– ఒక్క మండలంలో కూడా కరువు లేనందుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తారా..?-
కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
– ఈ మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా రైతులకు సాయం
– రైతులపై బాబుది మొసలి కన్నీరు
– రైతులను దోచుకోవడంలో టీడీపీ కొత్త పంథాలు అనుసరించింది
– టీడీపీ హయాంలో “రైతు రథం” కమీషన్ల పథకంగా మార్చారు
– బాబు హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు.. ఆ బురదను మా ప్రభుత్వానికి అంటించాలన్నదే వారి ఆరాటం
– కనీస మద్దతు ధరలపై స్వామినాథన్ సిఫార్సులను అనుసరించాలని కేంద్రానికి లేఖలు రాశాం..
-మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి
క్రాప్ హాలిడే అనేది కేవలం ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం, ఇతర కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు రైతుల్ని రెచ్చగొట్టి, రోడ్ల మీదకు తీసుకొచ్చి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక, రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని, రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉన్నాయని, గత మూడేళ్ళలో రాష్ట్రంలో ఒక్క కరువు మండలం కూడా లేకుండా పంటలు బాగా పండుతుంటే… ఎవరైనా ఎందుకు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తారని మంత్రి కాకాణి నిలదీశారు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన ఆవశ్యకతగానీ, ఆ పరిస్థితులుగానీ రాష్ట్రంలో లేవు అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు కాబట్టి, ఆ బురదను మా ప్రభుత్వంపై రుద్దేందుకే టీడీపీ తాపత్రయం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. రైతులపై చంద్రబాబుది మొసలి కన్నీరు అని విమర్శించారు. రైతుల పేరుతో ఎలా దోచుకోవచ్చు అన్నది టీడీపీ హయాంలోనే చూశామని అన్నారు. రైతు రథం నుంచి.. ఏ పథకం తీసుకున్నా, టీడీపీ హయాంలో రైతుల పేరుతో దోపిడీ జరిగిందని, దోచుకోవడంలో వారు కొత్త పంథాలను అనుసరించారని ధ్వజమెత్తారు.మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
టీడీపీ హయాంలో కమీషన్ల పథకంగా “రైతు రథం”
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంపై టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పథకం అమలు చేస్తే.. ట్రాక్టర్ల కొనుగోలు దగ్గర నుంచి పంపిణీ వరకు ఏ విధంగా కమీషన్లు కొట్టారో అందరికీ తెలుసు. ఆ పథకం కింద ట్రాక్టర్లు ఎక్కడ కొనాలి? ఎవరి వద్ద కొనాలి, ఏ కంపెనీ కొనాలి అనేది ముందే వారే నిర్దేశించి కమీషన్లు కొట్టేశారు. ట్రాక్టర్ విలువ రూ.6లక్షలుగా ఖరారు చేశామని చెప్పి, అందులో నాలుగున్నర లక్షలు రైతులు కడితే, మిగతా లక్షన్నర ప్రభుత్వం కడుతుందని చెప్పిన పరిస్థితిని చూశాం. వాస్తవానికి టీడీపీ హయాంలో రూ.6 లక్షలు అని చెప్పిన ట్రాక్టర్ విలువ, బహిరం మార్కెట్‌లో రూ.5లక్షలకు కూడా దొరికే సందర్భాలు ఉన్నాయి. ఈ లక్ష రూపాయలు ఎవరి జేబులోకి వెళ్లాయో రైతులందరికీ తెలుసు. అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా దాదాపు 175 మోడల్స్‌లో రైతులు కోరుకున్న ట్రాక్టర్, హార్వెస్టర్, రోటావేటర్ తీసుకుంటే ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొనుగోలు చేస్తే, 40 శాతం సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని చెప్పాం. ఇందుకు అనుగుణంగా మెగా మేళా నిర్వహించి, దాదాపు 4వేల ట్రాక్టర్లు ఇస్తూ, 175 మోడల్స్‌కు సంబంధించి రూ.175 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇదీ పారదర్శకత అంటే.
– ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అవగాహన, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మాటలు పట్టించుకునే అవసరం లేదు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతవరకూ ఏప్రభుత్వం చేపట్టలేదు. మధ్య దళారులు ఎవరూ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా, పారదర్శకంగా రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశాం. గతంలో అయితే పైనుంచి కింద వరకూ, చివరకు టీడీపీ శాసనసభ్యులకు కూడా కమీషన్లు వెళ్ళేవి. అలాంటి వ్యవహారాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు అందరి ఆస్తి అనేలా రైతులకు భరోసా కల్పిస్తూ వ్యవసాయ పరికరాలు ఇవ్వడం జరిగింది. రైతు సంఘమే దాన్ని మెయింటెన్ చేయడంతో పాటు దానికి సంబంధించి నిర్వహణ, మరమ్మతులు కానీ తక్కువ ఖర్చుకు చేయడం జరుగుతుంది. అలాగే చిన్న, సన్నకారు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
రైతు పక్షపాతి ప్రభుత్వం
టీడీపీ హయాంలో రైతులకు ఏం మేలు జరిగింది, మా హయాంలో రైతు పక్షపాతి ప్రభుత్వంగా వ్యవసాయనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో రైతుల కోసం ఈ మూడేళ్ళలో చేసిన ఖర్చు చూస్తేనే అర్థమవుతుంది.
– జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక.. ఈ మూడేళ్లలోనే రైతులకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది.
– వ్యవసాయం గురించి మాట్లాడే అర్హతే టీడీపీకి లేదు. మీ హయాంలో ఏం చేశారు, మా ప్రభుత్వం వచ్చాక, ఈ మూడేళ్ళలో రైతాంగానికి ఎంత అండగా నిలిచారనేదానికి ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది. ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాలి. టీడీపీ హయాంలో రైతులకు మేలు గురించి ఆలోచనే చేయలేకపోయారు కానీ, కమిషన్ల కక్కుర్తిలో మాత్రం వారు కొత్త పంథాకు తెరతీశారు. రైతుల్ని అడ్డుపెట్టుకుని నీరు-చెట్టు పేరుతో దోచుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను అడ్డుపెట్టుకుని దోచుకున్న ప్రభుత్వం ఎదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే.
– రైతులమీద చంద్రబాబు నాయుడుది మొసలి కన్నీరే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. తన ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగానే.. మా ప్రభుత్వ హయాంలోనూ క్రాప్ హాలిడే ప్రకటించాలనేలా తెగ తాపత్రయపడిపోతున్నాడు. చంద్రబాబు క్రాప్ హాలిడే రికార్డును, ఆ బురదను అందరికీ అంటించేందుకు కొంతమంది టీడీపీ నాయకులతో, టీడీపీకి మద్దతిచ్చే పార్టీలతో విమర్శలు చేయిస్తున్నాడు.
– అసలు ఎందుకు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తారో వారే చెప్పాలి. మీ హయాంలో ఏటా వందలకు వందలు కరువు మండలాలు ప్రకటించారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్ళలో ఒక్క ఏడాది కూడా ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించిన పరిస్థితి లేదు. మీ హయాంలో రిజర్వాయర్లు వెలవెలపోతే… ఇప్పుడేమో కళకళలాడుతున్నాయి. అయినా క్రాప్ హాలిడే ప్రకటించాలనే ఉద్దేశ్యంతో కొంతమంది రైతులను రోడ్ల మీదకు తెచ్చి గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారు.
– మా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం. కనీస మద్దతు ధరల ప్రకటన అంశం.. కేవలం మన రాష్ట్రానికే సంబంధించినది కాదు. వరి పండించే ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటిది. దీనిపై కేంద్రానికి లేఖ రాశాం. స్వామినాధన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రకటించాలని గతంలో అనేక మార్లు కోరాం. అలాగే రైతుల ఖర్చులను లెక్కించి, దానికి 50శాతం అదనంగా వచ్చేవిధంగా మద్దతు ధర ప్రకటించాలని కోరతాం. రైతుల విషయంలో ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తేలేదు. రైతులకు అన్నివిధాలా అండగా ఉంటాం. కొంతమంది రైతులను రెచ్చగొట్టేలా కుట్రలు పన్నుతున్నారు. దీనిపై రైతాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి.
– గత ప్రభుత్వం, మా ప్రభుత్వం చేస్తున్న విధానాలు, రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలను రైతులంతా గమనించాలి. దీనిపై ఎక్కడైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.