Suryaa.co.in

Andhra Pradesh

సికిల్‌సెల్ క‌ట్ట‌డికి మ‌హా య‌జ్ఞం

-వైద్య ఆరోగ్య‌శాఖ‌లో జ‌గ‌న‌న్న‌ చేప‌ట్టిన మ‌రో విప్ల‌వం ఇది
-గిరిజ‌నుల కోసం గొప్ప ప్ర‌ణాళిక‌
-ఏకంగా 20 ల‌క్ష‌ల మంది గిరిజ‌నుల‌కు ఉచితంగా సికిల్‌సెల్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు
-మ‌హ‌మ్మారిని లేకుండా చేసేలా ప్ర‌ణాళిక‌
-సికిల్‌సెల్ బాధితుల‌కు రూ.10వేల పింఛ‌న్‌
-ఇప్ప‌టికే ప్ర‌తి నెలా ప్రాణాంత‌క‌వ్యాధి గ్రస్తుల‌కు రూ.35 కోట్ల ఆస‌రా పింఛ‌న్లు
-గిరిజ‌నుల‌కు మెరుగైన వైద్యం ఆలోచ‌న చేసింది జ‌గ‌న‌న్నే
-ఏజెన్సీలో ఆరోగ్య వ‌స‌తులే పెంచ‌ని వ్య‌క్తి చంద్ర‌బాబు
-గిరిజ‌న ప్రాంతాల్లో జ‌గ‌న‌న్న ఏకంగా రెండు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు తీసుకొస్తున్నారు
-ఐదు సూప‌ర్‌స్పెషాలిటీ ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నాం
-రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని
-పాడేరులో సికిల్‌సెల్ నిర్థార‌ణ పరీక్ష‌లు ప్రారంభం
-పాడేరు నుంచి అధికారికంగా ప్రారంభించిన ప్ర‌భుత్వం

పాడేరు , అల్లూరి సీతారామరాజు జిల్లా: రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైద్య ఆరోగ్య‌శాఖ‌లో మ‌రో గొప్ప య‌జ్ఞానికి తెర‌లేపార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. గిరిజ‌నుల‌ను ద‌శాబ్దాలుగా ప‌ట్టిపీడిస్తున్నసికిల్‌సెల్ రోగం నుంచి వారికి విముక్తి క‌ల్పించే ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌న్నారు. సికిల్‌సెల్ ఉచిత‌ రోగ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌ను సోమ‌వారం నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని పాడేరు నుంచి ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ మ‌న రాష్ట్రంలో సికిల్సెల్ కేసులు అనేవే ఉండ‌కూడ‌దనే ల‌క్ష్యంతో జ‌గ‌న‌న్న ముంద‌డుగు వేస్తున్నార‌ని తెలిపారు. జ‌న్యు లోపం వ‌ల్ల సంభ‌వించే ఈ వ్యాధి గిరిజ‌నుల‌ను త‌ర‌త‌రాలుగా ప‌ట్టిపీడిస్తోంద‌ని చెప్పారు. వీరి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ఏఎస్ఆర్, మ‌న్యం జిల్లాల‌తో పాటు నంద్యాల‌, ప్ర‌కాశం, ప‌ల్నాడు, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 40 ఏళ్ల‌లోపు వారంద‌రికీ సికిల్‌సెల్ ప‌రీక్ష‌లు చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నామ‌ని వివ‌రించారు.
రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 19,90,277 మందికి సికిల్‌సెల్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్దేశించుకున్నామ‌ని, వ‌చ్చే మూడేళ్ల‌లో వీరంద‌రికీ సికిల్‌సెల్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఆరున్న‌ర‌ల‌క్ష‌ల మందికి చొప్పున మూడేళ్ల‌లో అంద‌రికీ ప‌రీక్ష‌లు చేస్తామ‌న్నారు. అందుకోసం అవ‌స‌ర‌మైన అన్ని కిట్ల‌ను కొనేలా జ‌గ‌న‌న్న చ‌ర్య‌లు తీసుకున్నార‌ని వివ‌రించారు.
నిర్థార‌ణ అయితే కౌన్సెలింగ్‌, ఇత‌ర జాగ్ర‌త్త‌లు
మంత్రి మాట్లాడుతూ టెస్టులు నిర్వ‌హించాక ఎవ‌రికైతే పాజిటివ్ నిర్థార‌ణ అవుతుందో వారంద‌రికీ మెడిక‌ల్ కౌన్సెలింగ్ ఇస్తామ‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైన ముందులు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు. 2047 క‌ల్లా సికిల్‌సెల్ అనేది లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో ముంద‌డుగు వేస్తున్నామ‌న్నారు. జ‌గ‌న‌న్న రాష్ట్రంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ సెంట‌ర్స్ ఫ‌ర్ హిమోగ్లోబినోపాథిస్ ప‌రీక్ష ప్ర‌యోగాల‌ను ఏర్పాటుచేశార‌న్నారు. ఈ ల్యాబ్‌ల ద్వారా నిరంత‌రం పరీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని వెల్ల‌డించారు. పాడేరు జిల్లా ఆస్ప‌త్రి, విశాఖ‌లోని కేజీహెచ్‌, కాకినాడ‌, గుంటూరు, క‌ర్నూలు ప‌ట్ట‌ణాల్లోని టీచింగ్ ఆస్ప‌త్రుల్లో ఈ ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు.
రూ.10వేలు పింఛ‌న్‌
సికిల్ సెల్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారంద‌రికీ జ‌గ‌న‌న్న రూ.10వేలు పింఛ‌న్ అందిస్తున్నారని తెలిపారు. మ‌న రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఏకంగా 1800 మంది బాధితులు ఈ పింఛ‌న్ మొత్తాన్ని పొందుతున్నార‌ని తెలిపారు. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రికీ జ‌గ‌న‌న్న పూర్తి అండ‌గా ఉంటున్నార‌ని తెలిపారు. క్యాన్స‌ర్‌, కిడ్నీ, గుండె త‌దిత‌ర ప్రాణాంత‌క వ్యాధుల‌కు పూర్తి ఉచితంగా వైద్యం అంద‌జేస్తున్నామ‌న్నారు. వైద్య ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తున్న‌ద‌ని తెలిపారు. ప్రాణాంత‌క వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి నెల‌కు రూ.10వేలు చొప్పున ఆస‌రా పింఛ‌న్లు ఇస్తున్న గొప్ప ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని తెలిపారు. ఇలా ప్ర‌తి నెలా రూ.35 కోట్ల చొప్పున ఆస‌రా పింఛ‌న్లు అంద‌జేస్తున్నామ‌న్నారు.
గిరిజ‌నుల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు
మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ గ‌తంలో గిరిజ‌న ప్రాంతాల్లో వైద్య సేవ‌లు అత్యంత దారుణంగా ఉండేవ‌ని చెప్పారు. ఇప్పుడు జ‌గ‌న‌న్న వీరిపై ప్ర‌త్యేక శ్రద్ధ క‌న‌బ‌రుస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల‌కు 104, 108 వాహ‌నాల‌ను భారీగా పెంచిన ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం ద్వారా గిరిజన ప్రాంతాల‌న్నింటికీ ప్ర‌భుత్వ వైద్యులు ఇంటికే వ‌చ్చి వైద్య సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు.
గిరిజ‌న ప్రాంతాల్లో ఉన్న‌త వైద్యాన్ని కూడా చేరువ‌చేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న‌న్న ఏకంగా పాడేరు, పార్వ‌తీపురంలో రెండు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు నిర్మిస్తున్నారని వెల్ల‌డించారు. పాడేరులో వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచే అడ్మిష‌న్లు ప్రారంభ‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. పాడేరులో రూ.500 కోట్లు, పార్వ‌తీపురంలో రూ.600 కోట్లు.. మొత్తం రూ.1100 కోట్ల రూపాయలతో ఈ రెండు చోట్లా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, టీచింగ్ ఆస్ప‌త్రుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న గొప్ప ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని స్ప‌ష్టం చేశారు.
రాష్ట్రంలో ఏకంగా ఐదు గిరిజ‌న ప్రాంతాల్లో జ‌గ‌న‌న్న సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నార‌న్నారు. . అందుకోసం ఏకంగా 246 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో వైద్య సేవ‌ల‌ను ముందు చూపుతో జ‌గ‌న‌న్న ఎలా అభివృద్ధి చేస్తున్నారో చెప్ప‌డానికి ఈ ఉదాహ‌ర‌ణ‌లే గొప్ప నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయన్నారు. చంద్ర‌బాబునాయుడు వీటిలో ఏ ఒక్క‌టి కూడా చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. గిరిజ‌నుల కోసం ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌ని వ్య‌క్తిగా చ‌రిత్ర‌లో బాబు నిలిచిపోతార‌ని ధ్వ‌జ‌మెత్తారు.
ఇప్పుడు మ‌ళ్లీ ఓట్ల కోసం మాయ‌మాట‌లు చెబుతున్నార‌ని, వీటిని ప్ర‌జ‌లెవ‌రూ న‌మ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, స్థానిక ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి, అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, అర‌కు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ‌, జిల్లాప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సుభ‌ద్ర‌, క‌లెక్ట‌ర్ సుమిత్ త‌దిత‌రులు మాట్లాడారు.

LEAVE A RESPONSE