Suryaa.co.in

Andhra Pradesh

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ఫిర్యాదు

గుంటూరు: ఈ నెల 27వ తేదీన జరుగనున్న కృష్ణా- గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కె.యస్‌.లక్ష్మణరావు పోటీ చేయుచున్న సంగతి విదితమే.

ఎన్నికలు పోటా-పోటీగా జరుగుతున్న తరుణంలో గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వేదికలలో కొందరు వ్యక్తులు దురుద్దేశంతో కె.యస్‌. లక్ష్మణరావుపై దుష్ప్రచారం చేయుచున్నారు.

కొద్ది సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్మోహనరెడ్డి కి ప్రజా సమస్యల పరిష్కారానికై వినతిపత్రం ఇవ్వబోగా, క్రిందపడిన కాగితాలను తీయడానికి క్రిందకు వంగిన కె.యస్‌. లక్ష్మణరావు వీడియోలను జగన్మోహనరెడ్డి ‘‘పాదాలపై పడిన కె.యస్‌.లక్ష్మణరావు’’ అని ఓటర్లలో గందరగోళం సృష్టించి లబ్ది పొందాలనే దురుద్దేశ్యంతో కొంతమంది సోషల్‌ మీడియా వేదికలలో దుష్ప్రచారం చేస్తున్నారు.

దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వ్యక్తులపై తగు చర్యలను తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చారు.

కె.యస్‌.లక్ష్మణరావు గతంలో 3 పర్యాయాలు శాసనమండలి సభ్యులుగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేశారు. ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పి.డి.ఎఫ్‌) సభ్యునిగా మచ్చలేని ప్రజా జీవితం గడిపారు. కానీ కొంత మంది రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.

అలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై తగిన సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి,విచారణ జరిపి నిందితులపై తగు చర్య తీసుకోవాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, ఏపి డిజిపి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ మరియు ఎస్పీలకు కె.యస్‌.లక్ష్మణరావు ఎన్నికల చీఫ్‌ ఏజెంట్‌, న్యాయవాది ఎస్‌. రమేష్‌ బాబు సోమవారం తగు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE