులో సోషల్‌మీడియాపై పీహెచ్‌డీలు చేసిన చాలామంది ఆసాములు, ఆ శాఖలో ఉన్నందున ఈ యవ్వారం తేల్చడం వారికి నిమిషాల్లో పని. ఆ ప్రకారంగా సీఐడీ కూడా ఈ యవ్వారంపై సుమోటోగా కేసు పెట్టి, అయ్యగారి వీడియో బండారం బయటపెట్టవచ్చు కదా అన్నది పామరుల సందేహం.

అయితే.. ఎస్పీ తీర్పు తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టిన ఎంపీ మాధవ్‌.. చంద్రబాబు, లోకేష్‌, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు ఇళ్లకొచ్చి విప్పిచూపిస్తానంటూ పరుష పదజాలంతో వాడిన భాష సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. దానిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ‘మాధవా.. నీ వీడియోను ఇప్పటికే నాలుగుకోట్ల మంది చూశారు. మళ్లీ ఆ నలుగురికీ ప్రత్యేకంగా చూపిస్తానంటున్నావ్‌. అంత శ్రమ ఎందుకు? అట్లా ఎంతమంది ఇళ్లకు వెళ్లి చూపిస్తావ్‌? ఆ చూపించే లైవ్‌ ప్రోగ్రామేమిటో మీ పార్టీ చానెల్‌లో చూపించి, ఓటింగ్‌ పెడితే ‘అన్ని యాంగిల్స్‌’లో ప్రజలే తీర్పు ఇస్తారు. నువ్వు అంతమందికి విప్పిచూపేలోపు పదేళ్లు పడుతుంది’ అంటూ ఎకసెక్కాలాడుతున్నారు.

సరే.. ఎంపీ మాధవ్‌ వీడియో వ్యవహారంపై విచారణ చేయాలని మహిళా హక్కుల కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీకి రాసిన లేఖపై విచారణ మొదలయిందా? లేదా? అన్నది ఇంతవరకూ తేలలేదు. ఎంపీ అభిమాని ఇచ్చిన ఫిర్యాదుతోనే సరిపెడతారా? లేక కమిషన్‌ చైర్మన్‌ లేఖపై ప్రత్యేకంగా విచారణ చేస్తారా? అసలు ఇప్పటివరకూ ఏపీ పోలీసు శాఖ గానీ, డీజీపీ గానీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదన్నవి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి.

LEAVE A RESPONSE