– 75 ఏళ్లో ఒక్క బీసీనైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందా?
– మోదీని విమర్శిస్తే బీసీ సమాజమే సరైన బుద్ధి చెబుతుంది
– మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి స్పందన
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవి. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని మరిచిపోయి.. నోటకొచ్చినట్లు అవాక్కులు, చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రధానమంత్రి బీసీనా కాదా? అని అంశంపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాను. రోజురోజుకూ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోతున్న నేపథ్యంలో.. అసహనంతో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారానికి దూరమవడం, మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ గుండుసున్నాలతో అవమానం పాలవడాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ రెడ్డిలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.
ఆకాశం పైకి ఉమ్మేస్తే పెద్దోడిని అయిపోతానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయనపైనే పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వతహాగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా.. దేశంలో బీసీ అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడిగా ప్రధానమంత్రి కి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. సామాజిక సమరసత విషయంలో బీజేపీకి, నరేంద్రమోదీకి.. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్స్ అవసరం లేదు.
బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన నరేంద్రమోదీ ప్రభుత్వం. కేంద్రమంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్రమోదీది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఇలా సామాజిక సమరసతతో పనిచేసిన సందర్భాలున్నాయా? అని రేవంత్ లెక్క చెప్పగలరా?
మోదీ సర్కారు వచ్చిన తర్వాత నీట్ పరీక్షల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు కలిపించినందునే.. ఇవాళ బీసీ తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఉన్నతవిద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తున్నాయి. ఒకటా రెండా? బీసీల అభ్యున్నతికోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న పనుల జాబితాను నేను ఇవ్వగలను. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. రాష్ట్రమంతా అట్టహాసంగా సర్వే నిర్వహించి తమకు అన్యాయం చేశారని బీసీ సంఘాలే విమర్శలు చేస్తున్నాయి. ఇంత అసమగ్రంగా సర్వే చేశారంటూ మండిపడుతున్నాయి. దీన్నుంచి తప్పించుకోవడానికి, మీరు మోదీ మీద విమర్శలు చేస్తున్నారు. మీ అసమర్థతమీద చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల వాగ్దానం సందర్భంగా.. ఐదేళ్లకు లక్షకోట్లు, ఏడాదికి 20వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని అని.. ఎంతవరకు పూర్తిచేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపోలేక.. మోదీ ను తక్కువ చేసి తప్పించుకుందామనుకుంటున్నారు. ఇదేనా మీ చిత్తశుద్ధి? తెలంగాణలో బీసీల పురోగతికోసం రాష్ట్ర బడ్జెట్ లో రేవంత్ సర్కారు ఎంత కేటాయించింది? ఎంత విడుదల చేసింది? ఒక్కటంటే ఒక్క బీసీ వర్గమైనా మీ పాలనలో సంతోషంగా ఉన్నారా? ఇదేనా మీ చిత్తశుద్ధి?
నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 75 ఏళ్లో ఒక్క బీసీనైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందా? తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ. అనవసరంగా బీజేపీపై, మోదీ పై విమర్శలు చేస్తే.. ప్రజలు ఊరుకోరు. మోదీని విమర్శిస్తే బీసీ సమాజమే సరైన బుద్ధి చెబుతుంది.