Suryaa.co.in

Editorial

‘నటరాజ’న్ ముందా.. నేతల నాట్యాలు?

  • కాంగ్రెస్ నేతలకు క్లాసు పీకిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్

  • ఫ్లెక్సీలు పెడితే లీడర్లు కాలేరంటూ హెచ్చరిక

  • నేతల చుట్టూ తిరగవద్దంటూ హెచ్చరిక

  • జనంలో ఉండకపోతే నష్టపోతారని స్పష్టీకరణ

( సుబ్బు)

సహజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఇన్చార్జి అంటే సీఎం కంటే ఎక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే సోనియా, రాహుల్ తర్వాత ఇన్చార్జిలే వారికి ప్రధానం. సీఎంలయినా ఇన్చార్జిల ప్రాపకం కోసం ప్రయత్నించాల్సిందే. అందుకే ఇన్చార్జి వస్తే నేతలు చేసే హడావిడి, హంగామా అంతా ఇంతా కాదు.

వారిని మంచి చేసుకునేందుకు తమకు తెలిసిన టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుకు ఇరువైపున ఆకాశంతో పోటీపడేంత ఎత్తులో ఫ్లెక్సీలు కడతారు. పత్రికల్లో యాడ్స్ ఇస్తారు. వారి కులాలను కనిపెట్టి ఆ రూట్‌లో వెళ్లే నేతలు మరికొందరు. వారు దిగే గెస్ట్‌హౌసుకు వెళ్లి తమ ప్రత్యర్ధుల మీద వచ్చీరాగానే ఫిర్యాదుల చిట్టా ఇచ్చే బాపతు మరికొందరు.

అంత ప్రాధాన్యం ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె హైదరాబాద్‌కు విమానంలో వస్తారని చాలామంది ఆశించారు. కానీ ఆమె.. ఎవరూ ఊహించని విధంగా రైలులో దిగారు. గాంధీభవన్‌కు రాగానే అక్కడ తనను స్వాగతిస్తూ వెలసిన భారీ ఫ్లెక్లీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని ఆదేశించారు. బోకేల లాంటి హడావిడి చేయవద్దన్నారు.

కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలి. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి. ఫ్లెక్సీలు, ఫొటోలు పెడితే ఎన్నికల్లో గెలవరు.నాయకులు ప్రజల్లో ఉంటేనే గెలుస్తారు.. కార్యకర్తలు ఫోన్ చేసినా మాట్లాడతా. నా కోసం రైల్వే స్టేషన్లకు నేతలు రావొద్దు. నా బ్యాగ్‌లు ఎవరూ మోయద్దు. బలం లేకపోతే నేనే సహాయం అడుగుతా. ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు..అంటూ ఓవర్‌యాక్షన్ చేసే లీడర్లకు మీనాక్షి నటరాజన్ సున్నితంగా క్లాసు పీకడంతో నేతలు ఆమె తీరు చూసి ఖంగుతినాల్సి వచ్చింది.

LEAVE A RESPONSE