మనమే కేసీఆర్​ కు మీటర్​ పెడదాం: ఈటల రాజేందర్​

57

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని.. కేంద్ర విద్యుత్ బిల్లు విషయంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని.. కానీ కేసీఆర్ మాత్రం ఆ మాట పదే పదే చెప్తున్నారని విమర్శించారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారని.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో ప్రజలంతా కలిసి సీఎం కేసీఆర్ కు మీటర్ పెట్టాలని వ్యాఖ్యానించారు.

ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడతారంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్న సీఎం కేసీఆర్.. మరోవైపు రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా కరెంటు చార్జీలు పెంచారని ఈటల చెప్పారు. అడ్డగోలుగా వస్తున్న కరెంటు బిల్లులతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని.. సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో, బయటా బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు జిగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.