Home » ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్”

ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్”

-సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న జనం

అమరావతి: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న యువనేత.. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అండతో 4 కోట్ల విలువైన భూమి కబ్జా
విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో రూ.4 కోట్ల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైసీపీ ప్రభుత్వ అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, సీఐ బి.శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని అక్రమించారని యువనేత ఎదుట వాపోయారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ భూమిని కాపాడాలని కోరారు. సమస్యను విన్న నారా లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆరేళ్ల నుంచి గుండె, ఊపిరితిత్తుల వ్యాధితోబాధప డుతున్నానని, 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ పైనే ఆధారపడి బతుకుతున్నానని చూచుకొండ శ్రీనివాసరావు యువనేత ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సాయం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

కరెంట్ బిల్లు సాకుతో వితంతు పెన్షన్ తొలగించారు

విద్యుత్ షాక్ తో రెండు చేతులు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాటిబోయిన రవీంద్ర నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కరెంట్ బిల్లు సాకుతో వైసీపీ ప్రభుత్వం తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ, హైమావతి కోరారు. ఎలాంటి ఆధారం లేని తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన కే.రజినీ కోరారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పెన్షన్ అందించాలని యర్రబాలెంకు చెందిన మువ్వా గంగాభవానికి విజ్ఞప్తి చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన బిరుదు కమలాకరరావు కోరారు. పీజీ చదివిన తాను రాష్ట్ర స్థాయి పారా క్రీడల్లో రాణించానని, పేదరికంలో ఉన్న తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన షేక్ సల్మా విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నేషనల్ హైవే అథారిటీ అమరావతి యూనిట్ ను విజయవాడ ఎన్ హెచ్ ఏఐ ప్రాజెక్టు యూనిట్ లో కలిపేందుకు ఉత్తర్వులు జారీచేశారని, దీనివల్ల మంగళగిరి యూనిట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డునపడుతున్నారని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కోరారు.

మున్సిపల్, కార్పోరేషన్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు వ్యాయామ దర్శకులుగా అప్ గ్రేడ్ చేస్తూ పదోన్నతి కల్పించాలని చిత్తూరుకు చెందిన బి.శారద కోరారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఏపీ ఆన్ లైన్ మండల కోఆర్డినేటర్స్ గా విధులు నిర్వహించిన తమకు ఉద్యోగ అవకాశం, భద్రత కల్పించాలని ఏపీ ఆన్ లైన్ మండల కోఆర్డినేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. బీటెక్ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని విశాఖకు చెందిన వెల్లూరి అజయ్ పాల్ కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.

Leave a Reply