Suryaa.co.in

Andhra Pradesh

రెండు ఘటనల్లోని నిందితునికి పరామర్శ సిగ్గుచేటు!

• ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి వైసీపీ నేతల కుట్ర
• సాక్షిలో తప్పుడు రాతలతో విష ప్రచారం
• బోట్లలో వచ్చి ఇసుకను తీసుకు వెళ్ళేవారు సమస్యలపై వచ్చి మంత్రి కి అర్జీ ఇచ్చారు
• కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు పక్కా వైసీపీ కార్యకర్తలే…
• సొంత జిల్లాలో డ్యాంలు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే జగన్ పట్టించుకోలేదు.. రూపాయి ఇవ్వలేదు
• వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్‌… వరద బాధితులకు జగన్‌ ఒక్క రూపాయి ఇవ్వలేదు
• హెరిటేజ్ తో పాటు అనేక సంస్థలు, ప్రజలు కోట్లు సాయం చేశారు
• సిగ్గు లేని జగన్‌.. మళ్ళీ సూపర్ 6 పథకాల మీద అవాకులు చవాకులు
• ఇలానే ప్రవర్తిస్తే వైసీపీకి 11 సీట్లు పోయి 1 మిగలడం ఖాయం!
• విలేఖర్ల సమావేశంలో మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌

మంగళగిరి: వరదలు పోటెత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని జగన్ రెడ్డి.. రెండు ఘటనల్లో నిందితునిగా ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు. వేలకోట్లు ఆస్తులు ఉన్నా వరద బాధితులకు ఒక్క రూపాయి సాయం చేయకపోగా.. నిందితునిగా ఉన్న వ్యక్తి పరామర్శకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ పథకాలపై విషం చిమ్మడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం నదుల్లో బోట్లలో వచ్చి ఇసుకను తీసుకు వెళ్ళే వారు వారి సమస్యలపై మంత్రి లోకేష్ వద్దకు వచ్చి అర్జీ ఇస్తే.. సాక్షిలో తప్పుడు రాతలు రాస్తూ.. పక్కా వైసీపీ కార్యకర్తలైన కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను టీడీపీ కార్యకర్తలుగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..
– ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు జీవనాడిలాంటిది. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తుంది. అటువంటి బ్యారేజ్ ను ధ్వంసం చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారు.
– ఈ కుట్రదారుల్లో తలశీల రఘురాం జగన్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. నందిగం సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీనే. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ముఖ్య పాత్ర వహించిన నేతల్లో నందిగం సురేష్ ఒకరు. వీరు అనుచరులుగా ఉన్న కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు పక్కా వైసీపీ నేతలు. ఒక వైపు వరదల్లో ప్రజలకోసం టీడీపీ నేతలు పనిచేస్తుంటే… మరో వైపు ఇసుక పడవలతో ప్రకాశం బ్యారేజ్ ను కూల్చేసేందుకు వైసీపీ నేతలు కుట్రచేశారు.
– బ్యారేజ్ ను కూల్చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని చూశారు. మూడు కౌంటర్ వెయిట్ల డ్యామేజ్ కు ప్రధాన కారణం వైసీపీ నేతలే. పెను ప్రమాదం జరక్కుండా రెండు రోజుల్లోనే కొత్త కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. జగన్ రెడ్డికి అసలు సిగ్గూశరంలేదు.. రెండు రోజులు కూడా ప్రజల కష్టాల గురించి ఆలోచించుకుండా. లక్షలాది మంది ప్రజలు ఆకలి కేకలితో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లి మళ్లీ సిగ్గులేకుండా వచ్చి బుధవారం వచ్చి మాట్లాడుతున్నారు.
– జగన్ రెడ్డి చేష్టలను ప్రజలందరు గమనిస్తున్నారు. నందిగం సురేష్ ఏదో స్వాతంత్ర్య సమరయోదుడైనట్టు బుధవారం పరామర్శకు రావడం సిగ్గుచేటు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్ట్ లు కొట్టుకుపోయి వందమందికి పైగా చనిపోతే ఈరోజుకు జగన్ వాళ్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. వారి కష్టాలను పట్టించుకోలేదు.
– విజయవాడలో వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడి వరద పోటెత్తితే… అధికారులతో పాటు నేతలందరిని మోహరించి ప్రజల కష్టాల్లో ఉండగా నేను ఉన్నా అంటూ చంద్రబాబు బాధితులను ఆదుకున్నారు. అధికారం పోగానే బెంగళూరుకు మకాం మార్చిన జగన్ రెడ్డి.. కటకటాల్లో ఉన్న వ్యక్తి పరామర్శకు వచ్చి సూపర్ 6 పథకాలపై అబద్దపు మాటలు మాట్లాడుతున్నారు.
– సూపర్ 6 లో ఏవైతో చెప్పామో అవి తూచా తప్పకుండా మేం అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రూ. 4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పాం.. చెప్పినట్లే ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ నిర్వహిస్తామని చెప్పాం. అది చేస్తున్నాం.
– పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూయిస్తే.. ఇస్కాన్ సంస్థతో పారదర్శకంగా ఒకేసారి 100 క్యాంటీన్ లు ప్రారంభించి చెప్పినట్లే ప్రజలకు ఎంతో సుచి శుభ్రమైన భోజనం పెడుతున్నాం. చెప్పినవే కాకుండా చెప్పని పథకాలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే సుపర్ 6 పథకాలపై జగన్ రెడ్డి అవాకులు చవాకులు పేలడం చాలా దారుణం.
– జగన్ తీరు ఇలాగే కొనసాగితే.. 11 సీట్లు కాస్త 1కి వస్తుంది.
– కూటమి ప్రభుత్వంలో ఎటువంటి కుట్రలు లేవు.. నేడు రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంది. ప్రజలు ఎంతో సంతోషంగా వారి పని వారు చేసుకుంటున్నారు జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా చీకటి రోజులే.. ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు.. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను చంపారు.
– వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రైతులపై దాడులు చేశారు. నేడు చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద గౌరవంతో వందలాది మంది తమవంతుగా భారీగా విరాళాలు ఇస్తున్నారంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాని ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల వద్దకు జగన్ రెడ్డి వచ్చి అబద్దాలు మాట్లాతున్నారు.
– ఏదైనా మాట్లాడితే.. వాటికి సాక్ష్యాలు ఉండాలి. ప్రకాశం బ్యారేజ్ ఘటనలో ఉన్న నిందితులైన వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలుగా చిత్రీకరించేందుకు యత్నం చేస్తున్నారంటే జగన్ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కాని ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు రాతలు రాయిస్తే వైసీపీకి భవిష్యత్ ఉండదు.
– ఎప్పుడూ లేనంత విపత్తు జరగడంతో విజయవాడ వరద బాధితుల కోసం అనేక ధార్మిక సంస్థలు, ప్రజలు తమ వంతుగా 10 వేల నుండి కోట్ల రూపాయలు సాయం చేస్తున్నారు. 25 ఏళ్ళ కిందట జగన్ రెడ్డి ఆస్తి ఎంత ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత..?
– సాక్షి పేపర్, సాక్షి టీవీ జగన్ రెడ్డివి కాదా? భారతిరెడ్డి ఆయన భార్యే కదా. సండూర్ పవర్ ప్రాజెక్ట్ మీది కాదా? ఎందరో బినామీల పేరుతో ఉన్న సంస్థలన్నీ మీవి కావా.. ? ప్రజలపై మమకారం ఉంటే ఒక్కరూపాయి అయినా చెక్కు ఇచ్చారా.. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు అనేక సంస్థలు కోట్ల రూపాయలు ఇచ్చాయి.
– గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజలు రోడ్డున పడితే.. హెరిటేజ్ సంస్థనుండి రూ. 40 లక్షలు ఇచ్చి తన దాతృత్వాన్ని నారా భువనేశ్వరి చాటుకున్నారు. అది వాళ్ల గొప్పతనం .. జగన్ కు ప్రజలపై మమకారం లేదు.
– అన్నమయ్య డ్యాం, పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే కనీసం అటువైపు చూడలేదు. మళ్ళీ నేడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ప్రభుత్వం వాలంటీర్లను వేధిస్తోందని, గ్రామ సెక్రటేరియేట్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ఉచిత బియ్యం ఇంటికి చేరడంలేదని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను తప్పు అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
– అసలు జగన్ ఏనాడైనా 31వ తేదీ పింఛన్ ఇచ్చారా? బటన్ నొక్కుడు పేరుతో.. కరెంట్ లేని బటన్ లు, అకౌంట్ లలో డబ్బులు లేని బటన్ లు నొక్కి ప్రజలను మోసం చేశారు.
– నేడు 31వ తేదీనే ప్రజలకు పింఛన్ అందించిన ఘనత చంద్రబాబుది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం అమరావతీలను చంద్రబాబే పూర్తిచేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది.
– జగన్ రెడ్డి అసంబద్ధమైన మాటలను వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.

LEAVE A RESPONSE