ప్రభుత్వ చేతకానితనంతోనే కౌలు రైతుల ఆత్మహత్యలు

-పెదకూరపాడులో ఆత్మహత్య చేసుకున్న రైతుకు రేపు టీడీపీ లక్ష ఆర్ధిక సాయం
– తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి

సమాజానికి వెన్నెముక లాంటి రాష్ట్ర రైతాంగం జగన్ రెడ్డి చేతకాని పాలనతో ఆత్మహత్యలతో కునారిల్లిపోతోంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మద్దతు ధరలు లేకపోవడం, భరోసా కల్పించకపోవడంతో రైతులు ప్రాణాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో 2112 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న దుర్భర స్థితికి నిదర్శనం.

రైతు సుభిక్షంగా ఉన్నపుడే రాష్ట్రం బాగుంటుందని తెలుగుదేశం పార్టీ భావించి అన్ని విధాలుగా నాడు అండగా నిలిచింది. బిందు సేధ్యం, జలకళ వంటి పథకాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. కానీ నేటి జగన్ రెడ్డి ప్రభుత్వంలో పంటలకు ప్రోత్సాహం లేదు, రుణాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం చూపిస్తున్న చిన్న చూపు కారణంగా తలదించుకుని బతకలేక రైతులు తలలు తెంచుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలపై దృష్టి సారించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ తెలుగుదేశం పార్టీ ఆర్ధికంగా అండగా నిలుస్తోంది. సామాజికంగా భరోసా కల్పిస్తోంది. మే నెలలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా ముగ్గురికి ఇప్పటికే ఆర్ధిక సాయం అందించాం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశీపాడులో ఆత్మహత్య చేసుకున్న మల్లెల శ్రీనివాసరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఆర్ధిక సాయం అందించనున్నాం. కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, దూలిపాళ్ల నరేంద్ర, నియోజకవర్గ ఇంఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు రైతు అధ్యక్షులు మద్దూరి వీరా రెడ్డి, సెక్రటరీ భాష్యం ఆంజనేయులు, గుంటూరు రైతు అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొననున్నారు.

Leave a Reply