Suryaa.co.in

Features

పితరులకు ప్రియం – మహాలయం

(సెప్టెంబర్ 30 నుండి మహాలయపక్షం ప్రారంభం)

నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు అమావాస్యలు ఉన్నా, వాటిలో శ్రేష్ఠమైనది మహాలయ అమావాస్య. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకూ పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు.

ఈ పదిహేను రోజులూ పితృ దేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 30వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభ మవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద నిర్వర్తించ వచ్చు. మహాలయ అమావాస్య (అక్టోబర్ 14) నాడు ఎవరైనా తమ పితృదేవతలకు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

శాస్త్ర విధి ప్రకారం ప్రతివ్యక్తి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి… భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం

సమస్త ప్రాణులకోసం కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం
ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం
పితరులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మ పితృయజ్ఞం
హోమాదులు దేవయజ్ఞం
సమాజానికి మార్గదర్శనం చేయటం కోసం అధ్యాపన బ్రహ్మయజ్ఞం.

ఈ ఐదు మహాయజ్ఞాల్లో పితృయజ్ఞానికి విశేష స్థానం ఉంది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువ కట్టలేనిది. అందుచేత పితృ దేవతలకు శ్రాద్ధకర్మ నిర్వహించడం మానవ ధర్మం. మహాలయ పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం వల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి.

‘మహాన్ – అత్యంతికోలయో యత్ర – మహాలయః’ – ‘ఆ సమంతాత్ లయం ఆలయం’ అని మహాలయాన్ని గురించి రెండు వ్యుత్పత్తి అర్ధాలు ఉన్నాయి. మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించిన రోజు. మరోఅర్ధంలో ప్రళయకాలం వరకు నిలిచివుండి అప్పుడు లయ మయ్యేది, గొప్పది మహాలయం.

దైవగణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. ఇది ఆషాఢమాసం కృష్ణపక్షం నుంచి ప్రారంభమవుతుంది. దైవబలం తక్కువగా ఉన్న సమయంలో పితృగణాలకు తిరిగి జన్మ పొందాలన్న కాంక్ష పెరుగుతుంది. తమ శక్తులను ఏకీకృతం చేసి, కర్మాధికారం కలిగిన మనవైపు అవి చూస్తుంటాయని పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢీమవధీంకృత్వా పంచమం పక్షమాశ్రితాః!
కాంక్షంతి పితరః క్లిష్టాః అన్నమప్యన్వహంజలం!!

మనుస్మృతి ప్రకారం ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి అయిదు పక్షాల కాలం వరకు అంటే భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు మన నుంచి అన్నాదులను కోరుతారు. తాపాన్ని, ఆకలిని చల్లార్చు కోవడానికి పితృగణాలు ఎదురుచూస్తాయి. ఇదే విషయాన్ని స్కాందపురాణంలోని నాగరఖండం ధృవీకరించింది.
సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది. హేమాద్రి పండితుడు రచించిన ‘చతుర్వర్గ చింతామణి’ ప్రకారం సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే, పదహారు పగటి కాలాలు పితృయజ్ఞం చేయాలి. అలా చేసినందువల్ల ప్రతిరోజూ గయాశ్రాద్ధం చేసిన ఫలం లభిస్తుంది.

పితృ ప్రీతికరం
శ్రద్ధయా దీయతే శ్రాద్ధం అంటే, శ్రద్ధతో ఏర్పాటు చేసేదే శ్రాద్ధం•. మన భౌతిక శరీరం మొదటిది; కనిపించేది. రెండోది ప్రేత శరీరం. మూడోది ఆత్మ సూక్ష్మశరీరం. ఈ మూడింటికి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే… వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడురూపాలలోని పితరులకు –
1. అగ్నిముఖం
2. బ్రాహ్మణ భోజనం
3. పిండ ప్రదానం
4. ఉపవాసం అనే నాలుగు పద్ధతులలో శ్రాద్ధం పెట్టవచ్చు.

మహాలయ పక్షంలోని రోజులతో కలిపి పితృదేవతలకు ప్రీతికర మైనవి సంవత్సరం మొత్తంమీద తొంభై ఆరు రోజులున్నాయి.
14 మన్వాదులు
16 మహాలయాలు
4 యుగాదులు,
12 సంక్రాంతులు,
12 అమావాస్యలు,
13 వ్యతీపాతములు,
13 వైధృతులు,
12 అన్వష్టకాలు
వెరసి 96 రోజులకు షణ్ణవతులు అని పేరు•. ఈ రోజులలో కనీసం ఒక్క మహాలయ అమావాస్య నాడైనా, పితరులకు తద్దినం పెట్టాలంటుంది శాస్త్రం.

అయితే, – తండ్రి మరణించిన వారే మహాలయ పక్షం చేయడానికి అర్హులు. ఒకవేళ తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినట్లయితే శ్రాద్ధం చేయడానికి అర్హత ఉంటుంది కానీ, నువ్వులతో తర్పణం మాత్రం విడువకూడదు. కుమారులు లేని పక్షంలో కూతురి కొడుకు, దౌహిత్రుడికి అధికారం ఉంటుంది. కూతురు కూడా బ్రాహ్మణుని ద్వారా కర్మ జరిపించ వచ్చు. భార్య గర్భిణిగా ఉంటే, పిండదానం కాకుండా సంకల్ప శ్రాద్ధం ఆచరించాలి.

Courtesy: ‘భక్తి’ మాసపత్రిక
సేకరణ

LEAVE A RESPONSE