మామిడి పండు మాయా సారం

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే “వ్యామోహం” అని అంటారు.
మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే “వాత్సల్యం” అని విశదీకరించారు.
చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే “ఆప్యాయత” అని చాటి చెప్పారు.
పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే “లోభం” అని అన్నారు.
మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే “అసూయ” అని వివరించారు.
మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, “క్రోధం” అని వివరంగా తెలిపారు.
మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే “అహంకారం” అని చాటారు.
మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే “మమకారం” అని తెలిపారు.
అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా “ఆత్రం” అని విశదీకరించారు.
ఒక పండు ఆరగింపు ముద్దు,రెండు కద్దు..మూడు అసలే వద్దు…ఉండాలి దేనికయినా సరిహద్దు.
దీనినే స్వీయ నియంత్రణ అని విపులీకరించారు మన పెద్దలు.
ఇదీ మామిడిపండు రసలీలాసారం..

– ఆస్ట్రోకొతారు

Leave a Reply