Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో తప్పులు నిజం

-తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు
– ఆ ఐదేళ్లు పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదు
– టీడీపీ ఆఫీసుపై దాడి చేసినా స్పందించలేదు
– పవన్ వ్యాఖ్యలపై నో కామెంట్
– పోలీసు బాస్ ద్వారకా తిరుమలరావు

అనంతపురం: గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగిన మాట నిజమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంగీకరించారు. అయితే తప్పు చేసిన అధికారులు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ, కేరళ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారు. తనపై, పోలీసుశాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యపై తాను స్పందించబోనని అన్నారు.

గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని.. గత ప్రభుత్వ హయాంలో కొన్ని పొరపాట్లు, తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీజీపీ వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదని, ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని
అన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని రాసుకున్నారు తప్పితే.. ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదని వివరించారు. ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని గుర్తుచేశారు. దీనిపై నివేదిక తొలుత జీఏడికి వెళుతుందని, అక్కడి నుంచి తమకు అందుతుందని చెప్పారు. తప్పు జరిగితే ఎన్ని ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతూ.. కేరళలో ఓ ఐపీఎస్ కు 20 ఏళ్ల తర్వాత శిక్ష విధించారని డీజీపీ గుర్తుచేశారు.

మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పోలీసు వ్యవస్థను ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

LEAVE A RESPONSE