మీ పిల్లలను గవర్నమెంట్‌ స్కూళ్లలో చదివిస్తున్నారా?

-ప్రభుత్వ విధానం వద్దనే అధికారం మీకెక్కడిది?
-సంస్కరణల ఫలితాలు వచ్చేందుకు కొంచెం లేటవుతుంది
-టీచర్లపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ‘అసలు మీ పిల్లలను మీరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారా? ఒక మంచిపని కోసం ప్రభుత్వం రూపొందించే విధానాన్ని వద్దని చెప్పే హక్కు, అధికారం మీకెవరిచ్చారు? మేం సంస్కరణల యజ్ఞం ప్రారంభించాం. ఆ ఫలితాలు వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుంది. స్కూళ్ల విలీనం అడ్డుకునే కుట్ర జరుగుతోంది. దీన్ని తలిదండ్రులెవరూ వ్యతిరేకించడం లేద’’ని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయు లకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని, సీబీఎస్ఈ , ఆంగ్ల మాధ్యమం లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, పాఠశాలల విలీనంపై విద్యార్దుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు. ఎవరో కుట్రలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,600 పైచిలుకు పాఠశాలలు మ్యాపింగ్ చేస్తే, కేవలం 268 పాఠశాలకు మాత్రమే దూరం అని భావిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Leave a Reply