జగన్ ఇమేజీకి… ఎమ్మెల్యేల డ్యామేజీ

– ఆ మంత్రులు, ఎమ్మెల్యేల చర్యలపై సీఎంఓ నిఘా
– ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్న నేతలపై ఆరా
– పార్టీ వారైనా కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశం
– తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏపై కేసు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎం జగన్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలపై సీఎంఓ కన్నేసింది. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏర్పాటు చేసిన ఇసుక, మద్యం వ్యవస్థకు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తు, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీస్తున్న వైనంపై సీఎంఓ సీరియస్‌గా ఉంది. రాష్ట్రంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఇసుక, మద్యం, మైనింగ్, క్వారీ వ్యాపారాల్లో తలదూరుస్తూ.. జగన్ ఇమేజీని డ్యామేజీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎంఓ.. వారి జాబితాను తీసుకున్నట్లు సమాచారం. అటు పార్టీ నేతలు సైతం ఇసుక, మద్యం, మైనింగ్ దందాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా నష్టం లేకపోయినప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ అక్రమ వ్యాపారాలతో కోట్లు సంపాదిస్తున్నారన్న అభిప్రాయంతో ఉండటం జగన్ ఇమేజీకి డ్యామేజే కలిగించేదేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం సరఫరాకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థను సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలే నిర్వీర్యం చేస్తున్న వైనంపై ఇక కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయం కోసం ఏర్పాటుచేసిన ఈ వ్యవస్థను సొంత పార్టీలే గౌరవించకుండా, అడ్డగోలుగా వ్యవహరిస్తూ పట్టుబడి సోషల్‌మీడియాలో రచ్చ అవుతున్న వైనం ప్రభుత్వాన్ని ఆందోళనపరుస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం.. స్వయంగా ఇసుక ట్రాక్టరును విడిచిపెట్టాలని ఇచ్చిన ఫోన్ ఆదేశాలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. గతంలో ఆయన నియోజకవర్గంలోనే సోదరుడు నిర్వహిస్తున్న పేకాట్ డెన్‌పై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి, సోదరుడితో సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా సోదరుడి కారు డ్రైవరుపైనా కేసు నమోదు చేశారు.
అలాగే ప్రకాశం జిల్లాలో వైసీపీ అగ్రనేతలు… ఫలానా మంత్రికి తాము డబ్బులిచ్చేశాం కాబట్టి తామేమీ చేయలేమన్న పలు ఆడియో సంభాషణలు విమర్శలకు దారితీశాయి. అక్కడ మైనింగ్ కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒక మంత్రికి వాటిని అందిస్తున్నారు. అయినా విజిలెన్స్ అధికారులు ఇటీవలి కాలంలో వసరగా దాడులు చేసి, కేసులు పెట్టడంతోపాటు భారీ స్థాయిలో పెనాల్టీలు విధిస్తుండటంతో.. డబ్బులిచ్చిన క్వారీ యజమానులు, పట్టుబడ్డ లారీ డ్రైవర్లు వైసీపీ నేతలపై ఒత్తిళ్లు చేస్తున్న ఆడియో రికార్డింగ్ సంభాషణలు, వైసీపీ పరువును రోడ్డునపడేస్తున్నాయి. నెల్లూరులో కొందరు ఎమ్మెల్యేలే సూత్రధారులుగా జరుగుతున్న ఇసుక దందా, విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఓ మంత్రి దన్నుతో ఒక సర్పంచ్, మరో ఎమ్మెల్యే సాగిస్తున్న ఇసుక, మద్యం దందా బహిరంగరహస్యంగా మారింది. చిత్తూరు జిల్లాలో ఇసుక-మద్యం దందా చేస్తున్న ఒక సాధారణ సర్పంచ్.. తమ అనుచరులను తరచూ విదేశాలకు తీసుకువెళుతున్నారంటే, ఈ దందాలో ఎవరెంత సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో బయట రాష్ట్రాల నుంచి లిక్కర్, భారీ స్థాయిలో దిగుమతి అవుతోందన్న ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. అదే జిల్లాలో మైనింగ్, క్వారీలున్న ఓ నియోజకవర్గంలోని మరొక ఎమ్మెల్యేకి నెలకు 4 నుంచి 6 కోట్లు వస్తున్నట్లు సీఎంఓకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికయిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా, ప్రతిపనికీ ఓ రేటు కట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా ఎన్నికయిన ఒక ఎమ్మెల్యే పీఏ, స్వయంగా ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు కంపెనీ ఇసుక రవాణాను అడ్డుకున్నారు. తర్వాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయనపై కేసులు నమోదు చేయడం ద్వారా, ప్రభుత్వం ఎమ్మెల్యేలకు హెచ్చరిక సంకేతం పంపినట్టయింది. కృష్ణా జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు ఇసుక, క్వారీ వ్యాపారాల్లో కోట్టు గడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రకాశం జిల్లాలో మైనింగ్, క్వారీలున్న రెండు నియోజకవర్గాల వైసీపీ ప్రముఖులు, నెలకు పదికోట్లకుపైగానే సంపాదిస్తున్నట్లు సీఎంఓకు సమాచారం ఉన్నట్లు వినికిడి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులపైనా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్ తవ్వకాల తరలింపు వెనుక ఓ మంత్రితోపాటు, వైసీపీ జాతీయ స్థాయి కీలక నేత ఒకరి దన్ను ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో ఒక మంత్రి జోక్యంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. సొంత శాఖలో ఇటీవల ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల వెనుక గోల్‌మాల్ జరిగిందని బాధిత ఉద్యోగులు మొత్తుకుంటున్నారు.
విశాఖలో ఎమ్మెల్యే అనుచరులు సామాన్యులపై చేస్తున్న దాదాగిరి, ఎంపీ పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. దీనిని గ్రహించిన ఎంపీ విజయసాయిరెడ్డి తనపేరుతో ఎవరు బెదిరించినా, వారిపై కేసులు పెట్టాలని మీడియాముఖంగానే చెప్పడం గమనార్హం. అంటే విశాఖలో భూముల దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంది. చిత్తూరులో ఓ ఎమ్మెల్యే అడ్డగోలు సంపాదనపై ఇటీవల సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదు చేశారన్న చర్చ జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలో ఏ పనిచేయాలన్నా పదిశాతం కమిషన్ ఇచ్చి తీరాల్సిందేనన్న ప్రచారం బహిరంగంగానే జరుగుతోంది.
ఇసుక రీచ్, మైనింగ్, క్వారీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే అవినీతి విశృంఖంగా జరుగుతున్నట్లు సీఎంఓ గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఇసుక.. కర్నాటక,తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతున్నట్లు తెలుస్తోంది. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు,పాండిచ్చేరి, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులోని జిల్లాల నుంచి.. మద్యం ఎక్కువగా దిగుమతి అవుతున్నట్లు సీఎంఓ గుర్తించినట్లు సమాచారం. కర్నూలు జిల్లా సరిహద్దుకు బళ్లారి ఆనుకుని ఉండటంతో.. కర్నూలు జిల్లా నుంచి ఇసుక తరలించి, తిరిగి వచ్చే అదే వాహనాల్లో లిక్కరును తీసుకువస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ట్రిప్పునకు 10-12 లక్షల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల్లో కొందరు వైసీపీ నేతలు ఇదేవిధంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ ఎస్‌ఐని మంత్రి జయరాం బెదిరించిన వీడియో లీకవడం ప్రస్తావనార్హం.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇసుక, లిక్కరు విధానం తీసుకువచ్చిన జగన్ లక్ష్యాన్ని, సొంత పార్టీ నేతలే దెబ్బతీస్తున్నారని గ్రహించిన సీఎంఓ, ఆ మేరకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీసులకు ఆదేశాచ్చింది. ఇసుక ఎగుమతి-లిక్కర్ దిగుమతి ద్వారా, ప్రభుత్వ ఖజానాకు వందలకోట్ల నష్టం వస్తోందన్నది అధికారుల అంచనా. పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్‌ను తక్కువ ధరకు కొని, ఏపీలో ఎక్కువ ధరకు అమ్ముతుండటం వసల్ల ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల ఆదాయం పడిపోతోంది. దానితో రంగంలోకి దిగిన సీఎంఓ.. అక్రమ రవాణా చేసేది, సొంత పార్టీ నేతలయినా విడిచిపెట్టవద్దని పేర్కొన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే ప్రైవేటు కంపెనీ ఇసుక రవాణాను అడ్డుకున్న గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే పీఏపై సైతం కేసు పెట్టడం ప్రస్తావనార్హం.

Leave a Reply