ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మంత్రి కొడాలి నాని క్షీరాభిషేకం

– అభిమానులంతా పార్టీలకతీతంగా పాల్గొనాలి
– వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపు

గుడివాడ, జనవరి 28: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) క్షీరాభిషేకం చేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్రను నిర్వహించారని తెలిపారు. ఈ యాత్ర కృష్ణాజిల్లాలో జరుగుతుండగా సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని 2018 వ సంవత్సరంలోనే కోరడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతానని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. దీనిలో భాగంగా విజయవాడ క్యాపిటల్ గా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారన్నారు.

గుడివాడ నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ రెండుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే స్టేడియం నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి కొడాలి నాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకనుగుణంగా సీఎం జగన్మోహనరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానిగా, ఆయనను ఆరాధించే వ్యక్తిగా మంత్రి కొడాలి నాని ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ పాదాభివందనాలు తెలియజేశారన్నారు.

సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని గుడివాడ నియోజకవర్గ, పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారని చెప్పారు. ఈ నెల 29 వ తేదీన ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సీఎం జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పారు. గుడివాడ నియోజకవర్గ, పరిసర ప్రాంత ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులంతా పార్టీలకతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దుక్కిపాటి శశిభూషణ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, పాలడుగు రాంప్రసాద్, చుండూరి శేఖర్, కొంకితల ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply