వాడివేడి వాదప్రతివాదనాలు ఒక్కోసారి ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి పునాదిపడవచ్చు!
కోనేరు రాజేంద్రప్రసాద్ గారి మృతి అలాంటి అనుభూతిని గుర్తు చేసింది! కోనేరు రాజేంద్రప్రసాద్ గారు ట్రైమాక్స్ ప్రసాద్ గా నాకు పరిచయం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా.
పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ (73) మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. మా మధ్య పరిచయం తీవ్ర వాద ప్రతివాదనల సత్ఫలితమే. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏ.పి.యం.డి.సి.) ఎంప్లాయీస్ యూనియన్(ఎఐటియుసి)కి నేను 1990 దశకంలో కొంత కాలం పాటు గౌరవాధ్యక్షుడిగా ఉండేవాడిని. రైల్వే కోడూరు సమీపంలోని మంగపేట “గ్రే బెరైటీస్ రా మెటీరియల్”ను టిప్పర్స్ ద్వారా రవాణా చేసే ట్రైమాస్ కంపెనీ యాజమాని కోనేరు రాజేంద్రప్రసాద్ గారు.
కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్స్ పై కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఏ.పి.యం.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ చొరవ తీసుకొని వివిధ యాజమాన్యాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు మరియు ఏ.పి.యం.డి.సి. అధికారులతో సంయుక్త సమావేశాన్ని హైదరాబాదు, అమీర్ పేటలో నాడున్న హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో ట్రైమాక్స్ ప్రసాద్ గారు కార్మిక సంఘాల నాయకులు మమ్మల్ని తిట్టారు కాబట్టి వారితో “జాయింట్ మీటింగ్”, చర్చలకు మేం సిద్ధంగాలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆనాటి వరకు ఆయన్ను నేనెప్పుడు కలవలేదు, చూడలేదు కూడా. ఆయన కార్మిక నాయకులతో సంయుక్త సమావేశానికి అభ్యంతరం చెప్పడంతో నేను వెంటనే జోక్యం చేసుకుని మేము కూడా సిద్ధంగాలేము, కానీ, కార్మిక సంఘాల నాయకులు యజమానులను తిట్టారన్న ఆరోపణను భేషరతుగా ఉపసంహరించుకోవాలి, లేదా, ఎవరు తిట్టారో పేరు చెప్పాలని నిగ్గదీశా. దానిపై స్పందించిన ప్రసాద్ గారు మీరు తిట్టలేదు. వేరే వాళ్ళు తిట్టారు. మరి కార్మిక సంఘాల నాయకులందరినీ ఒకే గాటన కట్టి ఆరోపణ చేస్తూ, జాయింట్ మీటింగ్ కు అభ్యంతరం ఎలా చెబుతారని నిలదీశా. దాంతో సమావేశానికి అంగీకరించారు.
ఆ సమావేశంలో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఏ.పి.యం.డి.సి.- యాజమాన్యాలు – కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆందోళన విరమించబడింది. ఆ సమావేశంలో నిర్మోమాటంగా జరిగిన వాడివేడి వాదప్రతివాదానాల్లో నేను ప్రదర్శించిన వైఖరి తనకు నచ్చినట్లు ప్రసాద్ గారు సమావేశానంతరం మాటల మధ్య వ్యాఖ్యానించారు.
కొన్ని సంవత్సరాల తర్వాత 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుండి కా.సురవరం సుధాకరరెడ్డిగారు పోటీ చేశారు. ఎవరన్నా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా, కలిసి ఎన్నికల విరాళం అడుగుదామని నన్ను సిపిఐ రాష్ట్ర పార్టీ నాయత్వం అడిగింది. నాకు వ్యక్తి గతంగా పెద్దగా పరిచయం లేదు. కానీ, వెళ్ళి విజ్ఞప్తి చేయవచ్చన్నాను. ప్రసాద్ గారి ఆఫీసు లాండ్ లైన్ ఫోన్ నంబరు తెలుసుకొని, ఫోన్ చేసి, కా.సురవరం సుధాకరరెడ్డిగారితో పాటు సిపిఐ బృందంగా వెళ్ళి కలిశాం. ఎదురొచ్చి, చాలా ఆప్యాయంగా ఆహ్వానించి, ఒక అరగంటకుపైగా రాజకీయాలపై మాట్లాడారు. చివరలో ఎన్నికల విరాళానికి సంబంధించి హామీ ఇచ్చారు.
మా బృందానికి ఆయనిచ్చిన వాగ్దానం సంతృప్తి కలిగించలేదు. ఒకసారి పునరాలోచించాలని ఆయన్ను కోరారు. ఏం! లక్ష్మీనారాయణ మీరేమంటారని ప్రసాద్ గారు నన్నడిగారు. నేను వెంటనే పరవాలేదులేండి అన్నాను. వాస్తవానికి ఆయన ఎంత మొత్తం విరాళంగా ఇస్తానని చెప్పారో కూడా నేను సరిగా వినలేదు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయనకు నా మీద ఏర్పడిన గౌరవభావం ఆ సమయంలో నాకు సంతృప్తినిచ్చింది. అటుపై, ఆయన కుమారుడి పెళ్ళికి ఆహ్వానిస్తే, సురవరం సుధాకరరెడ్డిగారు, నేను వెళ్ళాం. మళ్ళీ, ఎప్పుడూ ఆయన్ను కలుసుకోలేదు.
చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగారు. ఆశ్చర్యపోయాను. కారణం, ఒక కేసులో జైలుకెళ్ళి తిరిగొచ్చాక ఆయనే స్వయంగా ఫోన్ చేసి పలకరించిన సందర్భం అది. మళ్ళీ ఏనాడూ ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయి, తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న సోషల్ మీడియాలో, నేడు ఈనాడులో కోనేరు రాజేంద్రప్రసాద్ గారి మరణ వార్త చదివి వారితో ఉన్న కొద్దిపాటి పరిచయాన్ని నెమరు వేసుకున్నాను.
కోనేరు రాజేంద్రప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.