– బి ఫాం అందజేత
-ఆర్ కృష్ణయ్య కు ఘనస్వాగతం
విజయవాడ: రాజ్యసభ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన ఆర్.కృష్ణయ్య విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నాయకత్వంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, ముని సుబ్రహ్మణ్యం ఇతర నాయకులు ఆహ్వానం పలికారు.
అనంతరం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ జీ తో సమావేశమయ్యారు. ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం స్వీకరించిన కృష్ణయ్యకు పార్టీ సభ్యత్వ రశీదు పత్రాన్ని మధుకర్ జీ అందజేశారు. రేపు పార్టీ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషను దాఖలు చేయనున్న కృష్ణయ్యతో అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించారు.
సాదరంగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య… తన పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే- తన పదవికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనేక బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
బీసీల రిజర్వేషన్లు, వారి అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. బీసీల సంక్షేమానికి, వారి అభ్యున్నతి కోసం తాను ఇప్పటివరకు అనేక పోరాటాలు చేశానని- తన సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ నేతలకు తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. పేద వర్గాలకు, బీదలకు తాను చేసిన పనులను బీజేపీ అధిష్టానం, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర నాయకులు పరిగణనలోకి తీసుకుని- తనకు రాజ్యసభ అభ్యర్ధిగా అవకాశం కల్పించారని అన్నారు.
బీసీల అభివృద్ధి దిశగా తాను పనిచేస్తానని అన్నారు. బీజేపీలో ఓ విధానం ఉందని- దశల వారీగా బీజేపీ అందరినీ ఆదుకుంటుందని చెప్పారు. అంత్యోదయ బీజేపీ లక్ష్యమని… అట్టడుగు వర్గాల సంక్షేమం, అభివృద్ధిని తన ఆశయంగా ఉందని- ఆ దిశగా పార్టీ పనిచేస్తోందని అన్నారు. తనకు పార్టీ ఏ కర్తవ్యం అప్పగించినా నెరవేరుస్తానని చెప్పారు.
బీసీ నేత కృష్ణయ్య రేపు తన నామినేషను దాఖలు చేస్తారని ఆదోని ఎమ్మెల్యే డాక్టరు పార్ధసారధి తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా బీసీలను ముందుకు తీసుకెళ్తోందని- రాబోయే రోజుల్లో కృష్ణయ్య బీజేపీ వైపు నుంచి తన వాదన గట్టిగా రాజ్యసభలో వినిపిస్తారని అన్నారు