హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
యోగి హెలికాప్టర్ ను ఢీ కొట్టిన పక్షి
వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్
యోగి లక్నో వెళ్తుండగా ఘటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి లక్నో వెళ్లేందుకు అధికారులు ప్రభుత్వ విమానం ఏర్పాటు చేశారు. బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గాన యోగి బాబట్ పూర్ విమానాశ్రయానికి వెళ్లారు.