Home » టీడీపీ కడుపు మంట బ్యాచ్ అవాకులు,చెవాకులు

టీడీపీ కడుపు మంట బ్యాచ్ అవాకులు,చెవాకులు

– క్రాప్ హాలిడే ప్రకటించింది ఎక్కడో చూపించండి.. ఆ పరిస్థితులే రాష్ట్రంలో రానివ్వం
– మీటర్లు బిగించినందు వల్ల ఏ రైతుకైనా రూపాయి అదనపు భారం పడుతుందా, సబ్సిడీ తగ్గించామా..?
– 96 శాతం మంది రైతులు మీటర్లకు అంగీకరించారు.. నకిలీ రైతులకు ఎందుకు భాధ..?
– వేరుశనగతో సహా 7 పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిది
– 2018-19లో వ్యవసాయ బడ్జెట్ ను 10 శాతానికి తగ్గిస్తే అయ్యన్న, దేవినేనిలాంటివాళ్ళు ఎందుకు మాట్లాడలేదు?
– రైతు భరోసా కేంద్రాలు జగన్‌ బ్రెయిన్‌ చైల్డ్‌ ప్రాజెక్టులు
– వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..?రాష్ట్రంలో తాను రైతు పక్షపాతిని అని ప్రకటించుకుని పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తాను రైతు పక్షపాతిని అని, తమది రైతు ప్రభుత్వమని ప్రకటించుకున్నారు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇవాళ ప్రతిరైతు జీవిత కాలం గుర్తుపెట్టుకునేలా, తరతరాలు మరిచిపోలేనట్లుగా రైతాంగం కోసం శాశ్వత వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలని నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోపక్క రైతుల మీద ఒత్తిడి లేకుండా వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద పెట్టుబడి సాయం అందించే కార్యక‍్రమం నుంచి ఉచితంగా పంటల బీమా పథకం వరకూ చెప్పింది చెప్పినట్లుగా, చెప్పిన సమయం కన్నా ముందే చేస్తున్నారు.
ఏదైనా విపత్తు వచ్చినా పంటలు నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందించాలని ముఖ్యమంత్రిగారు శ్రీకారం చుట్టారు. రైతులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసినదానికన్నా ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. రైతుల హృదయాల్లో ముఖ్యమంత్రిగారు స్థానం సంపాదించుకుంటుంటే.. దీన్ని సహించలేని టీడీపీ కడుపుమంట బ్యాచ్‌ రోడ్లమీదకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు. బహుశా కడుపుమంటకు కారణం ఏంటంటే టీడీపీకి రాష్ట్రంలో పట్టగతులు ఉండవని అర్థం అయింది. దాంతో సీజన్‌కు ఒక అవతారం ఎత్తే టీడీపీ నేతలు.. ఈ సీజన్‌లో రైతు ప్రేమికుల అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకులకు సిగ్గూ,శరం అనేది భగవంతుడు పెట్టలేదు. బుద్ధి, జ్ఞానం లేనట్లు మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రికి అయ్యన్నపాత్రుడు లేఖ రాయడం చూశాం. అంతకు ముందు దేవినేని ఉమ, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా అచ్చుగుద్దినట్టు అలాంటి లేఖలే రాయడం చూశాం. తండ్రీ, కొడుకు ఎక్కడో హైదరాబాద్‌లో విశ్రమిస్తూ.. రోజుకు ఒక కార్యక్రమం తీసుకుని ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిగారిపై బుదర చల్లాలనే ఎజెండాతో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో పంటల సాగు బాగుంది, రైతులు బాగున్నారు. అయితే గంజాయి సాగుచేసేవారు కొందరు టీడీపీ నేతలు మాత్రమే బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం గంజాయి సాగును జరగనివ్వదు. సాగుచేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. గత మూడు నెలల నుంచి ఎస్పీగారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో దాడులు జరిపి, పట్టుకుంటేనే ఉన్నాం. ఇదంతా చూస్తుంటే మీ గంజాయి సాగు జరగడం లేదనే కడుపుమంటతో వ్యవహరిస్తున్నట్లు ఉంది.
ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కళ్లలో ఆనందం, సంతృప్తితో ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. టీడీపీ నాయకులు రాసిన లేఖలు చూస్తే అనంతపురం జిల్లాలో పదిలక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ మాట్లాడుతున్నారు? ఎక్కడ పంట నష్టపోయింది. డ్రైస్పెల్‌ ఉన్నప్పుడు వాతావరణం మార్పు ఉంటుంది. కోస్తా జిల్లాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారని చెబుతున్నారు … ఎక్కడ క్రాఫ్‌ హాలిడేని ప్రకటించారో చూపించండి. మీ హయాంలో అమలాపురం ప్రాంతంలో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామంటే అప్పటి హోంమంత్రి చినరాజప్ప పోలీసులతో రైతులను బెదిరించిన మాట వాస్తవం కాదా? వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితే ఉత్పన్నం కాదు. పెట్టుబడి సాయం దగ్గర నుంచి పంట నష్టపోయిన సాయాన్ని సకాలంలో ఇస్తున్నాం. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం మేము ఇవ్వం.
తాజాగా మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ.. టీడీపీ నాయకులు తెగ బాధపడిపోతున్నారు. మీటర్లు బిగించడం వల్ల ఏ రైతుకన్నా అదనపు భారం పడుతుందా? రూపాయి సబ్సిడీ తగ్గించామా? కేవలం ఒక బాధ్యత ఉండాలని, విద్యుత్‌ సంస్థలకు వేలకోట్లు బకాయిలు పడకుండా, నాణ్యమైన విద్యుత్‌ అందించాలంటే ఒక వ్యవస్థను సక్రమంగా నడపాలని ఈ విధానం తీసుకువస్తున్నాం. దీనికి కూడా రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటే 96శాతం మంది రైతులు అనుకూలమని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. మరి వారికి లేని బాధ మీకెందుకు వచ్చింది. నకిలీ రైతులకు ఎందుకంత బాధ. మీకు రైతులంటే కేవలం అమరావతి రైతులేనా? భూములంటే రియల్‌ ఎస్టేట్‌ భూములేనా? మీకు అంతకు మించి ఇంకేమీ కనపడవు.
రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఎక్కడ ఏ పంటకు చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ఇన్‌వాల్వ్‌ అవ్వాల్సిందే అని ముఖ్యమంత్రిగారు మమ్మల్ని ఆదేశించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకు కాకుండా, మరో ఏడు పంటలకు వేరుశెనగ సహా ఉల్లి, బత్తాయి, అరటి పంటలకు ఎమ్మెస్పీ ప్రకటించిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిది. ఏ పంటకు ఎంత ఎమ్మెస్పీనో రైతు భరోసా కేంద్రంలో డిస్‌ప్లే చేస్తున్నాం. ఎక్కడైనా పంట నష్టపోతే కొనుగోలు చేస్తున్నాం.
పంట కొనుగోలు చేయడం లేదని టీడీపీ మాట్లాడుతోంది. మీ హయాంలో ఏం కొన్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం? వాటి లెక్కలు తీస్తే బడ్జెట్‌లో 2014-15లో వ్యవసాయానికి 12 శాతం ఉంటే, 2018-19లో దాన్ని 10 శాతానికి కుదించారు. అదే జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019-20లో 13 శాతం ఉండగా, 2020-21 సంవత్సరానికి బడ్జెట్ ను 14 శాతం పెంచాం.
– వ్యవసాయ బడ్జెట్ ను తగ్గించిన మీరా రైతుల మీద ప్రేమ గురించి మాట్లాడేది? వ్యవసాయానికి బడ్జెట్‌లో కోత వేస్తుంటే.. ఈరోజు మాట్లాడుతున్న వారంతా అప్పట్లో ఏం చేశారు. ఇప్పుడు లేఖలు ద్వారా మాట్లాడుతున్న టీడీపీ పెద్ద మనుషులకు నోట్లో నాలుక లేదా? అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎందుకు మాట్లాడలేకపోయారు? అలా మాట్లాడటానికి మీకు అసలు సిగ్గుందా? మాట్లాడేముందు కొంచెం అయినా ఆలోచించాలి కదా?
ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే..
2014-15లో 40.62 లక్షల టన్నులు కాగా, దాని విలువ రూ. 5,583 కోట్లు ఉండగా, టీడీపీ దిగిపోయేనాటికి కొనుగోలు చేసిన ధాన్యం విలువః రూ. రూ. 9, 362 కోట్లు
– వైయస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే, మేము వచ్చాక సీజన్ లో అంటే 2018-19లో రూ. 12, 639 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
2019-20 రూ. 15, 037 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
2020-21లో రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా?
దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు లేఖలు రాసేటప్పుడు అయినా గతంలో ఏం జరిగింది అని చూసుకోవాలి కదా? దాదాపుగా మీరు కొన్నదాన్ని కన్నా వందశాతం ఎక్కువగా మా ప్రభుత్వం ధాన్యం కొన్నది. అలాంటిది రైతులను నిర్లక్ష్యం చేసింది మేమా.. మీరా..?
ఇతర పంటల కొనుగోలు విషయానికి వస్తే… మార్కెట్‌ ద్వారా పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, జొన్న, గ్రౌండ్ నట్, మిల్లెట్స్.. అన్నీ కలుపుకుంటే..
మీరు 2014-15లో కొనుగోలు చేసిందిః రూ. 402 కోట్లు
అదే మా ప్రభుత్వం 2019-20లో కొనుగోలు చేసింది రూ. 2,595 కోట్లు
-కోవిడ్‌ సమయంలో ఉల్లి, అరటి, బూడిద గుమ్మడి కాయలు, బత్తాయిలు కొనుగోలు చేశాం. బత్తాయి, అరటి కొనుగోలు చేసి, మహిళా సంఘాలతో ఇంటింటికీ పంపించాం.
– పూలు పండిస్తున్న రైతులు నష్టపోతుంటూ టీటీడీ ద్వారా పూలు కొనుగోలు చేసి ఇతర దేవాయాలకు పంపించడం జరిగింది.
– క్రాప్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ- క్రాప్ బుకింగ్ అయితే చాలు ఒక్క రూపాయి కట్టక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మీ హయాంలో రైతు వేల రూపాయలు ప్రీమియం కట్టినా వస్తుందో రాదో తెలియదు.
– రైతులకు ఎంతమందికి ఇన్సురెన్స్‌ చేశారో చూస్తే 2016-17లో 17.79 లక్షలు
2017-18 సంవత్సరంలో 18. 22 లక్షలు, 2018-19లో 24.83 లక్షలు
కాగా టీడీపీ హయాంలో మొత్తం 60.84 లక్షలు మాత్రమే ఉండగా,అదే మా ప్రభుత్వ హయాంలో 2019-20, 20-21 సంవత్సరాల్లో కోటీ 21 లక్షల 11 వేల మంది రైతులకు పంటల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ రెండేళ్ళలో రూ. 3,716 కోట్లు ఇన్సూరెన్స్ చెల్లించాం. మీకు, మాకు అసలు ఎక్కడైనా పొంతన ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. మీరా మాపై విమర్శలు చేసేది. మీ అయిదేళ్ల కాలంలో చెల్లించింది కేవలం రూ.2, 500కోట్లు మాత్రమే. గతం మర్చిపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి అనవాయితీనే. రైతుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు.
రైతు భరోసా కేంద్రాలను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పర్యటించి అద్భుతమని ప్రశంసించారు. కేంద్ర బృందాలు, కర్ణాటక, తమిళనాడు నుంచి అధికార బృందాలు పర్యటించి ప్రశంసలు కురిపించాయి. ఇవన్నీ జగన్‌గారి బ్రెయిన్‌ చైల్డ్‌ ప్రాజెక్టులు.
– రూ.15వేల కోట్లతో రాష్ట్రంలో మల్టీ పర్సస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ విధానాన్ని తీసుకు వస్తున్నాం. ఇదే కాకుండా రైతుల ఉత్పత్తుల విలువ పెంచేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రొసెసింగ్‌ కేంద్రాన్ని తీసుకువస్తున్నాం. దాదాపు 3వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నాం. మీరు ఏఒక్క విషయంలోనూ రైతుల గురించి మాట్లాడటానికి సరిపోరు. మీ హయాంలో రైతులకు విత్తనాలు కావాలంటే రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి పోలీసులతో లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చేది. ఇవాళ రైతు భరోసా కేంద్రం వద్దే కావాల్సిన విత్తనాన్ని రైతులు తీసుకునేలా చర్యలు చేపట్టాం. ఒకవేళ రైతులకు విత్తనాలు నచ్చక వెనక్కి ఇచ్చేస్తే తీసుకుని, వారికి కావాల్సిన విత్తనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించారు.
అన్నీ ఈ-క్రాప్‌ బేసిడ్‌ ద్వారా సోషల్‌ ఆడిట్ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్నాం వెళ్లి చూసుకోండి. అచ్చెన్నాయుడిగారు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలేదు బొక్కాలేదన్నారు కదా… దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పుడప్పుడు లేఖలు రాయడం, అవాకులు చెవాకులు పేలడం, మీకు కావాల్సిన పేపర్లలో మీకు ఇష్టం వచ్చేలా రాయించుకోవడం చేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మీ గంజాయి సాగులు ఇక్కడ సాగవు ఇవి ఖాయం. జనాలకు అవసరం అయిన పంటలకు ప్రభుత్వం సాయం చేస్తాం.
టీడీపీ హయాంలో రైతుల లెక్కల్ని తగ్గించాలని చంద్రబాబు చూస్తారు. అదే జగన్ గారు ఎవర్నీ వదల వద్దని, ప్రతి ఒక్కరికీ సాయం అందాలని చెబుతారు. రైతు భరోసా పెట్టుబడి సాయం పథకం లబ్దిదారుల సంఖ్య తగ్గుతుందని టీడీపీ నేతలు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. మొదటి ఏడాది ఈ పథకం ద్వారా 46,69,375 కుటుంబాలు కవర్‌ అయ్యాయి. 2020-21 ఏడాదిలో 51,59,045 కుటుంబాలు లబ్ది పొందగా, మూడో ఏడాదికి వస్తే.. మొదటి విడతలో 51,98,034 కుటుంబాలకు అందించాం. వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ ద్వారా 17వేల కోట్లకు పైగా ఇవ్వడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు వారి ఖాతాల్లో నేరుగా వేశాం.
అదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.87 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని రకరకాల లెక్కలు వేసి దాన్ని 25వేల కోట్లకు తెచ్చి, చివరికి ఇచ్చింది రూ. 12వేల 750 కోట్లు. అదే చెప్పినదానికన్నా ఎక్కువ ఇచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది. మీరు అయిదేళ్ల కాలంలో చేసిన రుణమాఫీ కన్నా.. ఈ రెండేళ్ళలో మేము ఇచ్చిన పెట్టుబడి సాయం ఎక్కువ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన దానికన్నా ఈ రెండేళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి రైతులకు చేసింది ఎక్కువ. ఆ లెక్కలు తీసుకోండి. ఖాళీగా కూర్చుని ప్రచారం కోసం ప్రభుత్వంపై బురద చల్లడం కాదు.
– వడ్డీలేని రుణాలు పరిశీలిస్తే… 2014-15 నుంచి 2018-19 వరకూ మీరు ఇచ్చింది రూ. 685కోట్లు. మీరు రైతులకు పెండింగ్‌ పెట్టిందీ, బ్యాంకులకు మేము చెల్లించిన మీ పాత బకాయిలు రూ. 688కోట్లు. వాటిని మా ప్రభుత్వం చెల్లించింది. మేము వచ్చే నాటికి విత్తన బాకీలు కూడా తీర్చకుంటే రూ. 385 కోట్లు మా ముఖ్యమంత్రి ఇచ్చారు. మీరు పెట్టి వెళ్ళిన ధాన్యం బాకాయిలు రూ. 2వేల కోట్లు, శెనగ రైతులకు క్వింటాలకు రూ.1500 చొప్పున ఇన్‌సెంటివ్ ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చారు. మొక్కజొన్న రైతులకు మీరు ఇస్తానని, ఇవ్వలేని రూ 93 కోట్లు మా ముఖ్యమంత్రి చెల్లించారు. ఏనాడు అయినా మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? చివరికి పేపరు మిల్లులకు కర్ర తోలిన రైతాంగానికి డబ్బులు రాకుంటే అవి కూడా మేమే చెల్లించాం.
ఇప్పటికైనా పరిపాలన అంటే ఎలా చేయాలో తెలుసుకోండి. రాష్ట్రంలో అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు పెట్టి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతినెలా క్రమం తప్పకుండా రైతుల నుంచి సమాచారం, సలహాలు, సూచనలు తీసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది మా ప్రభుత్వం. ఎప్పుడైనా రైతులు సూచనలు చేస్తే కనీసం విన్నారా మీరు? అదే మేము రైతుల దగ్గర నుంచి కోరి సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. రైతుకు ఎలాంటి ఇబ్బది రాకుండా ప్రతిరోజు వ్యవసాయంపై సమీక్ష జరుపుతూ వారికి కావల్సిన అవసరాలను సమకూర్చుతున్నాం. ఇది వాస్తవం.
కడుపుమంటతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు. పదాలు వాడేటప్పుడు కొంచెం సంయమనం పాటిస్తే మంచిది. లేకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని ప్రజలు నమ్మినట్లు అయితే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ఇచ్చిన ఫలితాలే నిదర్శనం. మాట్లాడేటప్పుడు, లేఖలు రాసేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే మంచిది. ఎవరో రాసిన లేఖలపై సంతకాలు పెట్టడం కాదు. దేవినేని ఉమ… పోలవరం ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడటమా? గతం మర్చిపోయే అలవాటు మీకుంది కానీ, మీ గతాన్ని మేము మర్చిపోం. మీరు ఏం చేశారో, మీది ఎలాంటి చరిత్రో ప్రజలు గుర్తుంచుకున్నారు.
మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు వంగా గీత కూడా మాట్లాడారు.

Leave a Reply