the number you have dialled is switched off.. అంటూ మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఈ వాయిస్ తరచుగా వినిపిస్తుంటుంది. సూచనలు ఇస్తుంటుంది. అసలు ఈ గొంతు ఎవరిధో చాలామందికి తెలియదు. ఈ స్వరం దేశంలో అన్ని మొబైల్స్ లోనూ వినిపిస్తుంటుంది.
ఇలా చెబుతున్న వ్యక్తి.. మహారాష్ట్ర కి చెందిన మేఘనా ఎరాండే ది. ఈ 40 ఏళ్ళ అమ్మాయికి దేవుడిచ్చిన వరం కమ్మని స్వరం. ఇంతేకాదు.. ఈమె టీవి లో పిల్లలు ఇష్టంగా చూసే కార్టూన్ సిరీస్ లో అనేక క్యారెక్టర్లకు ముద్దు ముద్దుగా డబ్బింగ్ చెబుతుంది. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఈమె పేరెంట్స్ ఇద్దరివీ చిన్న ఉద్యోగాలే.
అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం చేయాలి. సినిమా అవకాశాలు వచ్చినా మేఘనా వద్దంది. చిన్నప్పటి నుంచి టీవీ లో వచ్చే యాడ్స్ చాలా ఆసక్తికరంగా చూసేది.. వాషింగ్ పౌడర్ నిర్మా.. అంటూ అచ్చంగా అలాగే అనుకరిస్తూ స్కూల్ పిల్లలకి ఎంటర్టైన్ చేసేది. తను కూడా ఇలా చెబితే బాగుణ్ణను కునేది. ఆ వైపు అడుగులేసింది.
1989లో తొలిసారిగా డిస్నీ వారి డక్ టేల్స్ లో డబ్బింగ్ చెప్పే అవకాశం సద్వినియోగ పరుచుకుంది. మరి వెనుదిరిగి చూడలేదు. అనతికాలంలోనే బిజీ ఆర్టిస్ట్ గా మారి తన సంపాదన ఎంతో తనకే తెలియనంత బిజీ అయ్యింది. తన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోయేవారు. ఏ నెట్ వర్క్ లోనైనా ఈమె రికార్డెడ్ గొంతే వినిపిస్తుంది. చాలా ఆకర్షణీయమైన వాయిస్ కావడంతో తమ యాడ్స్ లలో ఈమెనే తీసుకుంటున్నారు. ఎవరి వయసుకు తగ్గట్టుగా వారు మాట్లాడేలా ఈమె చెప్పగలడం ఓ పెద్ద ప్లస్ పాయింట్.
మేఘనాకి పబ్లిసిటీ ఇష్టం ఉండదు. ఇరవై ఏళ్ళకి పైగా తన గుర్తింపు పైకి రాకుండా జాగ్రత్త పడింది. ఐతే.. ఈమె కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి మేఘనా ట్యాలెంట్ ను వివరిస్తూ ఓ వీడియో తీయడంతో బాగా వైరలై ఒక్కమాటు సెలిబ్రెటీ ఐపోయింది. ఇంటర్వ్యూల కోసం మీడియా వారు మీద పడటంతో కొంచెం గాభరా కూడా పడింది. బొంబాయిలో పుట్టి పెరిగిన మేఘనా.. పూణే రైల్వేస్టేషన్ లో రైళ్ళ రాకపోకల సమయ వివరాలకి వాయిస్ కూడా ఇస్తోంది. అనేక మరాఠీ సినిమాలలో డబ్బింగ్ చెప్పింది.
రెండు ఆంగ్ల చిత్రాలకి కూడా డబ్బింగ్ చెప్పి హాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆంగ్లం, హిందీ, మరాఠీ.. ఈ మూడు భాషల్లో మేఘనాకి మంచి పట్టు ఉండటంతో చాలా సులభంగా డబ్బింగ్ చెప్పగలుగు తోంది.. గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. డిస్కవరీ ఛానల్ కార్యక్రమాలలో కూడా ఈమె గొంతు తరచూ వినిపిస్తుంటుంది. ఇలా ఇన్ని విధాల ఎడతెరిపి లేకుండా పనిచేస్తుడటంతో మేఘనా భారతదేశంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.
బొంబాయిలో ఓ స్టూడియో అధినేతగా ఉన్న సుధీర్ ని మేఘనా ప్రేమ వివాహం చేసుకుంది. ఐరా అని తమ కుమార్తెకి పేరు పెట్టుకున్నారు. చదువుల్లో నెంబర్ వన్, వృత్తిలో కూడా నెంబర్ వన్ అనిపించుకున్న ఈ మరాఠీ అమ్మాయి మేఘనా ఎరాండే కి అభినందనలు తెలియజేద్దాం.
– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం
ఫోన్ 99855 61852….