– ప్రత్తిపాటి పుల్లారావు
– జనసేన – టిడిపి ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో పరిశీలన
చిలకలూరిపేట, నవంబర్ 18 : చిలకలూరిపేట మండలం పసుమర్రు, గుదేవారిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేశ్‌తో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ పసుమర్రు, గుదేవారిపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి మూడేళ్లు దాటినా కాలనీల అభివృద్ధి ఏదని ధ్వజమెత్తారు.
పసుమర్రులో 170 ఎకరాలు, గుదేవారిపాలెంలో 70 ఎకరాలు కలిపి 240 ఎకరాలు సేకరించి 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. భూసేకరణలో ఎకరానికి రూ.10 లక్షలు దోచుకున్నారని వైకాపా నాయకులే హైకోర్టుకూ వెళ్లారని గుర్తు చేశారు. కమీషన్లు కూడా చెక్కులు తీసుకున్నారని.. డబ్బులు ఇస్తేనే అవి తిరిగిచ్చేలా కాగితాలపై రాయించుకున్న చరిత్ర స్థానిక పెద్దలదన్నారు. ఇదంతా స్థానిక మంత్రి విడదల రజిని కనుసన్నల్లో, చెప్పుచేతల్లోనే జరిగిందని రాష్ట్రంలో ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయనంత అవినీతిని ఆమె చేశారని ఆరోపించారు.
ప్రతిక్షణం ఆమె ఆలోచన డబ్బు గురించే అని దుయ్యబట్టారు. 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినవాళ్లు వారందరికీ ఇళ్లు ఎందుకు పూర్తి చేసి ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. స్థలాల సేకరణలో కేవలం కమీషన్ల కక్కుర్తితో ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జగనన్న కాలనీల కోసం మొత్తం 68,350 ఎకరాల భూములు కొన్నట్లు నీతి ఆయోగ్‌కు సీఎం జగన్ చెప్పారని.. మంత్రివర్గ సమీక్షలో ఏమో 23 వేల ఎకరాల భూములు కొన్నట్లు చూపించారన్నారు.
రూ.56,108 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేసినట్లు నీతిఆయోగ్ లెక్కలు చూపారని తెలిపారు. కానీ నీతిఆయోగ్‌కు చెప్పిన భూములు కొనలేదు.. వసతుల కల్పనకు డబ్బులూ వెచ్చించలేదన్నారు. ఇదంతా చూస్తుంటే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ కోసం జగనన్న కాలనీలు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది తప్ప పేదవాడికి ఇల్లు కట్టించే ఇద్దామనే చిత్తుశుద్ధి కనిపించడం లేదన్నారు. అదే సమయంలో చిలకలూరిపేటలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,500 ఇళ్లను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఇళ్లను అప్పగించక పోవడంతో అద్దెలు, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేశ్ మాట్లాడుతూ…. జగనన్న కాలనీల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని జనసేన నేత తోట రాజా రమేశ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు జగనన్న కాలనీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల భూసేకరణ కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.40 లక్షలకు విక్రయించి మంత్రి రజిని పెద్దఎత్తున దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
జగనన్న కాలనీల్లో ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అడవిలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పసుమర్రు గ్రామ నాయకులు, పట్టణ కౌన్సిలర్స్, తెలుగుదేశం జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.