-ఆరుగురు దుర్మరణం
– మృతుల కటుంబాలకు ప్రభుత్వం పరిహారం
– పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం కాగా మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.
క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ ప్రమాద స్థలిని పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోరస్ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గేట్లు తీయకపోయేసరికి బలవంతంగా లోపలికి వెళ్లాం. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారు. ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదు. అంబులెన్స్‌కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. షిఫ్టులో 150 మంది వరకు పని చేస్తుంటారు.
ఫ్యాక్టరీ మూసివేత
పోరస్ ఫ్యాక్టరీని మూసివేశారు. ప్రభుత్వం ఆదేశాలతో ఫ్యాక్టరీ
మూసివేశారు. పోరస్ ఫ్యాక్టరీ మూసేసినట్టు యాజమాన్యం బ్యానర్ కట్టింది.
రూ.25 లక్షలపరిహారం:ఎమ్మెల్యే ప్రతాప్
మృతుల కటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరపున రూ.25 లక్షలు,
తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రతాప్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని ప్రతాప్ పేర్కొన్నారు.
కోటి పరిహారం:పవన్ కల్యాణ్
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటన విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఏమిటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అక్కిరెడ్డిగూడెం గ్రామస్తుల ఆందోళన
ఫ్యాక్టరీకి సీల్ వేసే వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని అక్కిరెడ్డి గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు.