-అగ్నిపథ్‌ను సమర్ధించిన కాంగ్రెస్ నేత
అగ్నిపథ్…ఇది సైనిక శిక్ష పొందిన యువకులకు పూర్తి వ్యతిరేకం… సైన్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలేంటీ? దీనిని తక్షణం రద్దు చేయాలి. -కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న వాదన ఇది…కానీ అదే కాంగ్రెస్ పార్టీ గళధారి మనీష్ తివారీ మాత్రం అగ్నిపథ్ అదుర్స్ అంటున్నారు. అవును మీరు విన్నది నిజమే కావాలంటే తివారీ ” ఇండియన్ ఎక్స్‌ప్రెస్ “పత్రికకు రాసిన వ్యాసం మీరే చదవండి..
న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ మరియు మాజీ సమాచార శాఖామంత్రి మనీష్ తివారీ తన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కి పూర్తి భిన్నమైన స్టాండ్ తీసుకుని అగ్నిపథ్ స్కీం ని సమర్థిస్తూ ఒక సుదీర్ఘ వ్యాసాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో రాశారు. దానిలోని కొన్ని అంశాలు క్లుప్తంగా తెలుగులో మీ కోసం… చదవండి…
ప్రపంచంలో అన్ని దేశాలు ఇంఫాంటరీ మిలిటరీ బలం తగ్గించుకుని టెక్నాలజీ వైపు ఎప్పుడో అడుగులు వేయడం మొదలు పెట్టాయి. 1975 నాటికి, కొరియా యుద్ధంలో చెక్‌మేట్ తోనూ మరియు వియత్నాంలో ఓటమిని ఎదుర్కొన్న US రక్షణ నిపుణులు, భవిష్యత్ సాయుధ దళం యొక్క నిర్మాణం పై తీవ్రంగా పునరాలోచించడం ప్రారంభించారు. వేగవంతమైన సాంకేతికతతో యుద్ధ చిత్రం వేగంగా మారుతుందని వారు సరిగ్గా ఊహించారు.
సైనిక వ్యవహారాల్లో రాబోయే విప్లవాన్ని చూసిన ఏకైక దేశం అమెరికా. 1970ల ప్రారంభంలో సోవియట్ సైనిక సిద్ధాంతకర్తలు కూడా సైనిక-సాంకేతిక విప్లవాలను అవలంబించడం ప్రారంభించారు. 1990ల మధ్య నాటికి, ఒక దశాబ్దపు ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోసిన చైనా కూడా తన సైనికి ప్రాథమిక పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది.
1990 గల్ఫ్ యుద్ధం మరియు 1995 తైవాన్ స్ట్రెయిట్ సంక్షోభం వంటి వాటిల్లో యు.ఎస్ శక్తి ప్రదర్శనే చైనాలో సంస్కరణలకు ట్రిగ్గర్. ఆధునిక యుద్ధాన్ని నిర్వహించగల సాంకేతిక నైపుణ్యం తమకు లేదని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం గుర్తించింది. విదేశీ శక్తులు ఆ ప్రాంతంలో జోక్యం చేసుకోకుండా నిషేధించడానికి రక్షణ వ్యయాన్ని విపరీతంగా పెంచడం ద్వారా వారు త్రిముఖ విధానాన్ని అనుసరించారు. అది ఎలా అంటే కొత్త ఆయుధాలలో పెట్టుబడి పెట్టడం, యాక్సెస్-వ్యతిరేక ప్రాంత తిరస్కరణ వ్యూహాలను మెరుగుపరచడం మరియు చైనీస్ రక్షణ పరిశ్రమను పెంచడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ఇతర సేవలు విస్తరించడంతో, 70వ దశకం మధ్యలో ఉన్న సుమారు 30 లక్షల మంది సైన్యం ఫిబ్రవరి 2016 నాటికి దాదాపు 9,75,000కి కుదించబడింది.
భారత్ లో కూడా 1999 కార్గిల్ యుద్ధం తరువాత భారత సైన్యాన్ని ఆధునికరించడానికి కార్గిల్ రివ్యూ కమిటీ సంస్కరణలు సిఫార్స్ చేసింది. దానిలో ముఖ్యమైనది సైనికుల సరాసరి వయసు తగ్గించడం. దానికోసం 1976 నుండి అమలులో ఉన్న దీర్ఘకాలిక నియామక పద్ధతి స్థానంలో స్వల్పకాలిక నియామక పద్దతి ప్రవేశ పెట్టడం. 2000 సం.లో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కూడా ఇదే సిఫార్స్ చేసింది. 2011లో ఇదే విషయం మీద యుపిఎ ప్రభుత్వం జాతీయ భద్రత మీద వేసిన నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ కమిటీ ఇదే సిఫార్సు చేసినా రిపోర్ట్ బయటకు రాలేదు.
అందువల్ల అగ్నిపథ్ మరియు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీం ను తప్పనిసరిగా రక్షణ రంగంలో సినర్జీని ప్రోత్సహించడానికి ఇతర రక్షణ సంస్కరణలు అయిన సిడిఎస్ నియామకం, సాయుధ దళాలను థియేటర్ కమాండ్‌లుగా పునర్వ్యవస్థీకరించడం మొదలగు వాటితో పాటు కలిపి చూడాలి.
భవిష్యత్తు యుద్ధంలో మానవ పాత్ర స్వల్ప స్తానం కలిగి ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలతో కూడిన సైనికులు, అత్యంత సమాచార వాతావరణంలో యుద్ధం చేయడానికి అత్యాధునిక సాంకేతికతతో మద్దతునిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ సంస్కరణ సాయుధ బలగాల సంఖ్యను సరైన పరిమాణంలో సాంకేతికంగా తయారుచేసినట్లయితే ఐదవ తరం యుద్ధం యొక్క ఆవశ్యకతలకు సహాయం చేస్తుంది….-మనీష్ తివారీ
నా మాట :
2014 నుండి అన్ని విభాగాలలో మోడీ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు అన్ని అంటే వ్యవసాయ, కార్మిక, టాక్స్ (GST), సైనిక సంస్కరణలు కనీసం 3 దశాబ్దాలుగా అనుకుంటూ ఉన్నవే. కానీ ఆనాటి పాలకులకు చిత్త శుద్ధి లోపించడం, పాలకులపై పరోక్షంగా వామపక్ష భావజాల వత్తిడి ఉండటం, సంస్కరణలు అమలు చేస్తే వచ్చే రాజకీయ ప్రకంపనలు తట్టుకునే ధైర్యం లేకపోవడంతో ఆ సంస్కరణలు దేశానికి మంచి చేస్తాయి అని తెలిసి కూడా దేశ దీర్ఘకాల అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఈ సంస్కరణలు తొక్కి పెట్టేసారు.
మోడీ దేశం హితం కోరుకుని తన రాజకీయ నష్టాలకు సిద్ధపడి అవే సంస్కరణలు అమలు చేస్తూ ఉంటే ఇన్నాళ్లూ అధికారంలో ఉండి వాటిని అమలు చేసే ధైర్యం లేక వాయిదా వేసిన వాళ్ళు ఇప్పుడు మోడీకి అడ్డుపడుతూ దేశ ప్రగతికి అడ్డుపడుతున్నారు.
వాళ్ళు రాజకీయ నాయకులు ..సరే..మరి చదువుకున్న వాళ్ళు అటువంటి రాజకీయ నాయకులకు నైతిక మద్దత్తు తెలపడం నిజంగా దేశ హితం కోరినా? లేదా దశాబ్దాలుగా ఇటువంటి సంస్కరణలు అమలు చేయమని సిఫార్సు చేసిన ఆ మేధావుల కంటే వీరు తెలివైన వారు అని అనుకోవడమా? కాదు.. మాకు అన్నిటి కన్నా మోడీ పై ద్వేషమే ప్రధానం అని అనుకోవడమా? ఏది దేశ హితం?
….చాడా శాస్త్రి