Suryaa.co.in

Andhra Pradesh

శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్

– ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా తిప్పుతున్నారు

– పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదు?

– ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలి

– గులక రాయి దాడి కేసు బాధితుడు సతీష్‌ను పరామర్శించిన రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: ‘‘ మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్. . లేనిపోని దాన్ని తీసుకుని మభ్యపెట్టి రాజకీయం చేశారు. ఒక్క వడ్డెర కులస్తుడు జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేశారని’’ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గులక రాయి దాడి కేసును ఎదుర్కుంటున్న బాధితులను మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై గులక రాయి కేసులో నిందితులు సతీష్ ఇంటికి ఏబీ మంగళవారం వెళ్లారు. సతీష్ తల్లిదండ్రులు, పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విరుచుకుపడ్డారు.

బలహీనుడు కాబట్టి సతీష్‌ను బలి చేశారు, 45 రోజులు సతీష్‌ను జైలులో పెట్టారు. ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికీ తిప్పుతున్నారు. ఈరోజు వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వింటే గుండె తరుక్కుపోతోందన్నారు.

2 లక్షలు డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారని, కానీ నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని, సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

బాధితులు చేసిన తప్పు ఏంటి? ఏ మాత్రం సంబంధం, సాక్ష్యం లేని కేసులో ఎందుకు వాళ్ళు బాధపడాలని ప్రశ్నించారు. జగన్ఆకృత్యాలకు ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.

కేసు తక్షణమే మూసేయాలని, బెయిల్ బాండ్స్ రద్దు చేసి, వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE