Suryaa.co.in

Telangana

అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్ హెల్త్ చెక్ అప్

హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమం నేడు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ఐటి , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాలమేరకు మహిళా జర్నిలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం విదితమే. శ్రీరామ నవమి సందర్బంగా నేడు, గురువారం సెలవు దినమయినందున ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని , రేపు శుక్రవారం నుండి తిరిగి యదావిధిగా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 9 వ తేదీ వరకు (ఏప్రిల్ 2 వ తేదీ ఆదివారం మినహా ) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతోపాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.

ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి.

స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని, ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..

LEAVE A RESPONSE