– రేవంత్ సర్కారు పనికిమాలిన సర్కారని తేల్చిన ఢిల్లీ కాంగ్రెస్
– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడ పాలకులుగా ఉన్న వారి దుస్థితి ఏంటో మరోసారి స్పష్టమైంది. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రులు… అదీ కాకపోతే రాష్ట్ర పార్టీ బాధ్యులుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో పాదయాత్ర చేయాలి.
కానీ అలా కాకుండా బయటి రాష్ట్రం వ్యక్తి అయినా మీనాక్షి నటరాజన్ ను తీసుకొచ్చి పాదయాత్ర చేయించడానికి బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం అవుతున్నది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు చేతగాని దద్దమ్మలు అనే విషయాన్ని పార్టీ అధిష్టానమే ఈ చర్య ద్వారా సర్టిఫై చేసినట్టుగా అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని గాని, రాష్ట్ర మంత్రులను గాని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు అని దీని ద్వారా తేటతెల్లమయింది.
మరోవైపు ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కనీసం వారు వెళ్లి గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు. అడుగు బయట పెడితే ఎక్కడికి అక్కడ ప్రజలు దుమ్ము దులిపేలా ఉన్నారు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేయకుండా వేరే రాష్ట్రానికి చెందిన మీనాక్షి నటరాజన్ తో రాష్ట్రంలో పాదయాత్ర చేయిస్తున్నారు.
నిజంగానే కాంగ్రెస్ ది ప్రజా పాలన అయితే… ప్రజలంతా కాంగ్రెస్ పాలనను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును మెచ్చుకుంటున్నది నిజమే అయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాదయాత్ర చేయడం లేదు..? బయట వ్యక్తిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే ఇది కచ్చితంగా రాష్ట్ర నాయకత్వంపై అటు ఢిల్లీ పెద్దలకు నమ్మకం లేకుండా పోయింది.. ఇటు ప్రజలు కూడా వారిని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఎందుకు పనికిరాని చేతగాని సర్కారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు.