Suryaa.co.in

Andhra Pradesh

సమగ్రాభివృద్ధి… ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించే బడ్జెట్

• మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు
• వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం
• సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు
• పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది
• రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నాం
• అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ రూపొందించిన కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఓ వైపు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం అయిన మౌలిక వసతుల అభివృద్ధిని పెంచేందుకు మూలధన వ్యయాన్ని భారీగా పెంచి భవిష్యత్తుకు బాటలు వేస్తే, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు తగిన కేటాయింపులు బడ్జెట్ లో చేశారని పేర్కొన్నారు. శాసన సభలో శుక్రవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గా, వ్యవసాయ శాఖ మంత్రిఅచ్చెన్నాయుడు 2025, 2026 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

అనంతరం బడ్జెట్ పై మనోహర్ , పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , శాసన సభ విప్ లు బొమ్మిడి నాయకర్ , అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ , ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మూలధన వ్యయం భారీగా పెంచడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపర్చి, పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడుల సాధనకు నిధుల కేటాయింపుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి సుమారు రూ. 47 వేల కోట్లను మూల ధన వ్యయం కింద ప్రతిపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి ఈ రూ. 47 వేల కోట్ల మూలధనం ఉపయోగపడుతుంది. ఎన్నికలకి ముందు కూటమి పక్షాలైన జనసేన, టీడీపీ, బీజేపీ కలసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అభినందనీయం.

పేద కుటుంబాలను ఆదుకోవడానికి రూపొందించిన పింఛన్ల పథకానికి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే దీపం 2 పథకం అమలుకు రూ. 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. గత దీపావళికి ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటికే 94 లక్షల మంది లబ్దిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాం.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం నుంచి వచ్చే సాయంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ మేరకు రూ. 20 వేల చొప్పున రైతు సోదరులకు అందించేందుకు కేటాయించడం అభినందనీయం. మే మాసంలో తల్లికి వందనం పథకం కింద చదువుకునే బిడ్డలకు రూ. 15 వేల చొప్పున అందించేందుకు వీలుగా ఈ పథకానికి రూ. 9,407 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం.

పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా పంచాయతీరాజ్ శాఖకు కేటాయింపులు

పరిపాలన చేతకాక, వచ్చిన అవకాశాలు వినియోగించుకోక గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో చూశాం. నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలు అంతా చూశారు. జల్ జీవన్ మిషన్ కోసం గతంలో కేంద్రం నుంచి వచ్చిన రూ.13,499 కోట్లు అప్పటి ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేకపోయింది.

పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.18 వేల కోట్లు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ నెట్వర్క్ పెంచే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఈ ప్రక్రియలో భాగంగా 4,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేశారు. మరో 1300 కిలోమీటర్లు మార్చి నెలాఖరులోపు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నాం.

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చొరవతో జల జీవన్ మిషన్ గడువు పొడిగింపు
శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకం ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 95.44 లక్షల కుటుంబాలకు తాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జల జీన్ మిషన్ అమలు గడువు గత ఏడాదే ముగియగా, గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గార్ల చలవతో ఈ పథకం మరో నాలుగేళ్లు కేంద్రం పొడిగించింది.

దీనికి చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. వ్యవసాయ శాఖ నుంచి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు రూ. 13,494 కోట్లు కేటాయించి అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలిచే ప్రయత్నం చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ధాన్యం కొనుగోలు చేయడమే కాదు 5.5 లక్షల మంది రైతులకు రూ. 7,600 కోట్లకు పైగా మొత్తం 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసి కూటమి ప్రభుత్వం వారి కళ్లలో ఆనందాన్ని నింపింది. రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం.

• విద్యుత్ సబ్సిడీ ప్రకటనతో ఆక్వా రంగానికి ఊతం

పవన్ కళ్యాణ్ గతంలో పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామాన్ని సందర్శించి పట్టు రైతుల ఆవేదనను తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం తీసుకువస్తామని చెప్పారు. ఈ రోజు ఆ హామీని అమలు చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలు ఆమోదిస్తూ లీఫ్ టూ క్లాత్ అనే కార్యక్రమాన్ని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం అభినందనీయం. వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని దెబ్బ కొట్టింది. ఒక మాఫియాలా ఏర్పడి రైతులను దెబ్బ తీసింది. ఆక్వా రంగానికి వాడే విద్యుత్ కు యూనిట్ కు రూ. 3.80 వసూలు చేశారు.

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యూనిట్ రూపాయిన్నర ప్రతిపాదించి ఆ రంగాన్న ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ద్వారా మంచి పాలన అందిస్తాం. తెలుగు భాషాభివృద్ధికి కేటాయించిన నిధులను, పర్యాటక రంగాన్ని పరిశ్రమగా ప్రకటించడం పట్ల అభినందిస్తున్నాం. రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ని జనసేన పార్టీ పక్షాన, పవన్ కళ్యాణ్ తరఫున స్వాగతిస్తున్నాం” అన్నారు.

LEAVE A RESPONSE