Suryaa.co.in

Andhra Pradesh

ఈనెల 5వ తేదీ నుండి మసుల బీచ్ ఉత్సవాలు

మచిలీపట్నం: ఈనెల 5వ తేదీ నుండి మసుల బీచ్ ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్నం మంత్రి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, స్థానిక ప్రముఖులతో కలిసి మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ ను సందర్శించారు.

సముద్ర తీరాన మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ తో కలిసి గుర్రపు స్వారి చేశాక సముద్రంలో పడవ నడిపి అందరిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు మసుల ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను అత్యంత వైభవ వేదంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ఉత్సవాలతో ప్రారంభమై మంగినపూడి బీచ్ ఎంతో అభివృద్ధి చెంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనందన్నారు.

పర్యాటకులు సముద్ర తీరానికి విచ్చేసి కొంత సమయం కాలక్షేపంగా గడిపి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, రాష్ట్రంలోని అన్ని బీచ్లలో కన్నా మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితమైనదని పర్యావరణ పరంగా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి బీచ్ టూరిజాన్ని, టెంపుల్ టూరి జాన్ని , కల్చరల్ టూరిజాన్ని పెంపొందించేందుకు అన్ని విధాల ఆలోచిస్తున్నారన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే ఈ బీచ్ లో అనేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

2018 లోనే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ బీచ్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచామన్నారు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వ హాయంలో బీచ్ నిర్లక్ష్యానికి గురైందన్నారు. బీచ్ లో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక దృష్టిసారించామన్నారు.

ఇందులో భాగంగానే మసుల బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. బీచ్ కబడ్డీ, కయా కింగ్, వాలీబాల్ వంటి పోటీలలో 29 రాష్ట్రాల నుంచి స్త్రీ పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు.

పిల్లల వినోదం కోసం కొలంబస్, జెయింట్ వీల్ , బ్రేక్ డాన్స్ వంటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాహస క్రీడల్లో భాగంగా హెలి రైడింగు, ప్యారా గ్లైడింగ్ బోటింగు వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, కలంకారి, వంటి వస్తువులు, దుస్తులతో పాటు దేశంలోని ప్రముఖ ప్రాంతాల వస్తువుల ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

దేశంలోని పలు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా వివిధ రకాల రుచులతో వంటకాలను 7 జోన్లుగా విభజించి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవిగాక వివిధ రకాల చేపలు, తాబేలు, శంఖము, ఆక్టోపస్ తదితర సముద్ర జీవుల ఆకృతులతో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అంతేకాకుండా 80 అడుగుల అమరావతి ఐకానిక్ నిర్మాణం అసెంబ్లీ టవర్ ను, 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

2018లో బీచ్ ఉత్సవాలను నిర్వహించినప్పుడు రాకపోకలకు కొంత ఇబ్బంది కలిగిందని ఈసారి అలా కాకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సంయుక్తంగా అంచనా వేస్తూ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారన్నారు.

రాష్ట్రం నుండే కాకుండా దేశంలోనీ నలుమూల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు పాల్గొనేందుకు వచ్చే అవకాశం ఉందన్నారు.
సముద్రంలో పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

బీచ్ ఉత్సవాల ప్రోమోలో భాగంగా భైరవం చిత్రం యూనిట్ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ దర్శకులు విజయ్ కనకమేడల, నిర్మాత శ్రీధర్ తదితరులు విచ్చేసి ఉత్సవాల విజయవంతం కోరుతూ మచిలీపట్నం నగరంలో 2కె రన్ లో పాల్గొన్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగినపూడి బీచ్ తొలిమెట్టుగా భావించి ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఆహ్లాదకర వాతావరణంలో వివిధ రకాల వంటకాల రుచులను ఆస్వాదించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ఈ పర్యటనలో మంత్రి, ఆర్టీసీ చైర్మన్ వెంట మెప్మా పీడీ ఉత్సవాల సంపూర్ణ పర్యవేక్షణ అధికారి సాయిబాబు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, తహసీల్దారు హరినాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రె పాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ, మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు గోపు సత్యనారాయణ, కుంచె దుర్గాప్రసాద్,రొండి కృష్ణ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE