– కడప వేదికగా నేటి నుంచి మూడురోజుల ‘మహానాడు’
– లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్
– వేదికపై కీలక నిర్ణయాలు, తీర్మానాలు
– పోలిట్‌బ్యూరోలో మార్పులు
– యువతరానికి ఇక అధికార పట్టాభిషేకం
– జగన్ సొంత జిల్లాలో ‘మహా’గర్జన
– ఎన్నికల్లో పట్టం కట్టినందుకే కడప గడపలో ‘మహా’ సంబురాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మహానాడు.. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్తేజం, ఉత్సాహం ఇచ్చే మహా వేదిక. దివంగత ఎన్టీఆర్ బీజం వేసిన ‘మహానాడు’ అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ పసుపు దళాలకు పండగే! అది ‘అన్న’ నామస్మరణకు ఆలయం!! అధికారం ఉన్నా, లేకున్నా మహానాడు సంబరాలంటే పసుపు సైన్యానికి అదో కిక్కు. సూటిగా చెప్పాలంటే.. అదో ‘మహా’రణ గర్జన. పాత-కొత్త తరాల మేలు కలయిక. ఇప్పుడు ఆ మహానాడు సంబురాలు నేటి నుంచి మూడురోజులపాటు కడప గడపలో ప్రారంభం కానున్నాయి. ఈపాటికే కడప నగరం పసుపుమయమయింది. ఇంకొన్ని గంటల్లో పసుపు పతాక రెపరెపల మధ్య ‘మహా’ సంబురానికి తెరలేవనుంది.
అసలు కడపలో మహానాడు నిర్వహించడమే చాలామందికి ఆశ్చర్యం. మహానాడు అంటే మామూలు ముచ్చట కాదు.
వేలాదిమంది తమ్ముళ్లు తరలివచ్చే మహా పండగ అది. మరి వారికి భోజన, వసతి సౌకర్యాలు, వాహనాలకు పార్కింగ్ కల్పించడం అంత సులభం కాదు. పైగా కడపలో కనీస సౌకర్యాలు ఉండవు. హోటళ్లు, విల్లాలు, కల్యాణమండపాలు తక్కువే. ఫలితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న తమ్ముళ్లు అటు ప్రొద్దుటూరు, ఇటు కర్నూలులో వసతి చూసుకోవాల్సిన పరిస్థితి. అంటే మూడురోజులపాటు ప్రతిరోజూ 60-70 కిలోమీటర్లు కడపకు వచ్చిపోవాలన్నమాట. అయినా కడపలోనే మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నారన్నదే తమ్ముళ్ల సందేహం.
గత ఎన్నికల్లో అద్భుత ం.. అనన్య సామాన్యం.. అనితర సాధ్యమైన అపురూప విజయాన్ని అందించిన కడప జిల్లా ప్రజలకు కృతజ్ఞతగానే, అక్కడ మహానాడు పెట్టినట్లు సుస్పష్టం. టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా, కడపను టచ్ చేయలేకపోయింది. ఎన్టీఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలదే హవా. ఒక్కముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా.. కడప జిల్లాలో మాత్రం ప్రభుత్వాన్ని నడిపేది వైఎస్ కుటుంబమే అన్నది నిష్ఠుర నిజం.
కానీ గత ఎన్నికల్లో.. వైఎస్ ఖాందాన్ గడీలను బద్దలు కొట్టిన కడప ప్రజల రుణం తీర్చుకునేందుకే.. జగన్ గడ్డపై మహాసంబరాలకు తెరలేపినట్లు అర్ధమవుతుంది. ఈ ఆలోచన యువనేత లోకేష్‌దే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. అది యువతరానికి పట్టాభిషేకం చేసే వేదిక కానుంది. ఇప్పటివరకూ పార్టీలో అంతా తానై నడిపిస్తున్న యువనేత లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ మహానాడు పట్టాభిషేకం చేయనుంది. ఒక్క లోకేష్‌కే కాదు. నవ నవోన్మేషమైన ఆలోచనలుండే యువరక్తం నింపే వేదిక కానుంది. పొలిట్‌బ్యూరో కూడా కుర్రాళ్లతో వికసించబోతోంది.
అంటే సీనియర్లకు దాదాపు సెలవిచ్చినట్లే. వారి అనుభవాన్ని వేరే రూపంలో వాడుకోవచ్చు. కొంద రు సీనియర్లకు స్థానం కల్పించడం ద్వారా.. పాత-కొత్త మేలు కలయికతో పొలిట్‌బ్యూరో కొలువుతీరనుంది. అన్నగారితో కలసి నడుస్తున్న సీనియర్లలో చాలామంది రిటైర్మెంట్‌కు సమీపించారు. ఇప్పటికే సీనియర్లు తమ వారసులను తెరపైకి తీసుకువచ్చారు. వారిలో కొందరు ఇప్పటికే లోకేష్‌తో మమేకమై ఉన్నారు. అంటే ఇక కొత్త స్కూలు.. కొత్త సిలబస్ అన్నమాట! ప్రధానంగా ఇకపై చంద్రబాబునాయుడు పూర్తిగా ప్రభుత్వానికే పరమితం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ చూస్తున్నారు. ఆయన తన టీమ్‌ను ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. అంతా యంగ్‌టర్క్‌లే!
ఈ మహానాడుకు అమరులను జ్ఞప్తికి తెచ్చుకునే బాధ్యత ఉంది. ఇప్పటివరకూ ఎన్నో మహానాడులు జరిగినా.. ఈ మహానాడుకు ముందున్న ఐదేళ్లలో, ప్రత్యర్ధుల దాడుల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల సంఖ్య గతంలో కంటే అధికం. పార్టీకోసం ప్రాణాలొడ్డిన వారి కుటుంబాలను ఆదుకునే పార్టీలలో ముందుండే టీడీపీ.. క్షేత్రస్థాయిలో పోరాడే యోధులను పోగొట్టుకుని, వారి యాదిలో మహానాడు నిర్వహించుకోనుంది.
‘‘గెలిచాక శాలువా కప్పేవాడికన్నా.. గెలవడం కోసం జె ండా మోసిన కార్యకర్తకు ప్రాధాన్యం ఇవ్వాల’’న్న నేటితరం కార్యకర్తల మనోభావాలు, మహానాడు గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చిన ఈ ఏడాదిలో చేసిన పొరపాట్లను సమీక్షించుకుని.. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీకోసం వివిధ రూపాల్లో పనిచేసిన వారికి, పట్టం కడతామన్న అధినేతల గత హామీలు.. మునుపటి మాదిరిగా అధికారులతో కాకుండా, కార్యకర్తలతోనే ఎక్కువ కాలం గడుపుతామన్న బాసలను.. మహానాడు మర్చిపోదన్న నమ్మకంతో, వేలాదిమంది పసుపు సైనికులు సమరోత్సాహంతో కడప వైపు అడుగులేస్తున్నారు.