Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

– పశ్చిమ నియోజకవర్గములో నిలిచిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రి నారా లోకేష్ ను కోరిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
– నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభినందించిన నారా లోకేష్

గుంటూరు: పశ్చిమ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులకు నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునందించాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసములో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబందించిన పలు అభివృద్ధి పనులను వినతిపత్రం రూపంలో ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు.

ఈ సందర్భంగా “మీతోనే నేను – మీవెంటే నేను” అంటూ నిత్యం ప్రజలకు, పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేస్తున్న కృషిని, ఆమె పనితీరును నారా లోకేష్ ప్రశంసించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంత్రి నారా లోకేష్ ను కోరారు.

ప్రధానంగా రాజధాని అమరావతిలో భాగమయిన గుంటూరులో డ్రైనేజి వ్యవస్థ లోపం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షాకాలం వస్తే ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని, గతంలో టిడిపి హయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థకు శ్రీకారం చుట్టామని అని, వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని నిర్లక్ష్యం చేసి మిగిలిన పనులను వదిలి వేసిందని, కాబట్టి మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను పూర్తి చేయటానికి అవసరమయిన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

అదేవిధంగా 2018లో గుంటూరు మిర్చి యార్డ్ ఎదురు బిసి భవన్ నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం స్థలం కేటాయించినదని, వైకాపా ఆ పనులను ప్రారంభించకుండా కక్షపూరితంగా వ్యవహరించిందని, వెంటనే ఈ పనులను ప్రారంభించటానికి అవసరమయిన నిధులు కేటాయించాలని, అదేవిధంగా బృందావన్ గార్డెన్స్ లోని నార్ల వెంకటేశ్వర ఆడిటోరియం మరియు ఏసి కళాశాల ఎదురు ఉన్న అంబేద్కర్ భవన్ పనులను గత వైసిపి ప్రభుత్వం గాలికి వదిలివేయటం వలన పనులు నిలిచిపోయాయని, కాబట్టి వెంటనే అవసరమయిన నిధులు కేటాయించి, పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

వీటన్నిటిని పరిసిలించిన నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అండగా ఉంటానని నారా లోకేష్ ఎమ్మెల్యే గళ్ళా మాధవికి హామీనిచ్చారు. అనంతరం నిన్న గుంటూరు నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటి ఎన్నికల్లో ఘన విజయము సాధించటంలో కేంద్రమంత్రి పెమ్మసాని నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎన్డీయే కూటమి నేతలు చేసిన కృషిని లోకేష్ అభినందించారు. ఇదే స్పూర్తితో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే గళ్ళా మాధవికి సూచించారు.

LEAVE A RESPONSE