Suryaa.co.in

Features

మనిషి ఆలోచనలే ఇరుకుగా ఉంటాయి!

హైదరాబాద్ నగరంలో, సైదాబాద్ లో, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ లో, చుట్టూ పెద్ద భవంతుల మధ్య—ఒక మురికివాడ (బస్తి)
ఇల్లంటే ఇల్లు కాదు, ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులను గోడలుగా నిలబెట్టి, వాటితోనే పైకప్పు లేసి, దాన్నే ఇల్లను కొని బతుకుతున్న నిరుపేదలు. ఇలాంటివే ఒక పాతిక వరకు ఉన్నాయి. ఎక్కువమంది లంబాడీలు. నల్గొండ జిల్లా దేవరకొండ గిరిజన ప్రాంతం నుండి బతుకు పోరాటంలో నగరం చేరి, రోజువారి కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, ఇళ్ళల్లో పనివాళ్ళు గా బతుకుతున్న బడుగు జీవులు.
పేదరికానికి నిర్వచనంగా, అవిద్య కు, అనారోగ్యానికి, అలవాట్లకు చిరునామాగా, అందమైన నగరం మీద రాచపుండు లా ఉంది ఆ ప్రాంతం.
సాధారణ మధ్య తరగతి ప్రజలు కూడా, పట్టుమని పది నిమిషాలు అక్కడ ఉండలేరు. చిన్నారి చైత్ర మరణం తర్వాత అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు,కుల సంఘాల నాయకులు… కేవలం మీడియా కవరేజ్ కోసం మాత్రమే ఆ ఇంట్లో కొద్ది నిమిషాలు గడిపారు.
75 సంవత్సరాల స్వాతంత్రం తరువాత కూడా, ఈ దేశంలో కోట్లాది మంది ఇల్లు లేని, చదువులేని, ఆరోగ్యకరమైన పరిసరాలు లేని, చేయటానికి పని లేని మనుషుల
యదార్థ జీవిత వ్యధార్ద దృశ్యానికి ఒక సాక్ష్యం ఆ మురికి వాడ.
పంచవర్ష ప్రణాళికలు,ప్రతిరోజూ పెరుగుతున్న సెన్సెక్స్,రెండంకెల జీడీపీ వృద్ధి రేటు, 5 ట్రిలియన్ల ఆర్థిక అభివృద్ధి, చైనాతో పోటీ పడుతున్న భారత ఆర్ధిక వృద్ధి, స్వర్ణాంధ్ర ప్రదేశ్, హరితాంధ్ర ప్రదేశ్, బంగారు తెలంగాణ—–ఇవేమీ తెలియని, వీటన్నిటికి దూరంగా, మన లాగ మనుషుల్లాగా పుట్టిన వాళ్లే, మనం అనుభవిస్తున్న ఏ సౌకర్యం ఒక్క శాతం కూడా లేని వాళ్ళు… ఆ బస్తీ బంజారాలు.
దురదృష్టం జింకలు, లేళ్ళు తిరిగే అడవిలోనే క్రూర మృగాలు కూడా తిరుగుతాయి. అప్పుడప్పుడు ఆ క్రూరమృగాలు ఆ లేడి పిల్లల రక్తంతో తమ ఆకలి తీర్చుకుంటాయి.
ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, నగరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, నగరం విశ్వనగరం అవుతుంది, రోడ్లు విశాల మవుతాయి… కానీ మనిషి ఆలోచనలే ఇరుకుగా ఉంటాయి, ఆటవిక స్థాయి నుంచి ఎదగనంటాయి.
ఒక దుర్ఘటన జరగగానే… నాలుగు రోజులు హడావుడి, అరెస్టుతోనో, ఎన్ కౌంటర్ తోనో, ట్రైన్ కౌంటర్ తోనో ఆ విషయం ముగిసి పోతుంది. సమస్య మాత్రం మిగిలిపోతుంది.
అసలు కారణాలైన…విశృంఖల సంస్కృతి, ఎనీ టైం దొరికే మద్యం, గంజాయి, బూతు సినిమాలు, విలువలు లేని విద్యారంగం, మనిషి బలహీనతల మీద చేసే వ్యాపారాలు….. ఏవి మార్పు లేకుండా, మరింత ఉదృతంగా కొనసాగుతాయి.
మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, స్పందించే మనుషులు… కొన్ని రోజులు పోరాడతారు. కానీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ అరాచకాలకు మాత్రం అంతం ఉండదు.
వ్యవస్థలో మార్పులు రాకుండా, బతుకుల్లో మార్పు రాదన్న విషయం చదువుకున్నవాళ్ళకు కూడా ఎందుకు అర్థం కాదో…

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE